‘ఎన్డీయే నేతల వ్యాఖ్యలపై కేసులు నమోదు చేయాలి’
రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అధికార ఎన్డీయే నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అధికార ఎన్డీయే నేతలు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఐసీసీ కోశాధికారి ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ నేతలు తర్విందర్ సింగ్ మార్వా, రవ్‌నీత్ సింగ్ బిట్టు, రఘురాజ్ సింగ్, శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ పై ఫిర్యాదు చేశారు. వారు ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో పొందుపరుస్తూ.. వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు.
'నేతలు దిగజారి మాట్లాడుతున్నారు’
ఫిర్యాదు అనంతరం మీడియాతో మాకెన్ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గిరిజనులు, మైనారిటీల గురించి మాట్లాడుతున్నారు. అందుకే ఆయన మాటలు బీజేపీ వాళ్లకు నచ్చడం లేదు. బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొంతమంది నాయకుల వ్యాఖ్యల వల్ల రాజకీయాల్లో విలువలు దిగజారుతున్నాయి. ఒక్క బీజేపీ నాయకుడే కాదు. చాలా మంది నేతలు అలానే మాట్లాడుతున్నారు. కానీ పార్టీలు వారిపై ఏ చర్యలు తీసుకోవడం లేదు.’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాలుకను ఎవరైనా కోసేస్తే వారికి రూ.11లక్షల రివార్డు అందిస్తానంటూ ఇటీవల మహారాష్ట్రలోని బుల్దానా నియోజకవర్గ శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో రిజర్వేషన్ల వ్యవస్థను తొలగించాలనే ఆలోచనలో ఉన్నట్లు విదేశీ పర్యటనలో ఉండగా రాహుల్ వ్యాఖ్యానించారని, దీన్నిబట్టి కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని గైక్వాడ్ విమర్శించారు. ప్రతిపక్ష నేతను దేశంలోనే నంబర్ వన్ టెర్రరిస్టు అంటూ రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ బిట్టు చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో పేర్కొన్నారు. "హింస, శాంతికి విఘాతం కలిగించే లక్ష్యంతో మిస్టర్ గాంధీపై ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు." అని ఫిర్యాదులో పేర్కొన్నారు.