పాకిస్థాన్ రేంజర్ల అదుపులో బీఎస్ఎఫ్ జవాన్..
విడిపించేందుకు ప్రయత్నిస్తామన్న పశ్చిమ బెంగాల్ సీఎం మమత హామీ..;
పాకిస్థాన్ (Pakistan) రేంజర్ల అదుపులో ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ (BSF Jawan) పూర్ణం కుమార్ సాహును విడిపించేందుకు ప్రయత్నిస్తామని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) హామీ ఇచ్చారని సాహు భార్య రాజనీ తెలిపారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న 40 ఏళ్ల సాహు.. ఏప్రిల్ 23న సరిహద్దును దాటి పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత అతడిని పాకిస్థాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు.
రాజనీతో మాట్లాడిన మమత..
ఆదివారం సాయంత్రం మమతా బెనర్జీ ఫోన్ చేసి రాజనీతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేశారు. నా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లిదండ్రులకు వైద్య సహాయం చేస్తామని చెప్పారు. అలాగే నా భర్తను విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికే నేను బీఎస్ఎఫ్ అధికారులతో కూడా మాట్లాడా. అయితే వారి నుంచి నాకు ఎలాంటి సమాచారం రాలేదు. మే 3న రాజస్థాన్‌లో భారత బలగాలు పట్టుకున్న పాకిస్థాన్ రేంజర్ వదిలిస్తే నా భర్తను కూడా వాళ్లు వదిలేసే అవకాశం ఉంది.’’ అని హుగ్లీ జిల్లా రిష్రాకు చెందిన రాజనీ మీడియాతో అన్నారు.
‘ప్రయత్నిస్తున్నాం..’
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వ్యవహరాన్ని సీనియర్ టీఎంసీ(TMC) నేత, ఎంపీ కల్యాణ్ బెనర్జీ చూస్తున్నారు. శనివారం సాయంత్రం బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌తో ఇప్పటికే మాట్లాడానని, సాహును విడుదల చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.