కొత్త పార్టీ దిశగా కేసీఆర్ కూతురు?

హిట్ అవుతుందా ? ఫట్ అవుతుందా?

Update: 2025-09-30 02:20 GMT

తెలంగాణలో రాజకీయాలు ఒక ప్రవాహం. ఆ ప్రవాహం కొన్నిసార్లు గట్టిగా దూసుకుపోతుంది, కొన్నిసార్లు నిలిచిపోతుంది, మరికొన్ని సార్లు మడుగులో చిక్కుకుంటుంది. నిన్నటి వరకు తెలంగాణ ఆవిర్భావానికి జెండా ఎగరేసిన నాయకత్వం, నేటి ప్రజాభిప్రాయ తీర్పులో నిస్సహాయంగా కనిపించడం మనం చూస్తున్న వాస్తవం. ఈ వాతావరణంలో బతుకమ్మ ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కేసీఆర్ కూతురు ఏం ఎల్ సి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు తెలుగు మీడియా సర్కిల్లో గుప్పుమంటున్నాయి.తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకత్వం, కరెక్ట్ టైమింగ్, పార్టీ స్థాయిలో బలమైన వనరులు—ఇవన్నీ కలిసొస్తేనే ఒక కొత్త పార్టీ నిలబడుతుంది. అయితే, చరిత్ర చెబుతున్నది ఏంటంటే ప్రతి కొత్త పార్టీకి రెండు దారులే ఉంటాయి, ప్రజల్లో ఆకర్షణ, శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఎదగడం లేదా ప్రజల మద్దతు రాకపోవడం, సరిగా నిలవక ముందే కూలిపోవడం. కానీ ప్రశ్న మాత్రం ఒక్కటే – కవిత పెట్టబోయే పార్టీ ప్రజల గుండెల్లో హిట్ అవుతుందా? లేక రాజకీయ రణరంగంలో ఫట్ అయి మసకబారిపోతుందా? ఏ దారి దిశగా సాగుతుందో వాస్తవిక కోణంలో ప్రముఖ రాజకీయ మనో విశ్లేషకులు డాక్టర్. కేశవులు భాషవత్తిని, ఎండి, సైకియాట్రీ , ది ఫెడరల్ తెలంగాణ కోసం అందిస్తున్న ప్రత్యేక కథనం .

రాజకీయ నేపథ్యం....

కవిత గారి ప్రస్థానం, తెలంగాణ ఉద్యమ సమయంలో “తెలంగాణ జాగృతి” అనే సాంస్కృతిక వేదిక ద్వారా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.కానీ BRS సర్కారు గత కొన్నేళ్ల పాలనలో అవినీతి, కుటుంబరాజ్యం, రైతు సమస్యలు వంటి విమర్శలు ఎదుర్కొంది తెలంగాణ ఆత్మగౌరవ భావనలో యువత, మహిళలకు ప్రేరణ కలిగించారు. BRS లో పార్లమెంట్, పార్టీ లో మంచి స్థాయి ఉన్నప్పటికీ, ఇటీవల వచ్చిన అవినీతి కేసులు, దిల్లీ లిక్కర్ స్కాం వంటివి ఆమె ఇమేజ్ పై ప్రతికూల ప్రభావం చూపించాయి. తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం పాత కుటుంబ రాజకీయాలు” అన్న ముద్రను బలంగా తిరస్కరిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఒక కొత్త పార్టీకి గట్టి పరీక్ష ఎదురవుతుంది.

హిట్ కి మార్గాలు...

దేశస్థాయి, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో మహిళలకు లీడర్‌షిప్ చాలా అరుదు. ఈ ఖాళీని భర్తీ చేసే శక్తి కవితకి ఉంటే, ప్రజల మద్దతు పొందగలరు. తెలంగాణ జాగృతి ద్వారా ఒకప్పుడు ప్రతి ఊరి యువతిని, ప్రతి కళాకారుడిని, ప్రతి మహిళను తన చుట్టూ చేర్చుకున్న శక్తి ఆమెకుంది. అదే శక్తిని మళ్లీ మేల్కొల్పగలిగితే, మహిళా నాయకత్వం ఒక కొత్త కాంతి చూపిస్తుంది. మళ్లీ తెలంగాణ ఆత్మగౌరవం ప్రత్యేక గుర్తింపుగా మనం వేరే వాళ్ల చేతికి బందీ కావలసిన అవసరం లేదు అనే ప్రాంతీయ భావనను తిరిగి ప్రస్తావించవచ్చు. ప్రత్యేకంగా మహిళలు, యువత, వలసదారులు కలసి నిలబడ్డారంటే, కవిత పార్టీకి ఒక బలమైన పునాది ఏర్పడుతుంది. ప్రజల్లో అసంతృప్తి – BRS పై నిరాశ, కాంగ్రెస్‌ పై అనుమానం, BJP నాయకుల గొడవలు – చూసీ మూడో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నవారు తక్కువేమీ లేరు. అదనంగా, అమెరికా, గల్ఫ్, యూరప్‌లో ఉన్న డయాస్పోరా నెట్‌వర్క్ ద్వారా కవితకు ఫండింగ్, ప్రచార మద్దతు లభించే అవకాశం ఉంది. BRSకి పక్కదారి పడిన ఓటర్లలో ఉన్న వాక్యూమ్ – అదే కవిత పార్టీకి ఒక పెద్ద అవకాశంగానీ, లేక ప్రమాదం గానీ మారే అవకాశాన్ని కొట్టి పారేయలేము.

ఫట్ కి అవకాశాలు...

ప్రతి ఆశ వెనుక ఒక నీడ ఉంటుంది. కవిత కొత్త పార్టీకి ఆ నీడ పెద్దదే. లిక్కర్ స్కాం, అవినీతి ముద్ర, సెంట్రల్ ఏజెన్సీల విచారణలతో ఆమె ఇమేజ్ దెబ్బతింది. ప్రజల్లో కేసీఆర్ కుటుంబం పునరావృతమే అనే నమ్మకం మరింత బలపడితే పార్టీ మొదట్లోనే కూలిపోవచ్చు. బలమైన కేడర్ పార్టీలు ఇప్పటికే ఉండటంతో, కొత్త పార్టీకి వోటు బ్యాంక్ నిర్మించడం కష్టమే. శాశ్వత కేడర్, బలమైన స్థానిక నాయకత్వం, విస్తృత ఆర్థిక మద్దతు లేకపోవడం మరో ప్రతికూల అంశం. అంతేకాదు, వేరే పేరు మీదా, వేరే జెండా మీదా, అదే పాత TRS శైలి వస్తుందా? అనే అనుమానం ఓటర్లలో వ్యాపిస్తే, అది పార్టీకి పెద్ద ప్రమాదంగా ఉంటుంది. పైగా ఎన్నికల అలయన్స్ విషయంలో కూడా క్లిష్టతలు తప్పవు—ఒంటరిగా పోటీ చేస్తే శక్తి బలహీనమవుతుంది. అలయన్స్ తో చేస్తే స్వతంత్ర గుర్తింపు తగ్గిపోతుంది. ఇప్పటికే తెలంగాణలో మూడు బలమైన శక్తులు ఉన్న నేపథ్యంలో కొత్త తరం నాయకత్వం లేకపోతే, కొత్త ఆలోచనలు లేకపోతే, కవిత పార్టీ కేవలం ఒక పాత పార్టీకి కాపీగా మిగిలిపోతుంది.

రాజకీయ వాస్తవాలు

తెలంగాణలో ప్రస్తుతం రెండు ప్రధాన శక్తులు కాంగ్రెస్, BJP. BRS రికవరీలో ఉంది కానీ స్థిరంగా లేదు. ఒక కొత్త పార్టీ రావడం అంటే ప్రజలకు ఒక కొత్త వేదిక లభించడం. ఇది లోకతంత్రానికి శక్తి. కానీ అదే సమయంలో ఓటు చీలిక వల్ల ప్రధాన ప్రత్యామ్నాయ పార్టీకి నష్టం లేదా లాభం జరుగొచ్చు.ఫలితంగా అనూహ్యమైన ఎలక్షన్ ఫలితాలు రావచ్చు. ప్రజలు కొత్త పార్టీని కేవలం కుటుంబ రాజకీయ విస్తరణగా చూస్తే మాత్రం ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. కానీ కుటుంబం కోసం కాకుండా, ప్రజల కోసం నిజమైన మార్పు తీసుకు వస్తేనే భవిష్యత్తు ఉంటుంది.

ఇలా అయితే

కవిత గారు స్పష్టమైన సిద్ధాంతం, కొత్త తరం నాయకత్వం, పారదర్శక ఇమేజ్ తో ముందుకు రావాలి. పాత బలహీనతలు మానుకోవాలి.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తక్షణ హిట్ అయ్యే అవకాశం తక్కువ.కానీ సుదీర్ఘంగా ప్రజల్లో నడిస్తే, కొత్త రాజకీయ వేదికనూ సృష్టించవచ్చు. కవిత పాత తప్పుల నుంచి నేర్చుకుని పారదర్శక, అవినీతికి దూరంగా, ప్రజా సమస్యలపై కేంద్రీకృత మేనిఫెస్టో తో ముందుకు రావాలి.కొత్త తరం నాయకత్వానికి, మహిళా శక్తికి, యువతకి పెద్ద ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రామీణ సమస్యలు – రైతు, బీడీ కార్మికులు, గిరిజనులు – తెలంగాణ మహిళా శక్తి, యువత, అసంతృప్త ప్రజలకు ప్రత్యామ్నాయం చూపించడం వీటిని కేంద్రంగా మనస్సు పెట్టి పనిచేయాలి.

అసలు నిర్ణేతలు 

అదే పాత TRS-శైలి, కుటుంబరాజకీయాలు, అవినీతి మచ్చలు కొనసాగితే ప్రజలు తిరస్కరిస్తారు.కుటుంబం, డబ్బు, అధికార పిపాస” అనే ముద్ర కొనసాగితే. బలమైన ఆర్గనైజేషన్ లేకుండా కేవలం ఇమేజ్ ఆధారంగా ముందుకు వస్తే పలితం ఉండబోదు. .ప్రజా సమస్యలపై పారదర్శక అజెండా చూపాలి. యువత, మహిళలకు ముందస్తు ప్రాధాన్యం ఇవ్వాలి,అలా కాకుండా, కేవలం కుటుంబరాజకీయాల రక్షణ కోసం ఈ పార్టీ వస్తే, అది చరిత్రలో ఒక ఫట్ పార్టీగా మిగిలిపోతుంది. తెలంగాణ ప్రజలు మేల్కొన్నవారు. వారు ఆశలు పెట్టుకోవడం తెలుసు, మోసపోవడం కూడా తెలుసు, అవసరమైతే తిరస్కరించడం కూడా తెలుసు. చివరగా ఒకే మాట, ప్రజల నమ్మకం గెలుచుకున్న పార్టీకి విజయం ఖాయం. ప్రజల నమ్మకం కోల్పోయిన పార్టీకి ఫట్ తప్పదనే గాధ కూడా ఖాయం.


Tags:    

Similar News

అంతరాలు