అస్సాం గాయకుడు జుబీన్ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు..

‘‘గార్గ్ ఊపిరి ఆడక మునిగిపోతున్న సమయంలో ఆయన మేనేజర్ "జబో దే, జబో దే" అన్నాడు’’- పోలీసుల విచారణలో గార్గ్ బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి

Update: 2025-10-04 08:19 GMT
Click the Play button to listen to article

అస్సాం (Assam) ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) అనుమాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. సింగపూర్‌లో నిర్వహించిన నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లిన గార్గ్.. సెప్టెంబర్ 19న సముద్రంలోఈత కొడుతూ మృత్యువాతపడ్డారు. జుబీన్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కేసు విచారణను సిట్‌కు అప్పగించారు. దర్యాప్తు బృందం ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసి విచారిస్తోంది.

విచారణలో గార్గ్ బ్యాండ్‌మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి(Shekhar Jyoti Goswami) సంచలన విషయాలు బయటపెట్టారు. జుబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఉత్సవ నిర్వాహకుడు శ్యామ్‌కాను మహంత.. గార్గ్‌కు విషం ఇచ్చి ఉండవచ్చని, హత్యను ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులకు చెప్పారు.


‘అలా చనిపోయే అవకాశమే లేదు..’

‘‘సింగపూర్‌(Singapore)లో గార్గ్ మరణానికి కొన్ని గంటల ముందు మేనేజర్ శర్మ ప్రవర్తనలో మార్పు కనిపించింది. సైలర్‌ను తప్పించి ఓడ నియంత్రణను శర్మ తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఫలితంగా సముద్రం మధ్యలో ఓడ ప్రమాదకరంగా ఊగింది. అందులో ఉన్నవాళ్లమంతా భయపడిపోయాం. ఓడలోకి ఎలాంటి పానీయాలు తీసుకురావద్దని, తానే వాటిని సమకూరుస్తానని అస్సాం అసోసియేషన్ (సింగపూర్) సభ్యుడు, ఎన్నారై తన్మోయ్ ఫుకాన్‌‌తో శర్మ అన్నాడు. గార్గ్ ఓ ట్రైన్డ్ స్విమ్మర్. నాకు, శర్మకు ఈత నేర్పింది కూడా ఆయనే. జుబెన్ నీట మునిగి చనిపోయే ఛాన్సే లేదు. గార్గ్ ఊపిరి ఆడక మునిగిపోతున్న సమయంలో శర్మ "జబో దే, జబో దే" ("అతన్ని వెళ్ళనివ్వండి, వెళ్ళనివ్వండి") అని అరవడం వినిపించింది. ఓడ వీడియోలను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని కూడా శర్మ చెప్పాడు. గార్గ్ నోరు, ముక్కు నుంచి నురగ వస్తున్నపుడు.. శర్మ దానిని "యాసిడ్ రిఫ్లక్స్" గా కొట్టిపడేశాడు. ఎవరూ ఆందోళన పడాల్సిందేమీలేదని చెప్పారు. శర్మ నిర్లక్ష్యం వల్లే గార్గ్ చనిపోయాడు. శర్మ, మహంత కలిసి గార్గ్‌ మర్డర్‌కు ప్లాన్ చేశారు. హత్య చేయడానికి సింగపూర్‌ను ఎంచుకున్నారు. ’’ అని విచారణలో చెప్పారు. కాగా శేఖర్ జ్యోతి గోస్వామి ఆరోపణలను విచారణ సమయంలో శర్మ, మహంత తోసిపుచ్చారు.


రంగంలోకి ఈడీ, ఐటీ?

మహంత గురించి CID లోతుగా విచారణ మొదలుపెట్టింది. 20 ఏళ్ల క్రితం నాటి ఆర్థిక అవకతవకలను కూడా వెలికితీస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), ఆదాయపు పన్ను (IT) శాఖలు కూడా భాగస్వాములయ్యే అవకాశం ఉంది. 

Tags:    

Similar News