పార్లమెంటు ఆవరణలో ‘‘అరకు కాఫీ’’ ఘుమఘుమలు
ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే అరకు కాఫీ గురించి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని మోదీ;
ఏపీలోకి అరకు కాఫీ(Araku Coffee)కి విస్తృత ప్రచారం కల్పించడానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అవకాశం కల్పించారు. దీంతో పార్లమెంట్(Parliament) ఉభయ సభల కాంటీన్లలో కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఒక కౌంటర్‌ను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal), మరో కౌంటర్‌ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రామ్ మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు పాల్గొన్నారు. గిరిజన సహకార సంస్థ (GCC) ఆధ్వర్యంలో ఈ స్టాళ్లు మార్చి 28 వరకు కొనసాగుతాయి.
ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. “ జీఐ గుర్తింపు పొందిన అరకు కాఫీని ప్రతి భారతీయుడికి పరిచయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. త్వరలోనే ఒక ప్రీమియం బ్రాండ్‌గా గుర్తింపు పొందుతుంది,” అని అన్నారు.
కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు మాట్లాడుతూ..“అరకు కొండ ప్రాంతాల్లో గిరిజన రైతులు దీన్ని విశేషంగా సాగు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ప్యారిస్ వంటి దేశాల్లోనూ అరకు కాఫీ స్టాళ్లు ఉన్నాయి. ప్రధాని మోదీ సైతం ‘మన కీ బాత్’(Mann Ki Baat)లో అరకు కాఫీని ప్రస్తావించారు. సేంద్రీయ సాగు విధానం, రుచి గురించి ఆయన ప్రశంసించారు కూడా,’’ అని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాపీ పంటను గిరిజనులు విస్తృతంగా సాగుచేస్తారు. అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన జీ–20 శిఖరాగ్ర సదస్సులో కూడా ఈ కాఫీ ప్రాచుర్యం పొందింది.