జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి కేసీఆర్..!
ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య బలమైన పోటీ కనిపిస్తోంది. పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే, పాగా వేయాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి దింగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వరుసగా మూడుసార్లు విజయం సాధించారు. అక్కడ గోపీకి తిరుగులేదన్న వాతావరణం నెలకొంది. ఇటీవల ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా మరణించడంతో నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యం అయింది. అయితే తాజాగా ఈ ఉపఎన్నికలో తమ అభ్యర్థి మాగంటి సునీత తరుపున క్యాంపెయిన్ చేసే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీఆర్ఎస్ విడుదల చేసింది. ఇందులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పేరు ఉండటం ప్రస్తుతం కీలకంగా మారింది. సునీత కోసం ప్రచారం చేయడానికి కేసీఆర్ బరిలోకి దిగుతారా? కేవలం జాబితాలో పేరుకే పరిమితం అవుతారా? అన్న చర్చ మొదలైంది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో కేసీఆర్ పేరు ప్రథమంగా ఉంది. ఒక నియోజకవర్గంలో గెలుపు కోసం ఆయన ఫార్మ్ హౌస్‌ను వీడి మళ్ళీ ప్రజల్లోకి వస్తారా? అన్న చర్చ బలంగా జరుగుతోంది. కీలక అంశాలను చర్చిస్తున్న సమయంలో కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్.. ఇప్పుడు ఉపఎన్నిక కోసం ప్రచారంలో పాల్గొంటారా? అంటే విశ్లేషకులు కూడా పెదవి విరుస్తున్నారు. కొందరు చెప్పలేం అంటే మరికొందరు మాత్రం కేసీఆర్ రారు అని తేల్చి చెప్తున్నారు.
కేసీఆర్ పాత్ర అంతవరకేనా..!
ఈ క్రమంలోనే స్టార్ క్యాంపెయినర్లలో కేసీఆర్ పేరు ఉన్నా ఆయన సభలు, రోడ్‌షోలు నిర్వహించి ప్రచారం చేయరని కొందరు విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపఎన్నికలో ఎలా ప్రచారం చేయాలి? ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? ఎప్పుడు ఏ వ్యూహాన్ని అమలు చేయాలి? వంటి అంశాలను ఆయన తెరవెనక నుంచి డైరెక్ట్ చేస్తారని అంటున్నారు విశ్లేషకులు. ఈ అంశాలపై ఇప్పటికే కేసీఆర్ పలువురు సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారని, కాగా ఇప్పుడు ప్రచారంలో ఎలాంటి అంశాలను లేవనెత్తాలి? లాంటి విషయాలను ఆయన మరింత సునిశితంగా పరిశీలించి సూచనలు చేయొచ్చని విశ్లేషకులు చెప్తున్న మాట.
బీఆర్ఎస్ సత్తాకు జూబ్లీ పరీక్ష..?
ఇదిలా ఉంటే తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పట్టు ఎంత? అనే అంశాన్ని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక స్పష్టం చేస్తుందని కూడా కొందరు నిపుణులు అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంటు ఎన్నికలు రెండిటిలోనూ బీఆర్ఎస్ ఆశించిన ఫలితాలను రాబట్టలేదు. దీంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తమ సత్తా, ప్రజల్లో బీఆర్ఎస్‌పై నమ్మకం ఇంకా ఉందని నిరూపించుకోవాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ నేతల్లో కూడా ఇదే ఉందని, ఈ ఉపఎన్నికలో ఓడిపోతే మాత్రం రాజకీయంగా పార్టీకి భారీ ఎదురుదెబ్బ అవుతుందని వాదన వినిపిస్తోంది. ఇంతలో స్టార్ క్యాంపెయినర్లలో కేసీఆర్ పేరు కనిపించడం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.