Rape case | కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవితఖైదు
ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు..;
మైసూరులోని కె.ఆర్.నగరానికి చెందిన ఓ మహిళపై అపహరణ, అత్యాచారానికి పాల్పడిన కేసులో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కర్ణాటక రాష్ట్రం హసన్ నియోజకవర్గ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)కు జీవిత ఖైదుతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 7 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. వాస్తవానికి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ శుక్రవారం ప్రజ్వల్ రేవన్నను దోషిగా తేల్చి, శిక్ష ఖరారు శనివారానికి వాయిదా వేశారు.
నమోదయిన సెక్షన్లు..
BNS (IPC) సెక్షన్ 376(2)(k) — (స్త్రీపై అధికార/ఆధిపత్య స్థితిలో ఉండి అత్యాచారానికి పాల్పడటం), సెక్షన్ 376(2)(n) (అదే స్త్రీపై పదే పదే అత్యాచారానికి పాల్పడటం) కింద ప్రజ్వల్‌పై కేసు నమోదు చేశారు.
‘నిందితుడికి గరిష్ట శిక్ష విధించండి’
‘‘బాధితురాలికి తీవ్రమైన నష్టం జరిగింది. ఆమె సమ్మతి లేకుండా లైంగిక చర్యను వీడియో తీశారు. ఆ వీడియోతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ప్రజ్వల్ ఎంపీగా ఉండి కూడా ఇలాంటి దుష్చర్యకు పాల్పడ్డాడు. ఇది అత్యంత దారుణమైన నేరం. అతనిపై ఇలాంటి కేసులు మరిన్ని ఉన్నాయి. అనేకమంది అశ్లీల వీడియోలు తీశాడు. అలా తీయడం కూడా తీవ్ర నేరమే. సాక్ష్యాలను నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నిందితుడికి గరిష్ట శిక్ష విధించి, సమాజానికి బలమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాను’’ - బిఎన్ జగదీశ్, ప్రభుత్వ తరపు న్యాయవాది.
‘ప్రజ్వల్ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకోవాలి’
‘‘రేవణ్ణపై అభియోగాలు రాజకీయ ప్రేరేపితం. ప్రజ్వల్ ఎంపీగా ప్రజాసేవ చేశాడు. డబ్బుకోసం రాజకీయాల్లోకి రాలేదు. 2024 ఎన్నికల సమయంలోనే వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి? రాజకీయ కుట్ర దాగి ఉంది. ప్రజ్వల్ వయసు కేవలం 34 ఏళ్లు. బాధితురాలిని సమాజం నుంచి వెలివేయలేదు. తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతోంది. వివాహమై పిల్లలతో ఉంది. ప్రజ్వల్ భవిష్యత్తును కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలి. మీడియా ఇప్పటికే రేవన్న ప్రతిష్టను దెబ్బతీసింది. తల్లిదండ్రులు వృద్ధులు. తాత మాజీ ప్రధాని.ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి’’ -నళిని మాయగౌడ, రేవణ్ణ తరఫు న్యాయవాది.
‘అప్పుడే ఎందుకు బయటపెట్టలేదు’..
“నేను ఎంపీగా ఉన్నప్పుడు ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేదు. అత్యాచారం చేసి ఉంటే అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఎన్నికల సమయంలోనే ఎందుకు బయట పెట్టారు? అయినా న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకరిస్తాను” - ప్రజ్వల్ రేవణ్ణ
కేసు నేపథ్యం..
లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అనేక అశ్లీల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. బయటపడగానే దేశం విడిచి వెళ్లిపోయాడు. 2024 మే 31న తిరిగి బెంగళూరుకు రాగానే ఎస్ఐటి అధికారులు అతన్ని అరెస్టు చేశారు. మొబైల్ ఫోన్ల నుండి అనేక వీడియోలు రికవరీ చేశారు.
మహిళను అపహరించి..
తన ఇంట్లో పని చేస్తున్నప్పుడు ప్రజ్వల్ అనేకసార్లు అత్యాచారం చేశాడని మైసూరులోని కె.ఆర్.నగరానికి చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత బాధితురాలిని అపహరించి ఫార్మ్‌హౌస్‌లో నిర్బంధించారు. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి హెచ్.డి. రేవణ్ణ, తల్లి భవాని రేవన్నలపై కూడా కేసు నమోదై అరెస్టు చేశారు. ఆ తరువాత వారు బెయిల్‌పై విడుదలయ్యారు.
సాక్ష్యాలు..
ఎస్ఐటి 1,652 పేజీల అభియోగపత్రం దాఖలు చేసింది. 113 మంది సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఉన్నాయి. న్యాయస్థానం 26 మంది సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక సాక్ష్యాలను పరిశీలించి ప్రజ్వల్‌ను దోషిగా తేల్చింది.
తీర్పు వెలువడగానే ప్రజ్వల్ రేవణ్ణ కన్నీళ్లు పెట్టుకున్నాడు.