రేవంత్ పాలనకు వ్యతిరేకతంగా ప్రజా ఉద్యమాలు ఎందుకు లేవు?

తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ కన్నెగంటి రవి చెబుతున్నసమాధానం

Update: 2024-12-16 06:57 GMT
source : Twitter

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ డిసెంబర్ 7 నాటికి సంవత్సరం పూర్తయింది . ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం అనేక నిర్ణయాలను చేసింది. కొన్నింటికి ప్రశసంలొచ్చాయి. కొన్ని బాగా వివాదాస్పదయ్యాయి. అయితే, ప్రతిపక్షంలోని భారత రాష్ట్ర సమితి(బిఆర్ ఎస్) భారతీయ జనతా పార్టీ (బిజెపి)లు ఆశించినంత వ్యతిరేకత పెల్లుబుకలేదు.

మరి ఈ సంవత్సర కాలంలో ఈ పౌర సమాజ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి? అసలు ఉనికిలో ఉన్నాయా ? ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతున్నాయా? మౌనంగా ఉన్నాయా? మౌనంగా ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నాయి? KCR ప్రభుత్వ పాలనపై దూకుడుగా మాట్లాడిన, రచనలు చేసిన పౌర సమాజ ప్రతినిధులు ఇప్పుడెందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పై దూకుడుగా మాట్లాడడం లేదు? రచనలు ఆ స్థాయిలో రాయడం లేదు? ఈ ప్రశ్నలు తెలంగాణ సమాజంలో చాలా మందికి ఉన్నాయి. ఈ వ్యాస రచయితతో సహా, పౌర సమాజంలో చాలా మంది ఈ ప్రశ్నలను పదేపదే ఎదుర్కున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ , KCR నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం పదేళ్ళ పాటు అనుసరించిన నిరంకుశ విధానాలు రాష్ట్రంలో ప్రజల గొంతు బయటకు వినిపించకుండా చేశాయి. ప్రతిపక్ష రాజకీయ పార్టీలను బలహీన పరచడం, ప్రజా సంఘాల కదలికలపై ఆంక్షలు పెట్టడం, ధర్నా చౌక్ రద్ధు చేయడం, ఆయా జిల్లాలలో ప్రభుత్వ పెద్దలు పర్యటించినప్పుడు ప్రజా సంఘాల కార్యకర్తలను ముందస్తు ఆరెస్టులు సాగించడం, సభలకు, సమావేశాలకు అనుమతులు ఇవ్వకపోవడం, పోలీస్ నిర్బంధాన్ని పెంచడం నిరాటంకంగా కొనసాగింది.

ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా , ప్రజాస్వామిక తెలంగాణను ఆకాంక్షిస్తూ తెలంగాణ జేఏసీ లాంటి సంస్థలు కొన్ని తొలి దశలో పని చేసినా, వాటి కదలికలపై కూడా ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. వారి యాత్రలను అడ్డుకున్నది. ప్రభుత్వం సాగించిన అడ్డ గోలు భూసేకరణ కు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలను కూడా పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి అణచి వేసింది.

ఈ నేపధ్యంలో 2023 ఆగస్ట్ 6 న తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జరిగిన ప్రొఫెసర్ జయ శంకర్ సార్ వర్ధంతి సభలో పౌర సమాజ సంస్థగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ( TPJAC) పురుడు పోసుకుంది. సెప్టెంబర్ 1 నుండీ రాష్ట్రంలో తన కార్యక్రమాలను ప్రారంభించింది.

ఈ సమయంలోనే రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో జాగో తెలంగాణ అనే మరో పౌర సమాజ సంస్థ కూడా పని చేయడం ప్రారంభించింది. ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ , ముస్లిం డిక్లరేషన్ రూపొందించి, తనదైన కృషి ప్రారంభించింది. అంతకు ముందు నుండీ తెలంగాణ లో పని చేస్తున్న మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కూడా , KCR ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తన గొంతును వినిపిస్తూ వచ్చింది.

కొందరు సామాజిక కార్యకర్తలు, ప్రజా సంఘాల, కార్మిక సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, టీచర్లు, న్యాయవాదులు, డాక్టర్లు, జర్నలిస్టులు లాంటి అనేకమంది వ్యక్తులు, సామాజిక బాధ్యతతో ఆలోచించే వారు, దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను, బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజలలో ఎండ గట్టడం, ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను రాజకీయ పార్టీల ముందు ఉంచడం లక్ష్యంగా పెట్టుకుని ఇలా ఒక పౌర సమాజ బృందాలుగా ఏర్పడడం, ఎన్నికల సమయంలో క్రియాశీలమైన పాత్ర పోషించడం కొత్త పరిణామమే.

సాధారణంగా గతంలో ఎన్నికల సమయంలో ఎన్నికల రాజకీయాలను, రాజకీయ పార్టీలకు వదిలేసి, ఈ ప్రజాస్వామిక శక్తులన్నీ, మౌనంగా , ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండేవి. కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలలో దీనికి భిన్నంగా ఎన్నికల పక్రియ లో తాము కూడా చురుకైన పాత్ర పోషించాలని, పదేళ్ళ నిరంకుశ పాలనను కూల దోయడంలో క్రియాశీలంగా ఉండాలని నిర్ణయించుకుని రంగంలోకి దిగడం తెలంగాణ ప్రజలలో కూడా ఆసక్తిని నింపింది. ఎన్నికల సందర్భంగా, ఈ పౌర సమాజ సంస్థలన్నీ చురుకైన పాత్ర పోషించాయి. అన్ని జిల్లాలలో ఈ సంస్థలు సభలు, సమావేశాలు జరిపాయి. లక్షలాది కరపత్రాలు పంచాయి. చివరికి రాష్ట్రంలో నిరంకుశ పాలనను గద్దె దించాయి.

పౌర సమాజం ప్రజల పక్షాన గొంతు విప్పాలని, పోరాడాలని కోరుకునే వాళ్ళు ఈ ప్రశ్నలను అడగడం సహజం. న్యాయం కూడా. అయితే విచిత్రంగా పదేళ్ళ పాటు నిరంకుశ పాలన సాగించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ ప్రశ్నలను పౌర సమాజ ప్రతినిధులకు సంధిస్తున్నారు. తాము చేసిన నేరాలను మర్చిపోయి , పౌర సమాజం తమతో గొంతు కలిపి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని ఈ పార్టీలు కోరుకోవడమే హాస్యాస్పదం.

అందుకే ఇప్పటికీ పౌర సమాజ ప్రతినిధులు బీఆర్ఎస్,బీజేపీ నాయకులతో కలసి పని చేయడం లేదు. వారి వేదికలు ఎక్కడం లేదు. పౌర సమాజ ప్రతినిధులు నిర్వహించే సమావేశాలకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులను పిలవడం లేదు. దీనికి కారణం పౌర సమాజ ప్రతినిధులు కూడా స్పష్టమైన రాజకీయ, సైద్ధాంతిక వైఖరులు ఉండడమే.

ప్రస్తుత పౌర సమాజ ప్రతినిధులు ఎవ్వరూ రాజకీయాలకు దూరంగా ఉండాలనే ఆలోచనలు కలిగిన వాళ్ళు కాదు. పైగా రాజకీయంగా సమాజ మౌలిక మార్పును కోరుకుంటున్న వాళ్ళు. దోపిడీ, పీడనలకు, వివక్షకు వ్యతిరేక భావనలు ఉన్న వాళ్ళు. ప్రజల సమస్యల పరిష్కారం పట్ల, ప్రజాసామ్యం, పౌర హక్కుల పట్ల గౌరవం ఉన్నవాళ్ళు.

అందుకే ఏ సమయంలో ఎలా వ్యవహరించాలన్నది, తాముగా స్వయంగా నిర్ణయించుకుంటారు. తెలంగాణ పౌర సమాజం కూడా ప్రస్తుతం అదే చేస్తున్నది.. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు విధానాలను, ప్రజా వ్యతిరేక వైఖరులను విమర్శించడానికి పౌర సమాజానికి ఎటువంటి తటపటాయింపు లేదు. పైగా అలా ప్రశ్నించడం, పోరాడే ప్రజల పక్షాన నిలబడడం తమ బాధ్యతగా గుర్తిస్తున్నారు కూడా .

అదే సమయంలో పౌర సమాజ రాజకీయ వైఖరిలో ఒక స్పష్టత ఉన్నది. తాము ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకునే కార్యాచరణ ను , ప్రభుత్వంపై చేసే విధాన పరమైన విమర్శలను ఆధారం చేసుకుని, అత్యంత అవినీతికర, నిరంకుశ బీఆర్ఎస్ , ఫాసిస్టు బీజేపీ పార్టీలు తెలంగాణ లో మళ్ళీ మరోసారి బల పడకుండా చూడడం అనేది కూడా పౌర సమాజ ఆలోచనలో ఒక ముఖ్యమైన అంశంగా ఉంటున్నది.

ఇది, దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల పౌర సమాజానికి ఉన్న బాధ్యత తో దీర్ఘ కాలిక దృష్టి తో తీసుకుంటున్న ఒక రాజకీయ వైఖరి. అదే సమయంలో ఈ ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడడంలో పౌర సమాజ సంస్థలు ఎప్పుడూ వెనకడుగు వెయ్యవు. బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పాలక ప్రతిపక్ష పార్టీలతో కలసి కాకుండా, సమస్యలను ఎదుర్కుంటున్న ప్రజలతో కలసి అవి స్వతంత్ర ఉద్యమాలు నిర్మిస్తాయి. ప్రజలు చేసే పోరాటాలను బలపరుస్తాయి. అండగా ఉంటాయి. ఇప్పటికే అలా ఉంటున్నాయి కూడా...

ఈ రాజకీయ వైఖరిని పక్కన పెడితే, నిజంగా ఈ సంవత్సర కాలం పౌర సమాజం ఏమీ చేయలేదా ? కేవలం ప్రభుత్వ పాలనను చూస్తూ మౌనంగా ఉండిపోయిందా ? పౌర సమాజం అలా లేదు. ఈ సంవత్సర కాలం కూడా, చాలా చురుకుగా తనదైన పద్ధతిలో పని చేసింది.

ముఖ్యంగా తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ( TPJAC) తన లక్ష్య ప్రకటనకు అనుగుణంగా ఎన్నికలు అయిపోయాక కూడా , తన కార్య క్షేత్రాన్ని ఎంపిక చేసుకుని గత సంవత్సర కాలంగా పని చేస్తూ వచ్చింది. భారత్ జోడో అభియాన్, TPJAC సంస్థలు రాష్ట్ర ముఖ్యమంత్రిని రెండు సార్లు కలిసి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలపై చర్చించాయి. రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర వ్యవసాయ మంత్రిని, రెవెన్యూ శాఖా మంత్రిని కలసి వ్యవసాయ రంగ సమస్యలపై , కౌలు రైతుల గుర్తింపు సమస్యపై వివరంగా చర్చించింది. కౌలు రైతుల సమస్యపై ప్రజా వాణి కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులను కలసి చర్చించింది. ఉమ్మడి జిల్లాలలో రైతు భరోసా, కౌలు రైతుల గుర్తింపు సమస్యలపై మంత్రుల బృందం జరపిన కన్సల్టేషన్స్ లో రైతు స్వరాజ్య వేదిక, ఇతర అన్ని రైతు సంఘాలు చురుకుగా పాల్గొన్నాయి. డిసెంబర్ 4 న కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో కౌలు రైతుల గుర్తింపు సమస్యపై ఇందిరా పార్క్ దగ్గర ఒక పబ్లిక హియరింగ్, ధర్నా నిర్వహించే వరకూ పౌర సమాజ సంస్థలు కార్యాచరణ చేపట్టాయి. విద్యా రంగ సమస్యలపై కూడా పౌర సమాజ ప్రతినిధులు ముఖ్యమంత్రిని స్వయంగా కలసి సమస్యలను, విద్యా రంగ విధానాలను చర్చించారు. వైద్య రంగంలో చేపట్టాల్సిన విధానాలను కూడా పౌర సమాజ ప్రతినిధులు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ బృందంతో చర్చించారు.

ప్రజా భవన్ లో ప్రజా వాణి నిర్వహణను మెరుగుపరచడానికి మొదటి నుండీ పౌర సమాజ ప్రతినిధులు చాలా సమయం పెట్టారు. రాజస్తాను కు చెందిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (MKSS), ఉభయ తెలుగు రాష్ట్రాలలో రైతుల కోసం పని చేస్తున్న కిసాన్ మిత్ర సంస్థలు తమ అనుభవాలను ఉపయోగించి, ప్రజావాణిని ప్రజానుకూలంగా మార్చడానికి వాలంటీర్ గా పని చేశాయి.

TP JAC, భారత్ జోడో అభియాన్ సంస్థలు, రాష్ట్రంలో కీలకమైన అనేక ప్రజా సమస్యలపై ప్రజా భవన్ లో, ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు జరిపాయి. వాటి పరిష్కారానికి నిత్యం ఫాలో అప్ చేశాయి. MKSS, ఇతర పౌర సమాజ సంస్థల ఆధ్వర్యంలో ఒక పబ్లిక్ హియరింగ్ నిర్వహించి, ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలను తీసుకు వెళ్ళడానికి ప్రయత్నం చేశాయి

వివిధ శాఖల గణాంకాలను , పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చి, పాలనలో పారదర్శకత పెంచడానికి పౌర సమాజ బృందాలు డిజిటల్ డైలాగ్ పేరుతో కృషి చేస్తున్నాయి. . ఈ కృషి ఇంకా ఒక నిర్ధిష్ట రూపు తీసుకోనప్పటికీ, అనేక ప్రభుత్వ శాఖలతో పాటు , అధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు.

దామగుండం అడవి లో 12 లక్షల చెట్లను కొట్టేసి, ఆ భూమిని నావీ రాడార్ స్టేషన్ కు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, దానికి వ్యతిరేకంగా బలమైన గొంతును పౌర సమాజం వినిపించింది. ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక,(NAPM), ఇతర పర్యావరణ సంస్థల కార్యకర్తలు ఈ సమస్యపై సీరియస్ గా దృష్టి సారించి ఇప్పటికీ కృషి చేస్తున్నారు. అధికారులకు మెమొరాండాలు, సమాచార హక్కు చట్టం క్రింద సమాచారం సేకరించడం, గ్రామాలలో ప్రజలకు ఈ సమస్యపై అవగాహన కల్పించడం లాంటి అన్ని కార్యకమాలలో పౌర సమాజ ప్రతినిధులు చురుకుగా పాల్గొంటున్నారు.

మూసీ పునరుజ్జీవనం పేరుతో, మూసీ పరీవాహక ప్రాంతంలో పేదలు నివాసం ఉంటున్న బస్తీలలో ఇళ్లను కూలగొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడు, దానికి వ్యతిరేకంగా పౌర సమాజ సంస్థలు బలంగా ప్రజల పక్షాన నిలబడ్డాయి. బస్తీలలో తిరిగి నిజనిర్ధారణ చేశాయి. ప్రజలను కలసి మాట్లాడాయి. ప్రభుత్వ అధికారులతో అనేక సార్లు చర్చించి, ప్రజల హక్కుల గురించి బలంగా వాదించాయి. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రాంతంలో ఇల్లు కూలగొట్టే విషయంలో వెనకడుగు వేయడానికి, పనులలో వేగం తగ్గించడానికి పౌర సమాజ బృందాలు సాగించిన చర్చలు, కృషి ప్రధాన కారణం.

రాష్ట్రంలో వివిధ జిల్లాలలో 30 ఇథనాల్ పరిశ్రమలు రానున్నాయి. అవి అత్యంత కాలుష్య కారక పరిశ్రమలని స్పష్టంగా ప్రకటించి , ఆ పరిశ్రమలకు ఇచ్చిన అనుమతులను రద్ధు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడంలో పౌర సమాజ సంస్థలు ముందు భాగంలో ఉన్నాయి. సమాజానికి, ప్రభుత్వానికి, వివిధ రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు ఈ ఇథనాల్ పరిశ్రమ- పర్యావరణ సమస్యలపై అవగాహన కల్పించడానికి పౌర సమాజ ప్రతినిధులు అందరితో చర్చిస్తున్నారు. దీనిపై ఒక పుస్తకం వేసి అందరికీ పంపిణీ చేస్తున్నారు.

చిత్తనూరు, దిలావర్ పూర్, రావి పహాడ్, పెద ధనవాడ లాంటి చోట ప్రజలు ఇథనాల్ కంపనీలకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలకు పౌర సమాజం మద్ధతు ఇస్తున్నది. వాటిని సమన్వయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో ఇథనాల్ పరిశ్రమపై ఒక చర్చ జరిగేలా పౌర సమాజం చొరవ చేసి సమస్యను రాష్ట్ర స్థాయిలోకి తీసుకు వచ్చింది. లగచర్ల భూసేకరణ సందర్భంగా ప్రజలపై పోలీసులు సాగించిన హింసకు వ్యతిరేకంగా పౌర సమాజం గట్టిగా మాట్లాడింది.

జాగో తెలంగాణ ఒక సంస్థగా పని చేయనప్పటికీ , ఆ సంస్థకు గతంలో బాధ్యులుగా ఉన్నవాళ్ళు అనేకమంది, తాము ఎంచుకున్న రంగాలలో పని చేస్తున్నారు. ముఖ్యంగా ఆకునూరి మురళి, రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్ గా సభ్యులుగా విద్యా రంగంలో తమ వంతు కృషి కొనసాగిస్తున్నారు. మరో సామాజిక కార్యకర్త ప్రొఫెసర్ పి. ఎల్. విశ్వేశ్వర రావు లాంటి వాళ్ళు విద్యా కమిషన్ సభ్యులుగా ఉన్నారు. ముస్లిం సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు , మహిళా, ట్రాన్స్ జండర్ సంఘాల జేఏసీ సభ్యులు కూడా తమ దైన కార్యక్షత్రాన్ని ఎంచుకుని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి కొనసాగిస్తున్నారు.

కొన్నిసార్లు అంతర్గతంగా సాగుతున్న ఈ కృషి మీడియాలో కవర్ కాకపోవచ్చు. సమాజం దృష్టికి రాక పోవచ్చు. కానీ ప్రభుత్వ పాలనను మెరుగు పరచడానికి పౌర సమాజ కృషి సాగుతున్నది.

అదే సమయంలో బాహాటంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ముందుకు వచ్చినప్పుడు, పౌర సమాజం కూడా బలంగా ప్రతిస్పందిస్తూనే ఉంది. మాట్లాడడం, రాయడం, పోరాడుతున్న ప్రజలకు అండగా నిలబడడం చేస్తూనే ఉంది. ఈ పని భవిష్యత్తులోనూ కొనసాగుతుంది.

తెలంగాణ పౌర సమాజానికి ఉన్న ఈ రాజకీయ వైఖరిని,కొనసాగుతున్న అభివృద్ధి నమూనా పట్ల దాని అభిప్రాయాల్ని అర్థం చేసుకుని వ్యవహరిం చాల్సిన బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై,రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పౌర సమాజ గొంతును పట్టించుకోవలసిన అవసరం ఉంది. లగచర్ల, మూసీ, దామగుండం ఇథనాల్, ఫార్మా కంపెనీల ఏర్పాటు విషయంలో ప్రజల జీవనోపాధి,పర్యావరణం విషయంలో, ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ప్రజాస్వామ్య పాలన అందించడంలో, హామీలను అమలు చేసే విషయంలో ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని సవరించుకోవలసిన అవసరం ఉంది.

ప్రజలకు ,ప్రభుత్వానికి మధ్య ఇప్పటికీ వారధిగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం లాంటి వాళ్ళతో, ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది,ప్రజల పక్షాన వాళ్ళ గొంతును ఎంత గౌరవిస్తుంది అన్నది కూడా, పౌర సమాజం పట్ల దాని వైఖరికి మరో కీలక అంశమే.

Tags:    

Similar News