తెలంగాణ ప్రభుత్వానికి మరీ ఇన్ని మొట్టి కాయలా?
తెలంగాణలో ఫిరాయింపు కంపు: జీరో టాలరెన్స్ అంటే ఓ జోక్!;
ఫిరాయింపుల మీద 2025 జులై 31 నాటి సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకం అనుకోవచ్చు. కాని ఈ విమర్శలు, అభిశంసనలు అనేవి కొత్తవేమీ కాదు. కాని ఒక ముఖ్యమంత్రికి, స్పీకర్ కి మొట్టికాయలు గట్టిగా పడటం చరిత్రాత్మకమే. ఎందుకు?
తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "ఉప ఎన్నికలు జరగవు" అని చేసిన వ్యాఖ్యను సుప్రీంకోర్టు ఖండించింది. "సభలో ఇటువంటి మాటలు మాట్లాడితే, మీ ముఖ్యమంత్రి రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌ను అపహాస్యం చేస్తున్నట్లే" అని సుప్రీంకోర్టు పేర్కొంది.
గతంలో ముఖ్యమంత్రిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోకపోవడం పొరపాటేనా అని జస్టిస్ బి.ఆర్. గవాయ్ తీవ్రంగా ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఏడాది పాటు జాప్యం చేయడంపైనా సర్వోత్తమ న్యాయ ధర్మాసనం మందలించింది. (అంటే చాలదేమో ‘తల అంటించింది’ అంటే సరిపోతుంది). బి ఆర్ ఎస్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు మూడు నెలల గడువు విధించింది.
అనర్హత విషయాలను విచారించేటప్పుడు స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై విసుగు చెందిన కోర్టు, "ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైస్" అనే వ్యంగ్య పదబంధాన్ని ఉపయోగించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి, స్పీకర్ ఇద్దరినీ కోర్టు మందలించడం, జవాబుదారీతనం, రాజ్యాంగ ప్రక్రియలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదా?
ఓ చోట ముఖ్యమంత్రి, మరో సందర్భంలో స్పీకర్ ఇద్దరిపైనా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని రాజకీయ నాయకులందరినీ, ముఖ్యంగా తెలంగాణ నాయకులను సిగ్గుపడేలా చేస్తాయి.
ఎంత అన్యాయం! అనైతికం! అసలు మాట్లాడుతుంటే స్పృహలోనే ఉంటారా? “ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు కోరుకున్నా సరే, ఉపఎన్నికలు జరగవు” అనే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలను ఏమనాలె? కేవలం వ్యాఖ్యలని అంటామా, సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించడం అంటూ మర్యాదంగా మనం చెప్పడం అవసరమా? “అసెంబ్లీలో ఇలాంటి మాటలు మాట్లాడితే, ముఖ్యమంత్రి పదో షెడ్యూల్‌ని అపహాస్యం చేస్తున్నట్లే” అని సుప్రీంకోర్టు మొహమాటం లేకుండానే వాయించింది.
న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ తీవ్రంగా ప్రశ్నిస్తూ, “గతంలో ఇలాంటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కనీసం కొంత సంయమనం పాటించాల్సింది కదా? గతంలో ఆయనపై చర్యలు తీసుకోకుండా, కోర్టు ధిక్కారంగా పరిగణించకుండా మేము తప్పు చేశామా?” అని నిలదీశారు. నిగ్రహాన్ని కోర్టు ఎంతగా గౌరవిస్తుందో పునరుద్ఘాటిస్తూ, “మేము ప్రజాస్వామ్యంలోని ఇతర రెండు విభాగాలను గౌరవిస్తాము; అదే గౌరవాన్ని ఇతర రెండు విభాగాల నుండి కూడా ఆశిస్తాము” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
జస్టిస్ గవాయ్ సూటిగా మరో ప్రశ్న వేశారు: “మేము అప్పుడు కోర్టు ధిక్కారంగా చర్య తీసుకోకుండా తప్పు చేశామా? రాజకీయ నాయకుల ప్రకటనలతో మాకు సంబంధం లేదు, కానీ గతంలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వ్యక్తితో మాకు సంబంధం ఉంది” అని అన్నారు.
రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు మూడు ముక్కల్లో చెప్పాలంటే:
- “ఈ ఎమ్మెల్యేని కూడా ఈ ప్రక్రియను ఆలస్యం చేయడానికి ఎంత మాత్రమం అనుమతించకూడదు”.
- “స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉండదు”.
- “ఈ ప్రక్రియ మూడు నెలలకు మించి ఆలస్యం కాకుండా ముగించాలి” అని స్పష్టం చేసింది.
సంవత్సరం పాటు నిష్క్రియాత్మకంగా ఉన్న స్పీకర్‌ను సుప్రీంకోర్టు లాంఛనంగా తప్పుబట్టి, “స్పీకర్ నాలుగు సంవత్సరాలు చర్యలు తీసుకోకపోయినా, కోర్టులు వాటిని గమనిస్తాయి” అని తన బాధ్యతను గుర్తు చేసింది.
“ఏ ఎమ్మెల్యే కూడా ఈ ప్రక్రియను ఆలస్యం చేయడానికి వీలు లేదు. అవసరమైతే స్పీకర్ ప్రతికూల నిర్ధారణలు తీసుకోవాలి” అని తీర్పు సారాంశంలో సుప్రీంకోర్టు పేర్కొంది.
- “అర్హతను నిర్ణయించే అధికారిగా స్పీకర్ వ్యవహరిస్తున్నప్పుడు, ఆయన ఒక ట్రైబ్యునల్ లాగా వ్యవహరిస్తారు, హైకోర్టులలో సుప్రీంకోర్టు పరిధిలోకి వచ్చితీరతాయి. ఈ విషయంలో స్పీకర్‌కు రాజ్యాంగ రక్షణ ఉండదు.”
- “10 మంది ఎమ్మెల్యేల అనర్హత ప్రక్రియను వీలైనంత త్వరగా, మూడు నెలలకు మించకుండా ముగించాలి.”
జస్టిస్ గవాయ్ గట్టిగా అడిగారు: “స్పీకర్ కార్యాలయం ఈ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఒక గడువు ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పటివరకు మొదటి దరఖాస్తు దాఖలు చేసి ఎంత కాలం అయ్యింది? అది ఒక సంవత్సరం అనిపిస్తోంది.”
నోటీసులు జారీ చేయడంలో జరిగిన ఆలస్యంపై ధర్మాసనం విమర్శిస్తూ:
- ‘‘ఇది స్పీకర్ పదవీకాలం చివరిలో జరగాలా? ప్రజాస్వామ్య విలువలు ఏమైపోయాయి?” అని ప్రశ్నించింది.
- “శస్త్రచికిత్స విజయవంతం అయింది, కానీ రోగి చనిపోయాడు”
అనే సామెతను ఉటంకిస్తూ, ఈ ప్రక్రియ ఆలస్యంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసింది.
సాధారణంగా స్పీకర్ నిర్ణయాలకు సమయం ఉండదు, కానీ “తెలంగాణ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఒక సంవత్సరం కన్నా ఎక్కువ ఆలస్యం చేశారు కాబట్టి, ఆయనకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది.”
పిటిషన్లు దాఖలు చేసిన ఏడు నెలల తర్వాత నోటీసు జారీ చేయడంపై ధర్మాసనం “పార్లమెంటు అధ్యక్షుడిపై ఉంచిన విశ్వాసాన్ని ఉల్లంఘించడమే” అని వ్యాఖ్యానించింది.
కనీసం ఎన్నికల తర్వాతైనా స్పీకర్ చేస్తారా?
తెలంగాణ హైకోర్టులో ఏప్రిల్ విచారణపై మీడియా నివేదికలపై అపెక్స్ కోర్టు మాట్లాడుతూ: “అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే, ముఖ్యమంత్రి పదో షెడ్యూల్‌ని అపహాస్యం చేస్తున్నట్లే,” అని “ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉపఎన్నికలు కోరుకున్నా సరే, ఉపఎన్నికలు జరగవు” అనే ఆయన వ్యాఖ్యను ప్రస్తావించింది.
తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి (సెప్టెంబర్ 9, 2024) ఈ విధంగా ఆదేశించారు:
“నాలుగు వారాల్లోగా విచారణ షెడ్యూల్ నిర్ణయించాలి... ఒకవేళ సమాచారం లేకపోతే, కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా తిరిగి తెరిచి తగిన ఆదేశాలు జారీ చేస్తుంది.”
దీనిని డివిజన్ బెంచ్ (నవంబర్ 22, 2024) రద్దు చేసింది. డివిజన్ బెంచ్ ఈ విధంగా పేర్కొంది:
“అసెంబ్లీ ఐదేళ్ల పదవీకాలం, ఫిరాయింపుల నిరోధక చట్టం ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకుని, స్పీకర్ అనర్హత పిటిషన్లపై ఒక ‘సహేతుకమైన సమయంలో’ నిర్ణయం తీసుకోవాలి.”
జీరో టాలరెన్స్
ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ ప్రక్రియలను దెబ్బతీసే రాజకీయ కుతంత్రాలపై సుప్రీంకోర్టు యొక్క కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యపు వ్యాఖ్యలు, స్పీకర్ గారి నిష్క్రియాత్మకతపై గట్టిగా విమర్శలు చేయడం ఒక శక్తివంతమైన ప్రిసిడెంట్ ఏర్పాటు చేసింది: అధికారాన్ని కలిగి ఉన్న శాసనసభ్యులు రాజ్యాంగ న్యాయశాస్త్రం కింద జవాబుదారీగా ఉండాలి.
రాజ్యాంగంలో సూత్రం చెబుతుంది మాత్రమే. కాని బుద్ధి వాడుకోవాలి కదా. సరైన కాలంలో సహేతుకంగా ఉండాలి కదా అని అంటుంది. ఆ విషయం కూడా అర్థం రావడం లేదా. తెలుసు. తెలిసి తెలిసి చేస్తున్నారని తెలియడం లేదా?
కనుక హైకోర్టులు ‘సహేతుకమైన సమయం’ అనే అస్పష్టతను స్పష్టంగా తొలగించి, మూడు నెలల గడువును సుప్రీంకోర్టు నిర్ధారించింది, ఏ రాజకీయ నాయకుడు – ముఖ్యంగా స్పీకర్ – సమయాన్ని సాగదీయలేరని నొక్కి చెప్పింది. ప్రతికూల నిర్ధారణల గురించి హెచ్చరించడం ద్వారా, వ్యూహాత్మక ఆలస్యాలకు శిక్ష తప్పదని కోర్టు సూచించింది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన మాటలను విమర్శించడంలో కోర్టు నిర్మొహమాటంగా క్షమాపణ లేని వైఖరిని ప్రదర్శించింది, అవమానకరమైన లేదా తప్పుదారి పట్టించే శాసనసభ ప్రకటనలు న్యాయ విచారణకు అర్హమైనవి అని బోలెడు మొట్టికాయలు వేసింది.
‘ఆయా రామ్ గయా రామ్’
ఇటీవల, ఒక మీడియా వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని, ‘మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు?’ అని అడిగాడు. ఇది చాలా సిగ్గుచేటు పరిస్థితి. ఒకనాటి బీఆర్ ఎస్ ప్రస్తుతం కాంగ్రెస్ అని ఇప్పుడు పదిమంది అనుమానించే దశ, సిగ్గు సిగ్గు. ఈ మహానుభావులు సిగ్గుపడవలసిన ఫోటో పెద్దగా లేదా విగ్రహాలు పెట్టుకోవాలి. మీరేపార్టీ అని వారి కొడుకులు, బిడ్డలు, మనవలు కనీసం రాజ్యాంగం తెలిస్తే, ఫిరాయింపు అనేది ఎప్పుడైనా చదువుకుంటే ఏమనుకుంటారు? ఇందులో ఒక మిత్రుడు, తెలుగుదేశం, మధ్యలో బీఆర్ ఎస్, తరువాత ఇప్పుడు కాంగ్రెస్. స్వయంగా ముఖ్యమంత్రే తెలుగుదేశం నాయకుడు, తరువాత కాంగ్రెస్ అని సభానాయకుడైతే మంత్రిఅయితే ఉపముఖ్యమంత్రిఅయితే ఏం లాభం?
మొదట, స్పీకర్‌కు ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత కోసం మాత్రమే వినతి చేశారు – పెద్దలు: టి. వెంకట రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ . వీరు నవంబర్ 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరారు. అవకాశ వాదులు అంటే చాలా చిన్న మాట. ఆ తర్వాత, ఈ విషయం కోర్టుకు వెళ్ళినప్పుడు, మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, అలాగే 2018లో బీఆర్ఎస్ రెండోసారి గెలిచినప్పుడు సభకు అధ్యక్షత వహించిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కూడా జాబితాలో చేరారు. ఎంత గొప్పవారు?
‘ఆయా రామ్’ ‘గయా రామ్’ రాజకీయాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత విజృంభిస్తున్నాయి. సిగ్గు పోతే పోనీ, ప్రజలు మరిచిపోతారులే అన్నట్టు ఈ ఎం ఎల్యేలు ప్రవర్తించడం లేదూ. దీనిని ఏమనాలె?
బీఆర్ఎస్ రెండోసారి గెలిచినప్పుడు, కాంగ్రెస్ నుండి 13 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లోకి ఫిరాయించారు, దీని ఫలితంగా అప్పటి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతిపక్ష నాయకుడిగా తన హోదాను కోల్పోయారు. బీఆర్ఎస్ (గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి) 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో 88 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 19 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ నుండి కొందరు టీఆర్ఎస్‌కు మారడం మనం చూశాం. అది ఫిరాయింపు అయినప్పటికీ, అది ‘విలీనం’గా పరిగణించబడింది కాబట్టి అది ‘చట్టబద్ధమైంది’, అంటే కాంగ్రెస్ శాసనసభ పక్షం దాని సభ్యులలో మూడింట రెండు వంతుల మందితో టీఆర్ఎస్‌లో విలీనమైంది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం నియమం ప్రకారం, ‘విలీనం’ చట్టబద్ధమైన ఫిరాయింపు అయింది.
2014 నుండి 2018 వరకు ‘ఇతర పార్టీల’ నుండి 25 మంది ఎమ్మెల్యేలు తరలివచ్చారు, ఇందులో తెలుగు దేశం పార్టీ నుండి 12 మంది, కాంగ్రెస్ నుండి ఏడుగురు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి ముగ్గురు, బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఇద్దరు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి ఒకరు ఉన్నారు.
‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్’
జూలై 31, 2025న వచ్చిన సుప్రీంకోర్టు తాజా తీర్పు సందర్భంలో, ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్’ అనే వ్యంగ్యాన్ని ప్రస్తావిస్తూ, అనర్హత పిటిషన్లను అసెంబ్లీ పదవీకాలం మొత్తం పెండింగ్‌లో ఉంచి ఫిరాయించిన వారు ప్రయోజనాలను పొందడానికి వీలు కల్పించబోమని సుప్రీంకోర్టు చెప్పింది.
“అందువల్ల, మమ్మల్ని మేం ప్రశ్నించుకునేది ఏమిటంటే, అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే ముఖ్యమైన పనిని పార్లమెంటు స్పీకర్/చైర్మన్‌కు అప్పగించడానికి వేగంగా నిర్ణయం తీసుకోవాలనేది ఒక ప్రధాన కారణం. కానీ స్పీకర్ వేగవంతంగా వ్యవహరించారా? ఏడు నెలలు దాటినా నోటీసు ఇవ్వకపోవడం, ఈ కోర్టులో విచారణలు దాఖలు చేసిన తర్వాత లేదా ఈ కోర్టు మొదటిసారి విచారించిన తర్వాత మాత్రమే నోటీసు ఇవ్వడం అనేది ఏ విధంగానూ వేగవంతంగా వ్యవహరించినట్లు పరిగణించబడదు.” అని సుప్రీంకోర్టు పేర్కొంది.
సరైన విధంగా చెప్పినట్లే:
“ఈ కేసు వాస్తవ పరిస్థితులలో స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయడంలో విఫలమైతే, అది పదో షెడ్యూల్ ముఖ్య ఉద్దేశ్యాన్ని నిష్ఫలం చేస్తుంది.... ఒకవేళ మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే, అది ‘ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్’ అనే పరిస్థితిని స్పీకర్ పునరావృతం చేయడానికి అనుమతించినట్లు అవుతుంది.”
ఈ సందర్భంలో, జస్టిస్ గవాయ్ “ఒక సంవత్సరం, రెండు నెలలకు పైగా గడిచినప్పటికీ, ఈ కోర్టు జోక్యం చేసుకోవడానికి ఇంకా సమయం రాలేదా?” అని ప్రశ్నించారు
రాజ్యాంగాధికారుల దుస్థితి
ఒక మాటలో, కోర్టు “ముఖ్యమంత్రి పదో షెడ్యూల్‌ని అపహాస్యం చేస్తున్నారు” అని చెప్పింది, ఆ తర్వాత “గతంలో కోర్టు ధిక్కారంగా పరిగణించకుండా మేము తప్పు చేశామా?” అని హెచ్చరించింది, ఆపై “ముఖ్యమంత్రి సంయమనం పాటించాలని ఆశించలేదా?” అని ప్రశ్నించింది.
ఇది వార్తాపత్రికల సంపాదకీయ పేజీల్లో వచ్చిన విమర్శ కాదు, ఇది అపెక్స్ కోర్టు చేసిన తీవ్ర హెచ్చరిక! ఇది ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సరిపోదా? గత దశాబ్దాలలో, నీలం సంజీవ రెడ్డి లేదా ఎన్. జనార్దన్ రెడ్డి న్యాయస్థానాల ప్రతికూల వ్యాఖ్యల కారణంగా ముఖ్యమంత్రి పదవులను వదిలిపెట్టారు. రాజకీయ నైతికతకు ఏమైంది? గొంగళిలో అన్నంతింటూ వెంట్రికలు ఏరుకుంటున్నట్టు.