సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్..

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసింది.

Update: 2024-06-26 07:58 GMT

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసింది. న్యాయమూర్తి అమితాబ్‌ రావత్‌ ఆదేశాలు జారీ చేసిన వెంటనే సీబీఐ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తీహార్ కేంద్ర కారాగారం నుంచి కేజ్రీవాల్‌ను ఉదయం కోర్టు ముందు హాజరుపర్చారు. ఆయనను కస్టడీకి కోరుతూ కోర్టుకు సీబీఐ దరఖాస్తు చేసుకుంది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఇప్పటికే ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

సుప్రీంలో పిటీషన్‌ వెనక్కు..

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరుచేస్తూ ట్రయల్‌ కోర్టు గత గురువారం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే ట్రయల్‌ కోర్టు తమ వాదనలకు తగినంత సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఈడీ..ఢిల్లీ హైకోర్టుకు ఆశ్రయించింది. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులపై గత శుక్రవారం హైకోర్టు స్టే విధించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని.. సర్వోన్నత న్యాయస్థానం సోమవారం సూచించింది. దీనిపై బుధవారం విచారణ జరిగింది. అయితే స్టేను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని కేజ్రీవాల్ కోరగా.. అందుకు కోర్టు అంగీకరించింది. హైకోర్టు పూర్తిస్థాయి ఆదేశాలు, సీబీఐ అరెస్టు వంటి కొత్త పరిణామాల నేపథ్యంలో సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ న్యాయస్థానాన్ని కోరారు. జిస్టిస్‌ మనోజ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీతో కూడిన సెలవుకాల ధర్మాసనం అందుకు అనుమతించింది.

Tags:    

Similar News