చలి గుప్పెట తెలుగు రాష్ట్రాలు

చలి.. పులి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది

Byline :  Amaraiah Akula
Update: 2023-12-16 04:34 GMT
చలి మంట వద్ద ప్రజలు

చలి.. పులి తెలుగు రాష్ట్రాలను వణికిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పడిపోతున్నాయి. బారెడు పొద్దెక్కినా జనం గడప దాటడం లేదు. మసకేసిన మబ్బులు, కమ్మిన పొగమంచు.. వెచ్చదనం కోసం చలిమంటలు, పొగలు కక్కుతున్న ఛాయ్‌లు.. రెండు రోజులుగా తూర్పు దిశగా చలిగాలులు వీస్తున్నాయి. అందుకే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఇక రేపటి నుంచి చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చలిగాలులకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

రాత్రి వేళల్లో బాగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు...
రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతున్నాయి. ఆ సమయంలో బయటకి వెళ్లాలంటే పెద్ద సాహసమే.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత 10 నుంచి 13 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. డిసెంబరు చివరి వారంలో చలి తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా రంగారెడ్డి జిల్లాలో 10.4 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
డాక్టర్ల సూచనలు, సలహాలు
గుండెజబ్బులున్న వారు, మధుమేహం, హైబీపీ ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వృద్ధులు, చిన్నారులు బయటకు రావద్దని వైద్య అధికారులు సూచిస్తున్నారు. చలి ప్రభావం వల్ల గొంతులో ఇన్పెక్షన్లు, జలుబు వ్యాధులు వస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడతారని బయటకు రావద్దని సూచించారు.
ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే...
ఇటు ఏపీలోనే అదే పరిస్థితి.. పలు ప్రాంతాల్ని దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. తిరుమల సప్తగిరులను మొత్తం మేఘాలు కప్పేశాయి. పొగమంచు నిండి ప్రకృతి రమణీయంగా కనిపిస్తున్న తిరుగిరులను చూసి భక్తులు మైమరిచిపోతున్నారు. మరోవైపు వాహనదారులు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
తిరుమలలోనూ వణుకు
తిరుమలలో చలితీవ్రత బాగా పెరిగింది. దీనికి తోడు నిన్న వర్షం కూడా పడింది. దీంతో శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తున్న భక్తులు వర్షంలో తడుస్తూ చలికి వణుకుతూ గదులకు చేరుకున్నారు. అకస్మాత్తుగా తిరుమలలో రద్దీ కూడా పెరగడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.
దీంతో టీటీడీ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలుగా శ్రీవారి పాదాలు, పాపవినాశనం మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ఘాట్‌ రోడ్డులో వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సొంత వాహనాల్లో ఘాట్‌రోడ్డులో ప్రయాణించే వారిని అలిపిరి వద్ద TTD సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఘాట్‌రోడ్లలో రహదారి మరమ్మతు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అప్రమత్తంగా వెళ్లాలని సూచిస్తున్నారు.
పాడేరులో పడిపోయిన ఉష్ణోగ్రత..
అల్లూరి జిల్లా పాడేరులో ఉష్ణోగ్రత 13గా నమోదైంది. వంజంగి మేఘాల కొండను మంచు దుప్పటి కమ్మేసింది. ఆ ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు.

మరో మూడు రోజులు ఇదే పరిస్థితి

రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడమే ప్రస్తుత చలి గాలులకు కారణమని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి నాగరత్నం చెప్పారు. తెలంగాణలో చాలా చోట్ల నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్ర­త ఖమ్మంలో 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్‌లో ఉష్ణోగ్ర­త­లు సాధారణం కంటే 1.8 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యా­యని వివరించారు. రానున్న మూడు రోజుల పాటు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసిందని నాగరత్నం తెలిపారు.

Tags:    

Similar News