వెస్ట్ బెంగాల్‌‌‌లో బీజేపీ ప్రచారాస్త్రం అదేనా?

బంగ్లాదేశ్ అక్రమ వలసలను అరికట్టడంలో సీఎం మమతా బెనర్జీ విఫలమయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకోనుంది.;

Update: 2025-03-22 12:23 GMT
Click the Play button to listen to article

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశ్(Bangladesh) వలసదారులు పోలీసులకు పట్టుబడుతూనే ఉన్నారు. వీరంతా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని బెనాపోల్, హకీంపూర్ సరిహద్దులను దాటి వస్తున్నట్లు విచారణలో తేలిపోయింది. ఇలా వచ్చిన వారు ఢిల్లీకి చేరుకుని చెల్లుబాటు కాని పత్రాలతో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

అక్రమ వలసదారుల విషయంలోనే మమతా బెనర్జీ (CM Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌(TMC) నాయకులకు, భారతీయ జనతా పార్టీ (BJP) నేతలకు మధ్య చాలా కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండడంతో ఇదే అంశాన్ని బీజేపీ రాజకీయ అస్త్రంగా మార్చుకునే అవకాశముంది. బెంగళూరులో మార్చి 23 వరకు జరిగిన అఖిల భారత ప్రతినిధి సభ (ABPS)ల్లో తృణమూల్ కాంగ్రెస్‌ను ఢీ కొట్టేందుకు ప్రణాళిక కూడా రచించినట్లు సమాచారం. అయితే ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపి, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌ జోలికి వెళ్లాలన్న యోచనలో బీజేపీ నేతలున్నట్లు తెలుస్తోంది.

"బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించే సమస్య కొత్తది కాదు. కానీ సరైన పత్రాలు లేని వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారుతోంది," అని బెంగళూరులోని సమావేశానికి హాజరైన ఓ ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత అన్నారు.

నాగ్‌పూర్‌కు చెందిన రచయిత, ఆర్ఎస్ఎస్ పరిశీలకుడు దిలీప్ దేవధర్ మాట్లాడుతూ.. అమెరికా, యూరోప్‌లో అక్రమ వలసదారులపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తోన్న తీరును భారత్‌లోనూ అవలంభించాలని అభిప్రాయపడ్డారు. "ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, ఆర్ఎస్ఎస్ దాన్ని మరింత విస్తరించి, జాతీయ ఉద్యమంగా రూపొందించాలనుకుంటోంది" అని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని దేశాన్ని వీడాకా అక్కడ మైనారిటీలు ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగిపోయాయి. వారికి రక్షణ కల్పించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా ఆర్ఎస్ఎస్ సూచించనుంది.

"భారతదేశంలోని అక్రమ బంగ్లాదేశీలపై చర్య తీసుకోవడం రాజకీయంగా బీజేపీ లాభం చేకూర్చే చర్య. హిందువుల రక్షణ అంశం ప్రజలలో భావోద్వేగం రేకెత్తించే అంశం కావడంతో ఆర్ఎస్ఎస్ దీనిపై దృష్టి సారిస్తోంది" అని మాధ్య ప్రదేశ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ యతీంద్ర సింగ్ సిసోడియా పేర్కొన్నారు.

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గతేడాది ఆగస్టులో దేశం వీడిన తర్వాత, అక్కడి హిందువులపై జరిగిన దాడులకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌లో భాజపా, ఆర్ఎస్ఎస్, అనుబంధ సంఘాలు తమ గళాన్ని విప్పుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ అక్రమ వలసదారుల అంశం ఈ సారి ఎన్నికలలో పార్టీలకు ఆయుధంగా మారబోతోందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.

Tags:    

Similar News