ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్..
నామినేషన్ దాఖలుకు చివరి తేది ఆగస్టు 21. 22వ తేదీన నామినేషన్ల పరిశీలన, 25వ తేదీ నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం..;
ఉపరాష్ట్రపతి(Vice President) పదవికి తర్వలో ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 9న జరిగే ఎన్నికకు గురువారం (ఆగస్టు 7) ఎన్నికల సంఘం (EC) నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ దాఖలుకు చివరి తేది ఆగస్టు 21. 22వ తేదీ నామినేషన్ల పరిశీలన, 25వ తేదీ నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం కల్పించారు. ఆరోగ్య కారణాల వల్ల ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ జూలై 21న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆయన పదవీకాలం ఆగస్టు 2027లో ముగియనుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. మధ్యంతర ఎన్నికలు జరిగితే, పదవిలో ఉన్న వ్యక్తికి పూర్తి ఐదేళ్ల పదవీకాలం లభిస్తుంది.
గెలిచే అభ్యర్థికి 394 ఓట్లు..
ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. లోక్‌సభలో 543 మంది సభ్యులుండగా ఒక స్థానం ఖాళీగా ఉంది. 245 మంది సభ్యులున్న రాజ్యసభలో ఐదు ఖాళీలు ఉన్నాయి. గెలిచే అభ్యర్థికి 394 ఓట్లు అవసరం. లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు 542 మంది సభ్యులలో 293 మంది మద్దతు ఉంది. ఇక రాజ్యసభలో 129 మంది సభ్యుల మద్దతు ఉంది. మొత్తంమీద పాలక ఎన్డీఏ కూటమికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది. ఈ లెక్కన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయేకు ఆధిక్యం ఉంది.