బీహార్ ఎన్నికలు: బీజేపీ తొలి జాబితాలో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు చోటు..
ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్‌కు దక్కని టికెట్..
బీహార్(Bihar) తొలిదశ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) 71 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను మంగళవారం (అక్టోబర్ 14) బీజేపీ విడుదల చేసింది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్‌కు ఈ సారి టికెట్ దక్కలేదు. దశాబ్ద కాలం తర్వాత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిని, ఆరోగ్య, న్యాయ శాఖ మంత్రి, శాసన మండలి సభ్యుడు మంగళ్ పాండేను కూడా ఈ సారి టిక్కెట్లు దక్కాయి. 2010లో ఆర్జేడీ టికెట్‌పై పర్బట్టా నుంచి గెలిచిన చౌదరి.. ఈ సారి పక్క నియోజకవర్గం తారాపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక పాండే సివాన్ నుంచి పోటీచేస్తున్నారు. చౌదరి, పాండే ఇద్దరూ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు. నంద్ కిషోర్ యాదవ్ పాట్నా సాహిబ్ స్థానాన్ని రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కుమార్ గుప్తాకు కేటాయించారు.
‘పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా..’
“నేను బీజేపీ(BJP) తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కొత్త తరం నాయకత్వాన్ని స్వాగతిస్తున్నా.”అని ఈ సందర్భంగా పేర్కొన్నారు నంద్ కిషోర్ యాదవ్. 72 ఏళ్ల యాదవ్ తన కొడుకు కోసం టికెట్ ఆశించినట్లు సమాచారం.
అభ్యర్థుల జాబితాలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..2014లో బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి రామ్ కృపాల్ యాదవ్.. పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గంలో లాలూ ప్రసాద్ కుమార్తె మిసా భారతిని రెండుసార్లు ఓడించారు. కానీ గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి పాట్నా శివార్లలోని దానాపూర్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. ఆర్జేడీ నాయకుడు రీత్ లాల్ యాదవ్ ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో లఖిసరాయ్‌లో హ్యాట్రిక్ సాధించిన డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాను మళ్ళీ అదే నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు.
జాబితాలో పలువురు మంత్రులు..
రేణు దేవి (బెట్టియా), నితిన్ నబిన్ (బంకీపూర్), నితీష్ మిశ్రా (ఝంఝార్‌పూర్), జిబేష్ మిశ్రా (జాలే), సంజయ్ సరయోగి (దర్భంగా), నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ (ఛాతాపూర్), మరియు కేదార్ ప్రసాద్ గుప్తా (కుర్హానీ) సిట్టింగ్ సీట్లతో సహా పలువురు ఇతర మంత్రులు కూడా జాబితాలో ఉన్నారు. కళలు, సాంస్కృతిక శాఖ మంత్రి మోతీలాల్ ప్రసాద్‌ను తప్పించి ఆయన సీటు రిగాను బైద్యనాథ్ ప్రసాద్‌కు కేటాయించారు. రెండో సారి కూడా అవకాశం దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాదాపు 10 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఐదేళ్ల క్రితం జముయ్ నుంచి అరంగేట్రం చేసిన ఏస్ షూటర్ శ్రేయాసి సింగ్ కూడా ఉన్నారు.
పార్టీ మారిన వారికి కూడా..
టర్న్‌కోట్‌లు, కొత్తగా వచ్చిన వారికి కూడా టిక్కె్ట్లు దక్కాయి. 2020లో కాంగ్రెస్ టిక్కెట్‌పై బిక్రమ్ స్థానం నుంచి గెలిచిన సిద్ధార్థ్ సౌరవ్ బీజేపీలో చేరడంతో ఆ స్థానం నుంచే పోటీచేస్తున్నారు. సోమవారం (అక్టోబర్ 13) బీజేపీలో చేరిన జేడీ(యూ) మాజీ ఎంపీ సునీల్ కుమార్ పింటు, రిటైర్డ్ సివిల్ సర్వెంట్ సుజిత్ కుమార్ సింగ్‌కు వరుసగా సీతామర్హి, గౌర బౌరం టిక్కెట్లు కేటాయించారు.