డీకే శివకుమార్‌తో కిరణ్ మజుందార్-షా భేటీ..

‘‘రోడ్ల దుస్థితి, ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కంటే నేరుగా వచ్చి డిప్యూటీ సీఎంను కలవచ్చు’’ - హోంమంత్రి పరమేశ్వర..

Update: 2025-10-21 12:13 GMT
Click the Play button to listen to article

బయోకాన్(Biocon) అధినేత, పారిశ్రామికవేత్త కిరణ్ మజుందార్-షా(Kiran Mazumdar Shaw) మంగళవారం (అక్టోబర్ 21) కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar)ను బెంగళూరు(Bengalure)లోని ఆయన నివాసంలో కలిశారు. తన మేనల్లుడి వివాహానికి ఆహ్వానించడానికి మజుందార్ డీకేను కలిశారని NDTV సమాచారం.

బెంగళూరులో రోడ్లు దుస్థితి, ట్రాఫిక్ సమస్యపై మజుందార్-షా, డీకే మధ్య మాటల యుద్ధం జరిగిన తర్వాత వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

"ఈరోజు బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా నన్ను కలవడం ఆనందంగా ఉంది. బెంగళూరును మరింత అభివృద్ధి చేయడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే అంశాలు మా మధ్య చర్చకు వచ్చాయి," అని శివకుమార్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


మజుందార్‌, మోహన్‌దాస్ పాయ్‌పై డీకే ఆగ్రహం?

బెంగళూరులో రోడ్లు దుస్థితి, ట్రాఫిక్ సమస్యపై ఇన్ఫోసిస్ మాజీ CFO మోహన్‌దాస్ పాయ్, బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా ఇటీవల సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు. ఈ తీరుపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేసేమూందు మూలాలు మరిచిపోకూడదని కౌంటర్ ఇచ్చారు.


ఇద్దరిపై ఫైర్..

‘‘ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సమాధానమిస్తూనే..కొందరు మూలాలు మర్చిపోయి మాట్లాడుతున్నారని పరోక్షంగా మోహన్‌దాస్ పాయ్, కిరణ్ మజుందార్-షానుద్దేశించి ఫైర్ అయ్యారు బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే.


‘వాహనాల సంఖ్య పెరుగుతోంది’

"బెంగళూరు నగర జనాభా 1.40 కోట్లు. రోజుకు 3 వేల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పటికే రిజిస్టరయిన వాహనాల సంఖ్య 1.23 కోట్లు. ఇక ఉద్యోగాలు, విద్య, ఉపాధి కోసం సుమారు 70 లక్షల మంది బెంగళూరుకు వస్తారు. వీరిలో కొందరు తిరిగి వెళతారు. నగర జనాభా పెరుగుతోంది. వాహనాల సంఖ్య పెరుగుతోంది" అని శివకుమార్ పేర్కొన్నారు.


‘మూలాలు మరవొద్దు’

"ఇక్కడ వ్యాపారాలు ప్రారంభించి బాగా ఎదిగారు. ఏ దశ నుంచి ఏ దశకు ఎదిగారో మర్చిపోయి పోస్టులు పెడుతున్నారు. సమస్యలను తెలిపే అవకాశం ప్రజలకిచ్చాం. గుంతలు తేలిన రోడ్ల ఫోటోలను వాట్సప్‌లో షేర్ చేయాలని కోరాం. దేశంలో ఎవరూ కూడా ఇలాంటి అవకాశం ప్రజలకు ఇవ్వలేదు. విమర్శలను స్వాగతిస్తున్నా. అవి ప్రజాస్వామ్య విలువను పెంచుతాయి. కానీ కొంతమంది అతిగా స్పందిస్తున్నారు. ఆ విషయాలు నన్ను బాధించవు. ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. వారికి సేవ చేయాలనుకుంటున్నాము" అని ముగించారు.


‘వ్యక్తిగతంగా కలవండి’

‘‘ కొంతమంది పారిశ్రామిక వేత్తలు పనిగట్టుకుని పోస్టులు పెడుతున్నారు. బహిరంగ ప్రకటనలు చేయడం, మీడియా ముందు మాట్లాడటానికి బదులుగా.. ముఖ్యమంత్రి లేదా బెంగళూరు ఇన్‌ఛార్జ్ మంత్రి వ్యక్తిగతంగా కలవండి. లేదంటే వారి వద్దకు మీ ప్రతినిధి బృందాన్ని పంపి సమస్యలపై మాట్లాడమనండి. కొంతమంది చేసే ప్రకటనలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని ఇకనైనా గుర్తించాలి.’’ అని హోంమంత్రి జి. పరమేశ్వర విలేఖరులతో అన్నారు.


డీకే వ్యాఖ్యలను తోసిపుచ్చిన మజుందార్..

‘‘మోహన్‌దాస్ పాయ్‌, కిరణ్ మజుందార్-షా పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీ పాలనలో ఈ సమస్యలపై వారు ఎందుకు ప్రశ్నించలేదు. వారికి "వ్యక్తిగత ఎజెండా" అని డీకే శివకుమార్ ఇటీవల చేసిన ఆరోపణను కిరణ్ మజుందార్ శనివారం తోసిపుచ్చారు. "గత బీజేపీ, జేడీఎస్ ప్రభుత్వాల హయాంలోనూ నగరంలో మౌలిక సదుపాయాల సమస్యలపై నేను, మోహన్‌దాస్ పాయ్ ప్రశ్నించాం. మా ఎజెండా ఒక్కటే. రోడ్లను బాగు చేయండి’’ అని మజుందార్ ఎక్స్‌లో తిరిగి పోస్ట్‌ చేశారు. 

Tags:    

Similar News