హైదరాబాద్‌ను శుభ్రంగా ఉంచడాని కోసం, నగర శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెడుతున్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో నగరానికి చెందిన వేలాది టన్నుల చెత్తను రోజూ పడేస్తున్నారు. అయితే, ఈ చెత్తతో కూడిన దుర్గంధం, లిచెడ్ కాలుష్యం, పొగ, దోమలు, చెరువుల్లోకి చేరిన విషపు నీరు... ఇవన్నీ పరిసర గ్రామాల ప్రజల జీవనాన్ని తీవ్ర ప్రమాదంలో నెట్టేస్తున్నాయి. పలు కుటుంబాల్లో ప్రజలు చర్మవ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, అనేక రకాల అనారోగ్యాలతో తీవ్రంగా బాధపడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం మౌనంగా మారి, బాధితుల ఆవేదనను వినడం లేదు.
(జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల నుంచి ఫెడరల్ తెలంగాణ స్పెషల్ కరస్పాండెంట్ సలీం షేక్)
ముక్కుపుటాలదిరేలా తీవ్ర దుర్గంధం...విద్యుత్ ఉత్తత్తి చేసేందుకు పొడి చెత్తను బాయిలరులో వేసి కాల్చినపుడు వచ్చే పొగ... చెత్త నుంచి వచ్చిన కలుషిత లిచెడ్ వాటర్...దోమలు, ఈగల బెడద...ఇవీ జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల్లో కనిపించిన సిత్రాలు...డంపింగ్ యార్డు ఉన్న జవహర్ నగర్ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న రాజీవ్ గాంధీ కార్మికనగర్,అంబేద్కర్ నగర్, మల్కారం, రాజీవ్ గాంధీనగర్, గబ్బిలాల పేట, చీర్యాల, హరిదాస్ పల్లి, అహ్మద్ గూడ, తిమ్మాయిపల్లి, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి ప్రాంతాల్లో పర్యటించిన ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధికి చెత్త దుర్గంధం వల్ల ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు వెలుగుచూశాయి.
డంపింగ్ యార్డు వద్ద కలుషితమైన సరస్సు
కాలుష్యంతో అల్లాడుతున్న ప్రజలు
జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల ప్రజలు గత 27 ఏళ్లుగా అల్లాడుతూనే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోటిన్నర మంది ప్రజలు పడేసిన చెత్తను నగర శివార్లలోని జవహర్‌నగర్ ప్రాంతానికి తరలించి డంపింగ్ చేయడం వల్ల ఈ ప్రాంతంలో దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. డంపింగ్ యార్డు పరిసర ప్రాంత గ్రామాల్లోని భూగర్భజలాలు కలుషితమయ్యాయి. చెత్త కుళ్లిపోయి అందులో నుంచి వచ్చిన నల్లటి లిచెడ్ వాటర్ వల్ల ఈ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోరు నీళ్లతో స్నానం చేస్తే చాలు చర్మవ్యాధులు వస్తున్నాయని రాజీవ్ గాంధీ కార్మిక నగర్ ప్రజలు ముక్తకంఠంతో ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చెత్త లారీలు డంపింగ్ చేసిన తర్వాత వచ్చే కంపు తాము భరించలేక పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరో వైపు రాత్రివేళ విద్యుత్ ఉత్పత్తి కోసం ప్లాస్టిక్ వ్యర్థాలను కాల్చడంతో వచ్చే పొగ వల్ల కేన్సర్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరించినా పట్టించుకునే వారు కరవయ్యారు. రాత్రనక, పగలనక చెత్త దుర్గంధం వల్ల తాము తరచూ అనారోగ్యం పాలవుతున్నామని దమ్మాయిగూడ ప్రజలు చెప్పారు.
కాలుష్య కాసారాలుగా మారిన గొలుసుకట్టు చెరువులు
జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల దీని కింద ఉన్న పది చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి. మల్కారం చెరువు, హరిదాస్ పల్లి చెరువు, చీర్యాల లేక్, రాంపల్లి చెరువు, దమ్మాయిగూడ చెరువు, వాసిన్ చెరువు, చెన్నపురం చెరువు, అంబేద్కర్ నగర్ ఇందిరా చెరువు, అటవీ ప్రాంతంలోని పలు చిన్న సరస్సుల్లోకి చెత్త నుంచి వెలువడిన లిచెడ్ వాటర్ చేరి నీరు నల్లగా మారి విషతుల్యమైంది. దీని వల్ల ప్రజలు పలు రోగాల బారినపడుతున్నారు.
ఎవరిని కదిలించినా అనారోగ్య సమస్యలే...
జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో ఎవరినీ కదిలించినా అనారోగ్యం మాటే...ఏ ఇంటికి వెళ్లి మాట్లాడినా ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు...మరొకరు ఊపిరితిత్తుల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మరి కొందరు చర్మ సమస్యలతో బాధ పడుతున్నారు.జవహర్ నగర్ డంపింగ్ యార్డులో చెత్త నుంచి వెలువడిన లిచెడ్ వాటర్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజల అరికాళ్లు పగిలాయి.కాళ్లు, చేతులకు నల్లటి మచ్చలతోపాటు పుండ్లు ఏర్పడ్డాయి. ఈ విషపు నీటి వల్ల అరికాళ్ల మంటలతో అల్లాడుతున్నారు. ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో పర్యటించినపుడు ప్రజల అనారోగ్యం ఇక్కట్లు వెలుగుచూశాయి.
మా ఆరోగ్యం దెబ్బతింది : బచ్చు సుజాత, రాజీవ్ గాంధీ నగర్
‘‘నా పేరు బచ్చు సుజాత. మేం 2017వ సంవత్సరంలో రాజీవ్ గాంధీనగర్ లో డంపింగ్ యార్డు పక్కనే ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నాం. ఇక్కడ కలుషిత నీరు, వాసనతో తట్టుకోలేక పోతున్నాం. విపరీతమైన తలనొప్పి, కాళ్ల పగుళ్ల వల్ల అవస్థలు పడుతున్నాం. డంపింగ్ యార్డు ఆనుకొని ఉన్నందున కంపు వల్ల నిద్రపోలేక పోతున్నాం,నీళ్లలో నడిస్తే మంట లేస్తుంది. మా ఆరోగ్యం దెబ్బతింటుంది. మా ఇల్లు అమ్ముకొని పోదామంటే కొనే వాళ్లు కూడా లేరు’’అని గోడు వెళ్లబోసుకున్నారు.
కడుపునొప్పి, తలనొప్పి వస్తుంది : కేశోజు భాగ్యలక్ష్మి, కార్మిక నగర్ నివాసి
కార్మికనగర్ డంపింగ్ యార్డు వాసన వల్ల తీవ్ర కడుపునొప్పి, తలనొప్పి వస్తుందని కేశోజు భాగ్యలక్ష్మీ ఆవేదనగా చెప్పారు.చెత్త కుప్పలపై డ్రోన్లతో సెంటు స్ప్రే చేయడం వల్ల దుర్గంధం ఘాటు మరింత పెరుగుతుందని ఆమె చెప్పారు. రాత్రి పవర్ ప్లాంటు నుంచి నల్లటి పొగ వస్తుందని, ఈ పొగ, శబ్దాలు, మనిషి చనిపోతే కాలిస్తే వచ్చే దుర్గంధం వస్తుందని భాగ్యలక్ష్మీ చెప్పారు. కంపుపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరని, గత 15 రోజుల నుంచి దుర్గంధం పెరిగిందని, దీనికి పరిష్కారం ఆలోచించాలని డిమాండు చేశారు.
కాళ్లు చేతులకు పుండ్ల అయ్యాయి : బోయ గంగపురి ఆవేదన
చెత్త డంపింగ్ యార్డు కాలుష్యం వల్ల ఆరేళ్లలో నా కాళ్లు, చేతులకు పుండ్లు ఏర్పడ్డాయని బోయ గంగపురి అనే కూలీ ఆవేదనగా చూపించారు.
చెత్త వల్ల పలు రోగాల పాలయ్యాం అంటూ తన మెడికల్ రిపోర్టులు, ఎక్స్ రేలు చూపించారు.నా అనారోగ్యానికి ఎవరు చికిత్స చేపిస్తారు అని బోయ గంగపురి ఆవేదనగా ప్రశ్నించారు.
రాత్రీ పగలూ వెలువడుతున్న దుర్గంధం
తాను తెలియక దమ్మాయిగూడలో ఇల్లు కొన్నానని, నాటి నుంచి రాత్రీ పగలూ దుర్గంధం వస్తూనే ఉందని దమ్మాయిగూడకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీరు అనిల్ కుమార్ సత్తుపల్లి ఆవేదనగా చెప్పారు. ప్రతీరోజు దుర్గంధం వస్తూనే ఉందని, దీని వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పారు. ఇల్లు అమ్ముకుందామనుకుంటే సాధ్యం కావడం లేదని, ప్రభుత్వం అధిక చెత్త ఈ డంపింగ్ యార్డుకు రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చెత్త డంపింగ్ వల్ల పలు రోగాలు
చెత్త డంపింగ్ వల్ల పలు రోగాలు వస్తున్నాయని, చెత్త నుంచి వస్తున్న కలుషిత నీరు దారుల వెంట వచ్చి కాళ్లకు బొబ్బలు వస్తున్నాయని కాలనీ ప్రెసిడెంట్ బండారి నర్సింహులు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. శరీరం అంతా బొబ్బలు, గాయాలు అవుతున్నా రాంకీ కంపెనీ వాళ్లు పట్టించుకోవడం లేదన్నారు. జనరేటర్ పెట్టి రాత్రనక పగలనకు నడపటం వల్ల తమకు రాత్రి నిద్ర పట్టడం లేదన్నారు. మురికి నీళ్ల చెరువు వల్ల ఘాటు వాసనలతో ఊపరితిత్తుల సమస్యలు వచ్చాయని ఎక్స్ రే చూపించారు. క్యాప్ వేసిన తర్వాత చెత్త వేస్తున్నారని, ప్రజలు ఇళ్లు కట్టుకొని దుర్గంధం వల్ల వదిలేసి వెళుతున్నారని ఆవేదనగా చెప్పారు. తాను పదేళ్ల నుంచి డంపింగ్ యార్డు వల్ల అనారోగ్య సమస్యలు, జ్వరాలతో సతమతమవుతున్నానని మహేష్ చెప్పారు. తినేటప్పుడు కూడా కంపు లోపలకు వెళుతుందని, బయట కూర్చుందామంటే చాలు ఒకటే దుర్గంధం అని, పడుకున్నా ఈ వాసన కడుపులోకి వెళుతుందని మహేష్ ఆందోళన వ్యక్తంచేశారు.
పోరాడుతున్నా పట్టించుకోరా?
జవహర్ నగర్ డంపింగ్ యార్డు చెత్త సమస్యపై తాము ఆరేళ్లుగా పోరాటం చేస్తున్నామని, దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేశామని కార్మిక నగర్ ప్రాంత నవోదయా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పాకాలపాటి శ్రీలేష్ సందీప్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఈ కాలుష్యంపై తాము తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. డంప్ యార్డ్ నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఈ ప్రాంతంలో నివసించడం కష్టమైందన్నారు. గాలి, నీరు రెండూ కలుషితమయ్యాయని, స్థానికుల జీవితం భరించలేనిదిగా మారిందని ఆయన వివరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
మూడు దశాబ్దాలుగా అనారోగ్యపు వేదన
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు గత మూడు దశాబ్దాలుగా అనారోగ్యపు వేదనతో జీవిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మవ్యాధులు, నిద్రలేమి, మానసిక ఒత్తిడి... ఇవన్నీ ఒక్క చెత్త యార్డు వల్ల లక్షలాదిమందికి దినచర్యలో భాగమైపోయాయి. చెత్తను ఉత్పత్తి చేస్తున్న నగర ప్రజలకు అది కనిపించకపోవచ్చు...కానీ, దాని ప్రభావం నిత్యం ఈ గ్రామాల ప్రజల శరీరాల్లో మండుతూనే ఉంది. ప్రజల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారిన ఈ డంపింగ్ యార్డుపై సంబంధిత అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మేలుకుని వెంటనే చర్యలు తీసుకోకపోతే, దీని పరిణామాలు మరింత భయంకరంగా మారే అవకాశం ఉంది.ఈ ప్రజల పోరాటం నిశ్శబ్దంగా సాగుతోంది...వారికి కావాల్సింది కేవలం శ్వాసించగల స్వచ్ఛమైన గాలి, తాగదగిన మంచి నీరు, నిద్రపోయే నిశ్శబ్ద రాత్రి. బాధిత ప్రజల పోరాటం ప్రభుత్వాన్ని కదిలించాలి.