తెలుగు రాష్ట్రాల నుంచి బిసి ముఖ్యమంత్రులు ఎందుకు రాలేదు?

చైతన్యవంతులైన బిసి యువకులు తుపాకులు పట్టుకుని ఎన్నికలను బహిష్కరించి అగ్రకులాలకు ఎదురు లేకుండా చేశారు. రాజకీయాధికారాన్ని పువ్వుల్లో పెట్టి అందించారు.

Update: 2024-05-27 09:28 GMT

జాతీయోద్యమంలో , ఆంగ్లేయ వ్యతిరేక పోరాటాల్లో ఆదివాసుల పాత్ర మహోన్నతమైనది. 170 పైగా సాయుధ తిరుగుబాట్లు చేశారు. స్వాతంత్రోద్యమంలో వేలాది మంది వెనకబడన వర్గాలు, షెడ్యూల్డ్ కులాల, తెగల నాయకులు పాల్గొన్నారు. జాతీయోద్యమం కన్నా ఏ మాత్రం తక్కువ కాకుండా తమ వృత్తుల రక్షణ కోసం ఆయా కుల వృత్తి సంఘాలు ఎన్నో ఉద్యమాలు చేశాయి.

భాగ్యరెడ్డి వర్మ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వంటి వారి నాయకత్వంలో హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు సంఘర్షణలు సాగాయి. దాంతో అట్టడుగు వర్గాలకు ప్రత్యేక హక్కులను భారత రాజ్యాంగంలో పొందు పరిచారు. వాటిని ఆర్టికల్ 245 నుండి 275 వరకు చూడవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ కు జనాభా దామాషామేరకు రాజ్యాంగం ద్వారా రాజకీయ రంగంతో పాటు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించ బడ్డాయి.

జనాభాలో సగం కన్నా ఎక్కువ వున్న వెనకబడిన వర్గాలకు (బీసీ) అలాంటి అవకాశాలు కల్పించ లేదు. దాంతో 30 శాతం కూడా లేని ఆధిపత్య సామాజిక వర్గాలు 75 శాతం అవకాశాలను అందుకుని 75 ఏళ్ల పాలనలో వేల లక్షల కోట్లకు ఎదిగారు.

పారిశ్రామిక , వ్యాపార వ్యవసాయ ఆర్థిక , ఉద్యోగాలలో తరాల తరబడి పై పైకి ఎదిగి పోయారు. బహుజన వర్గాలు వెనకబడేయ బడుతూ వచ్చారు. డాక్టర్ రామ్మనోహర్ లోహియా ఒక్కరే బీసీల గురించి పట్టించుకున్నారు. సోషలిస్టు పార్టీలో అన్ని స్థానాల్లో 60 శాతం బహుజనులకే కేటాయించారు. అలా యుపి, బిహార్ లలో 1967 నుంచే బీసీలు ముఖ్యముంత్రులయ్యే క్రమం మొదలైంది.

ఇటు నాన్ బ్రాహ్మిణం ద్రవిడ ఉద్యమంతో 1967లో తమిళనాడులో కూడా బీసీలు ముఖ్యమంత్రులవుతూ వస్తున్నారు. కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో కూడ బీసీలు ముఖ్య మంత్రులయ్యారు

మరొక ముఖ్యమైన విషయం, కమ్యూనిస్టులున్నకాడ కూడా బీసీలు ముఖ్య మంత్రులు కాలేదు. కారు కూడ. బెంగాల్ లో అందుకే బీసీలు ముఖ్య మంత్రులు కాలేదు.

మరి ఏపీలో ఎందుకు కాలేదు?

లోహియా హైదరాబాద్ వచ్చినపుడు సోషలిస్టు నాయకుడు బద్రి విశాల్ పిత్తి ఇంట్లో వుంటూ 1967లో చేసిన అనేక ప్రసంగాల్లో ఆంధ్ర ప్రదేశ్ లో బీసీలు ముఖ్యమంత్రులవుతారని నొక్కి చెప్పారు.

నీటీ ప్రాజెక్టులు మొదలైనవి కట్టడంతో భూములున్న సామాజిక వర్గాలు అనూహ్యంగా ఎదిగారు. కాంట్రాక్టర్లుగా, రాజకీయ నాయకులుగా, సినిమా రంగంలోకి ఎగబాకారు. ఆసుప్రతులు కట్టారు, ప్రైవేటు పాఠశాలలు నిర్మించారు. ఇలా అనేక రంగాల్లో ఎదిగి పాతుకు పోయాయి. మూడు తరాలుగా ఎదిగి స్థిర పడి రాజకీయ ఉద్యోగ పారిశ్రామిక విద్యా రంగాలలో బీసీలకు అవకాశాలు నిరాకరింబడ్డాయి. జాతీయోద్యమంలో పాల్గొని గొప్ప చరిత్ర ఉండి, ఎంతో సీనియర్లు అయినా కూడా సర్దార్ గౌతు లచ్చన్న, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి నేతలను ముఖ్యమంత్రులు కాకుండా చేశారు.

అటు తరువాత టికట్లిచ్చి తమ చెప్పు చేతల్లో వుండే ఆశ్రిత నాయకత్వాన్ని పెంచి పోషించి ఆధిపత్య సామాజిక వర్గాలు తామే అధికారంలో వుండే బాట స్థిర పరుచుకున్నాయి.

ఆపైన నమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తెలివి గల బీసీలు ఉద్యమాలు చేసి ఉద్యోగాలకు ఎక్కారు. మరొక వర్గం బిసి యువకులు సాయుధ పోరాట భ్రమల్లో పడి తొపాకులు పట్టుకుని అడవుల్లోకి వెళిపోయి పోరాటం చేసారు. అమరులయ్యారు. ఆ ఉద్యమాలతోనేనా రాజకీయ నాయకులుగా ఎదిగే వారే! కాని విప్లవపార్టీల అగ్రనాయకత్వం ప్రభావంతో ఎన్నికల బహిష్కరణ అనే పిలుపు నిచ్చి పాలక వర్గాలకు ఎవరూ పోటీ రాకుండా చేసి పువ్వుల్లో పెట్టి అధికారాన్ని అందించారు. మరి కొందరు ఉద్యమాలు చేసినా రాజకీయాల జోలికి వెళ్లకుండా, నాయకత్వం చేపట్టకుండా ఉద్యమాల్లోంచి ఉద్యోగాలకు ఉరికినారు.

ఆర్థిక వసతి భూవసతి లేకపోవటాన బీసీల్లో తెలివంతా ఉద్యోగాలకు, ఉద్యమాలకు, తుపాకులకు పరిమితమైతే, రాజకీయ రంగంలో అగ్రకులాలకు ఎదురు లేకుండా పోయింది.

కొందరు బీసీ అడ్వకేట్లు, కాంట్రాక్టర్లు , రియల్ ఎస్టేట్ , ఎక్సైజ్ కాంట్రాక్టరలు రాజకీయాల్లోకి వచ్చి కొంతవరకు ఎదిగిన మాట నిజమే. అయితే, వారికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. బీసీ ఉద్యమ కారులుగా ఉంటూ రాజకీయ నాయకులుగా ముందుకు దూకిన వారు అరుదు.

ఇపుడా అవకాశం వచ్చింది. అయితే నామినేటెడ్ పదవులకు ఉద్యోగాలకు ఆశపడేవారితో రాజకీయాలు నడవయి.

ప్రత్యక్షంగా ఓటు రాజకీయాలతో నెగ్గుకు వచ్చే వారే రాజకీయ నాయకులు. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేసే వారే రాజకీయ నాయకులు. అలా పోటీ చేయడానికి ధన బలం లేక పోయినా బీసీలకే అధికారం అంటూ జన బలంతో సిద్దాంత బలంతో ముందుకు సాగితే అది ప్రకంపనలు సృష్టిస్తుంది.

బీసీలు రాజకీయంగా అధికారంలోకి వస్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత అదే చైతన్యంతో ముందుకు సాగితే తొలుత స్థానిక సంస్థల్లో ఆ క్రమంలో రాష్ట్ర , కేంద్ర చట్ట సభల్లో అధికారంలోకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. కదిలితే చాలు ఎంత దూరమైనా కాళ్ల కిందికే పోతుంది. మనుషులు ముందుకు సాగుతారు

Tags:    

Similar News