జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే..!
అసలు పోటీపై ఈ నామినేషన్ల ప్రభావం ఉంటుందా..?
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు మూడిటి మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ అన్నట్లు నడుస్తోంది. మంగళవారంతో ఉపఎన్నిక నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అక్టోబర్ 13న ప్రారంభమైన ఈ ప్రక్రియ అక్టోబర్ 21 మధ్యాహ్నం వరకు అంటే తొమ్మిది రోజులకు ముగిసింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి.. ఆఖరి రోజున తన నామినేషన్ దాఖలు చేశారు. అయితే మొత్తం ఈ ఉపఎన్నికకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆఖరి రోజున కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు క్యూలో ఉన్న వారందరినీ అనుమతించిన అధికారులు.. 3 గంటల తర్వాత వచ్చిన వారిని వెనక్కి పంపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ప్రధాన పార్టీలే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా భారీగానే ఆసక్తి చూపారు. తొమ్మిది రోజుల్లో సుమారు 150 వరకు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు చెప్తున్నారు. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. దీంతో తుది పోరులో ఎంతమంది నిలబడతారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నామినేషన్లు అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థిగా చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రమంలోనే ఈ స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు అసలు పోటీపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నత తలెత్తుతోంది.
అయితే భారీగా ఎటువంటి ప్రమాదం ఉండదని, మహా అయిత వందల సంఖ్యలోనే ఓట్లు ప్రధాన పార్టీల అభ్యర్థులకు మిస్ అవుతాయని అంటున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిలో ఓట్లు చీల్చే అంతటి నేతలు ఇప్పటి వరకు తమకు ఎవరూ కనిపించలేదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రధాన పోటీలో మూడు పార్టీలు కీలకంగా ఉండనున్నాయని చెప్తున్నారు.