కామ్రేడ్ ఏచూరి జీవితంలో కనిపించని మైలు రాళ్లెన్నో...

ఏచూరితో సన్నిహిత సంబంధం ఉన్న అడ్వకేట్ కొండూరి వీరయ్య చెబుతున్న విశేషాలు

Update: 2024-09-19 07:24 GMT



-కొండూరి వీరయ్య

కామ్రేడ్‌ సీతారాంతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధంలో ఆయన్ను ఎన్నో కోణాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది. కొన్ని అంశాలు ఈ ప్రత్యేక సంచిక ద్వారా పాఠకుల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.

కామ్రేడ్‌ సీతారాం మేధో వికాసం గురించి ఆయనతో కలిసి చదువుకున్నవారూ, పని చేసిన వారూ, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయనతో అనుబంధం ఉన్న వారూ తమతమ జ్ఞాపకాల పొరల్లో నుండి చెప్తున్న విషయాలు గమనించినప్పుడు భారత వామపక్ష ఉద్యమం గర్వించదగిన మేధావి అన్న విషయం స్పష్టమవుతుంది. ఈ మేధో వికాసం కేవలం అధ్యయానికి మాత్రమే పరిమితం అయినది కాదు. ఆ అధ్యయన ఫలాలను ఆచరణలోకి తేవడానికి ఆయన చేసిన ప్రయత్నమే ఆయనకు ఆ విశిష్టతను తెచ్చిపెట్టింది. అధ్యయనంలో నేర్చుకున్న విషయాలను క్షేత్రస్థాయిలో ఎదుర్కునే సమస్యలకు వాటిని వర్తింపచేయటంలో సృజనాత్మకంగా వ్యవహరించే వాడు కామ్రేడ్‌ సీతారాం.
గుంటూరంటే అభిమానం
భారత కమ్యూనిస్దు ఉద్యమానికి ఎంతోమంది నాయకులను అందించిన జిల్లా గుంటూరు జిల్లా. ప్రపంచ మార్క్సిస్టు మేధావుల్లో ఒకరిగా కొనియాడబడ్డ కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య ఈ జిల్లాకు చెందినవారే. సిపిఎం కార్యక్రమం రూపకల్పనలో ప్రత్యేకించి విప్లవవ్యూహ రూపకల్పనలో బసవపున్నయ్య పాత్రను ఎవ్వరూ మరువలేరు. అటువంటి గుంటూరు పట్ల కామ్రేడ్‌ సీతారాంకు ప్రత్యేకమైన గౌరవం, అభిమానం ఉండేవి. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ పార్టీ నిర్మాణం, నిర్వహణలో ఎప్పుడైనా నిరుత్సాహకరమైన పరిస్థితులు తలెత్తినప్పుడు గుంటూరు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనటం తనలో పునరుత్సాహం నింపే సందర్భంగా ఉంటుందని చెప్పారు. భారతవిప్లవోద్యమ ప్రస్థానంలో గుంటూరుకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ సమావేశంలో అన్నారు.
చిలకలూరిపేట బైపాస్‌ విషయంలో
కామ్రేడ్‌ ఏచూరి రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తమతమ సమస్యలతో కార్యకర్తలు, సాధరాణ ప్రజలు వచ్చేవారు. ఆ సమస్యల పరిష్కారానికి తన జోక్యం ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వెనకాడేవాడు కాదు. చిలకలూరిపేట బైపాస్‌ విషయంలోనూ, జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఎడ్లపాడు రోడ్డుమీద షాపుల ద్వారా జీవనోపాధిపొందుతున్న వారి విషయంలోనూ ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. ఎడ్లపాడు నుండి డాక్టర్‌ సుబ్బారావు, ముప్పవరపు రాముడు, సురేష్‌ల నాయకత్వంలో ఓ బృందం ఢల్లీ వచ్చి నష్టపరిహారం విషయంలో జోక్యం చేసుకోమని అడిగింది. అదేవిధంగా నాదెండ్ల మండలానికి చెందిన కొన్ని గ్రామాల నుండి షుమారు 50 మంది రైతులు చిలకలూరిపేటకు బైపాస్‌ కావాలన్న డిమాండ్‌తో వచ్చారు. వారికి ప్రధానమంత్రితో అప్పాయింట్మెంట్‌ ఇప్పించటంతో పాటు దగ్గరుండి అప్పటి రోడ్డు రవాణా మంత్రి కమల్‌నాథ్‌తో సమాశం ఏర్పాటు చేయించి జాతీయ రహదారుల అధారిటీకి ఆదేశాలు ఇప్పించారు. ఇప్పుడు జరుగుతున్న బైపాస్‌ నిర్మాణానికి అప్పట్లోనే సూత్రప్రాయపు ఆమోదం తెప్పించటంలో కామ్రేడ్‌ ఏచూరి ముఖ్య పాత్ర పోషించారు.
బిహెచ్‌పివి పరిక్షణలో
1991లో మొదలైన ఆర్థిక విధానాల నేపథ్యంలో సాధ్యమైనన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసేందుకు వరుసగా వచ్చిన ప్రభుత్వాలు పని చేశాయి. 2004లో పార్లమెంట్‌లో మారిన పొందికను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం సిఐటియు నాయకులు బిహెచ్‌పివి పరిరక్షణ డిమాండ్‌తో ఢల్లీి వచ్చారు. వాళ్లతో అప్పటి భారీ పరిశ్రమల శాఖ మంత్రి సుబోధకాంత్‌ సహాయ్‌తోనూ, ప్రధానమంత్రితోనూ సంప్రదింపులు జరిపి బిహెచ్‌పివిని బిహెచ్‌ఈఎల్‌లో విలీనం చేసే ప్రతిపాదనకు ఒప్పించారు. ఆ విలీన కార్యక్రమానికి ప్రణబ్‌ముఖర్జీతో పాటు హాజరయ్యారు. అదేవిధంగా విశాఖ షిప్‌యార్డులో బెర్తులు అదానీకి అప్పగించేందుకు అప్పటి షిప్పింగ్‌ మంత్రి టి ఆర్‌ బాలు సానుకూలంగా ఉంటే ఈ విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తి అదనపు బెర్తులు అదానీ హస్తగతం కాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ రంగ పరిరక్షణకు తనకు ఏ చిన్న అవకాశం వచ్చినా శాయశక్తులా కృషి చేశారు. పార్లమెంటరీ స్థాయీ సంఘం ద్వారా దేశీయంగా జలరవాణా సదుపాయాలు అభివృద్ధి చేయటం ద్వారా గణనీయమైన స్థాయిలో కాలుష్యాన్ని నివారించవచ్చని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేశారు. ఈ సిఫార్సుల ఫలితంగానే నేషనల్‌ ఇన్‌లాండ్‌ వాటర్‌ వేస్‌ చట్టం వచ్చింది. అదేవిధంగా నలంద విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించటంలోనూ, ఆ విశ్వవిద్యాలయం తొలి వైస్‌ ఛాన్సలర్‌గా అమర్త్యసేన్‌ను నియమించేలా ప్రభుత్వాన్ని ఒప్పించటంలోనూ కామ్రేడ్‌ సీతారాం కీలక పాత్ర పోషించారు.
కార్మికవర్గ చైతన్యాన్ని పెంపొందించే వేదికగా పార్లమెంట్‌
కామ్రేడ్‌ ఏచూరి పార్లమెంటరీ ఉపన్యాసాలు ఈ మధ్య సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. యుపిఎ కూటమికి మద్దతు ఇస్తున్న కాలంలో ప్రభుత్వం చేసే తప్పుల పట్ల ఏ మాత్రం ఉదాసీనతకు తావులేకుండా పార్లమెంట్‌ వేదికగా పోరాడారు. సింగూర్‌ పరిణామాల నేపథ్యంలో దేశంలోని పాలకవర్గాలన్నీ బెంగాల్‌ వామపక్ష సంఘటన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూకుమ్మడి దాడికి దిగినప్పుడు ఆ దాడికి దీటుగా సమాధానమిచ్చిన ధీశాలి. అనేక సమస్యలపై పాలకవర్గ రాజకీయాలకు భిన్నమైన వైఖరిని దేశం దృష్టికి తీసుకురావడానికి కామ్రేడ్‌ ఏచూరి పార్లమెంట్‌ను వేదికగా మల్చుకున్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలు, ఆందోళనలు, ఉద్యమాలతో నిరంతరం తీరికలేకున్నా రాజ్యసభ ఎంపీగా ఏనాడూ తన బాధ్యతలు పట్ల ఏమరుపాటు ప్రదర్శించలేదు. పార్లమెంట్‌లో కామ్రేడ్‌ సీతారాం హాజరు 87 శాతం. సగటు ఎంపీల హాజరుశాతం కంటే చాలా ఎక్కువ. అదే విధంగా ఒక ఎంపీగా ఆయన చేసిన ఉపన్యాసాలు 244. సాధారణ ఎంపీగా ఇన్ని ఉపన్యాసాలు చేయటం పార్లమెంట్‌ చరిత్రలో ఓ రికార్డు.
చేయి తిరిగిన రచయితగా
ఎంతగా క్షేత్రస్థాయి రాజకీయాలతో మమేకం అవుతారో అంతే స్థాయిలో స్వీయ అధ్యయనానికి ప్రాధాన్యత ఇస్తారు. కొత్త పరిణామం, ఆవిష్కరణ, ప్రయోగం ఏది జరిగినా దాన్ని అర్థం చేసుకునేందుకు శ్రమించి అధ్యయనం చేస్తారు. సాధారణ రాజకీయ పరిణామాలనే కాక శాస్త్ర విజ్ఞానరంగాల పురోగతి విషయంలో కూడా అప్డేట్‌గా ఉండేవారు. 2007 లో అనుకుటాను బోల్షివిక్‌ విప్లవం 90 వ వార్షికోత్సవం సందర్భంగా నాటి కమ్యూనిస్టు పాలనలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో రష్యా సాధించిన పురోగతిని దేశం దృష్టికి తీసుకురావడానికి హిందూస్తాన్‌ టైమ్స్‌ పత్రికలో ఎన్నో వ్యాసాలు రాశారు. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యాల మధ్య ఉన్న పోటీని కూడా సాధారణ పాఠకుడిని అర్థమయ్యే రీతిలో విడమర్చి చెప్పేవారు. పాతికేళ్లకు పైగా పార్టీ వారపత్రిక పీపుల్స్‌ డెమొక్రసీ సంపాదకుడిగా పని చేసిన కామ్రేడ్‌ సీతారాం చొరవతోనే 1857 ప్రధమ స్వాతంత్య్ర సమరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా స్వాతంత్య్రపోరాటానికి సమాంతరంగా సాగిన ప్రజా పోరాటాలను గ్రందస్థం చేయించటానికి ఓ ప్రత్యేక శీర్షిక ప్రారంభించారు. ఈ వ్యాసాలనే 1857 లెఫ్ట్‌ అప్రైజల్‌ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. పార్టీ అవగాహన సాధారణ ప్రజలకు చేరాలంటే మన మేధో వ్యాసంగం పార్టీ పత్రికలకే పరిమితం అయితే సరిపోదు, పార్టీయేతర పత్రికల్లో కూడా రాస్తూ ఉండాలన్న కామ్రేడ్‌ ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ అవగాహనను ముందుకు తీసుకెళ్లూ వామపక్ష వాణిని వినిపించటానికి బూర్జువాపత్రికలను వేదికగా మార్చుకునే క్రమంలోనే హిందూస్తాన్‌ టైమ్స్‌లో లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవ్‌ శీర్షికన దశాబ్దకాలం పాటు వ్యాసాలు రాశారు. ఈ వ్యాసాలను ప్రజాశక్తిబుక్‌ హౌస్‌ పుస్తకరూపంలో అందుబాటులోకి తెచ్చింది. వామపక్ష ఉద్యమం ఎదుర్కొంటున్న నిర్దిష్ట సవాళ్లను నిర్దిష్టంగా అధ్యయనం చేసి దిశా నిర్దేశం చేయటంలో కామ్రేడ్‌ ఏచూరి కృషి సవాళ్లతో సంఘర్షణ అన్న వ్యాస సంపుటిలో ఆవిష్కృతమవుతుంది. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలికి దశాబ్దానికి పైగా వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసే అవకాశం ఇచ్చిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) కృతజ్ఞుడిని. వయసులో చిన్నవాడినైనా నాకు పని చెప్పే క్రమంలో అనేక విషయాల గురించి అధ్యయనానికి వెన్నుతట్టి ప్రోత్సహించిన కామ్రేడ్‌ సీతారాం కు ఇది నా అక్షర నివాళి.


Tags:    

Similar News