పహల్గామ్ ఉగ్రదాడిలో తండ్రిని కోల్పోయిన తనయ..

ఇద్దరు కవల పిల్లలతో అడవిలోకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్న కేరళ వాసి ఆరతి..;

Update: 2025-04-24 12:38 GMT
Click the Play button to listen to article

భర్త, పిల్లలతో దుబాయ్‌లో ఉంటున్న ఆరతి ఆర్ మీనన్ ఈ మధ్యే పుట్టిల్లు కేరళ(Kerala)కు వచ్చారు. అమ్మనాన్నతో కలిసి సమ్మర్ వెకేషన్‌కు ప్లాన్ చేశారు. పహల్గామ్(Pahalgam) వెళ్లాలని నిర్ణయించుకుని కశ్మీర్‌కు బయలుదేరారు. వారి ప్రయాణంలో విషాదం చోటుచేసుకుంటుందని ఊహించలేకపోయారు.

మినీ-స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్ గడ్డి మైదానంలోకి చోరబడ్డ ఉగ్రమూకలు అక్కడి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. మృతుల్లో ఆరతి తండ్రి ఎన్ రామచంద్రన్ కూడా ఉన్నారు.

బుధవారం రాత్రి కొచ్చి చేరుకున్న ఆరతి అత్యంత బాధాకర క్షణాలను గుర్తుచేసుకున్నారు. తన కళ్ల ముందే తండ్రిని టెర్రరిస్టులు (Terror attack) హతమార్చడం, ప్రాణ భయంతో తన ఎనిమిదేళ్ల ఇద్దరు కవల పిల్లలతో అడవుల్లో పరిగెత్తడం గురించి విలేఖరులకు వివరించారు ఆరతి.

‘కళ్లముందే కాల్చేశారు..’

"నేను, నా పిల్లలు, నాన్నతో కలిసి బైసరన్ మైదాన ప్రాంతానికి చేరుకున్నాం. గుండె జబ్బు కారణంగా మా అమ్మ ట్రెక్కింగ్‌కు రాలేదు. మేం అక్కడికి వెళ్లేటప్పటికే చాలా మంది పర్యాటకులున్నారు. కాసేపటికి తుపాకీ పేలిన శబ్దం నాకు వినిపించింది. ఇంతలో తుపాకీ పట్టుకున్న వ్యక్తి గాల్లోకి కాల్పులు జరుపుతూ అందరినీ పడుకోమని హెచ్చరించాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఏదో అడుగుతున్నారు. ఒక వ్యక్తి మా దగ్గరకు వచ్చి నాన్నగారిని ఏదో అడిగాడు. అది ఒకే పదంలా అనిపించింది. బహుశా 'కల్మా' అనుకుంటా. నాన్న తనకు అర్థం కాలేదని చెప్పారు. ఏమాత్రం ఆలోచించకుండా నిర్ధాక్షిణ్యంగా నాన్నపై తుపాకీ గురిపెట్టి కాల్చాడు. ఆ ఘటనలో నేను ఒక్కసారిగా షాక్‌‌కు గురయ్యా. అదే వ్యక్తి నా తలపై కూడా గురిపెట్టాడు. కాని నా కొడుకులు ఏడుస్తుండడంతో వదిలేశాడు. మా దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఎలాంటి యూనిఫాం లేదు. వారంతా ఎక్కడి నుంచి వచ్చారో కూడా నాకు తెలియదు.’’

‘పిల్లలతో అడవుల్లోకి పరిగెత్తా..’

నాన్నను చంపేయడం చూసి నా పిల్లలతో నేను అడవుల్లోకి పారిపోయాం. దాదాపు గంటసేపు పరిగెత్తాం. చివరికి మా కారు డ్రైవర్ ముజాఫిర్‌కు ఫోన్ చేశా. అతను కశ్మీరీ. తను ఉన్న చోటు చెప్పాడు. సుమారు 200 మీటర్ల దూరం పరిగెత్తి కారు వద్దకు చేరుకున్నాం. మేం కారు వద్దకు చేరుకోగానే భద్రతా బలగాలు, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాయంత్రానికి భద్రత బలగాలు, అధికారులు మమ్మల్ని సంప్రదించారు. అప్పటికి నాన్న చనిపోయాడని నాకు తెలుసు.’’

‘అందుకు అమ్మకు తెలియనివ్వలేదు’..

"గుండెజబ్బుతో బాధపడుతున్న అమ్మకు ఈ దుర్ఘటన గురించి తెలియకూడదని నేను హోటల్‌ గదిలో, విమానాశ్రయం లాబీలో టీవీని డిస్‌కనెక్ట్ చేయమని కోరారు. జరిగిన ఘటన గురించి అమ్మకు నెమ్మదిగా చెప్పి.. నాన్నకు చికిత్స చేస్తున్నారని చెప్పా.

శుక్రవారం అంత్యక్రియలు..

ఎన్ రామచంద్రన్ భౌతికకాయం కోసం కేంద్ర, రాష్ట్ర మంత్రులు విమానాశ్రయానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రులు సురేష్ గోపి, జార్జ్ కురియన్, రాష్ట్ర మంత్రులు చింజు రాణి, పి ప్రసాద్, ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్, ఎర్నాకులం ఎంపీ హిబి ఈడెన్ ఎయిర్‌పోర్టు చేరుకున్న వారిలో ఉన్నారు. రామచంద్రన్ అన్నయ్య రాజగోపాల్ కుటుంబసభ్యులతో కలిసి న్యూయార్స్‌లో ఉంటున్న కూతురు దగ్గరకు వెళ్లారు. వాళ్లు తిరిగి రాగానే శుక్రవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. 

Tags:    

Similar News