దుర్గాపూర్ సామూహిక అత్యాచార ఘటనలో సీన్ రికన్‌స్ట్రక్షన్..
నిందితుల దుస్తులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు..
పశ్చిమ బెంగాల్(West Bengal) రాష్ట్రం దుర్గాపూర్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచార(Gang rape) ఘటనలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన అమ్మాయి దుర్గాపూర్(Durgapur) మెడికల్ కాలేజీలో సెకండీయర్ చదువుతోంది. తన స్నేహితుడితో కలిసి శుక్రవారం రాత్రి డిన్నర్ కోసమని కాలేజీ నుంచి బయటకు వెళ్లింది. క్యాంపస్ నుంచి 1.5 కి.మీ దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో వారిని అటకాయించి విద్యార్థినిపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు.
వారిని మంగళవారం (అక్టోబర్ 14) మధ్యాహ్నం పోలీసులు నేరం జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రికన్‌స్ట్రక్షన్ చేశారు. గ్యాంగ్‌రేప్ సమయంలో ప్రాణభయంతో బాధితురాలిని వదిలేసి వెళ్లిన ఆమె స్నేహితుడు ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు. అతనిని కూడా క్రైమ్ స్పాట్‌కు తీసుకెళ్లారు.
నిందితుల దుస్తుల సేకరణ..
అంతకుముందు పోలీసులు ఐదుగురు నిందితుల ఇళ్లకు వెళ్లారు. ఘటన సమయంలో వారు ధరించిన బట్టలు, ఇతరత్రా వస్తువులను సేకరించి వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితులకు గతంలో నేరచరిత్ర ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీన్ రికన్‌స్ట్రక్షన్ పూర్తయిన వెంటనే నిందితులను వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తీసుకెళ్లనున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
ఎవరా నిందితులు?
ఐదుగురిలో ప్రధాన నిందితుడు దుర్గాపూర్ సమీపంలోని బిర్జా గ్రామానికి చెందిన సఫీక్ షేక్ (28)ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. రోలింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేసే నఫీక్‌ను పట్టించడంలో అతని అక్క రోజినా షేక్ పోలీసులకు సాయం చేసినట్లు తెలుస్తోంది. ఆండాల్ వంతెన వద్ద తనను కలవడానికి రావాలని తప్పించుకుని తిరుగుతున్న నఫీక్‌కు సమాచారం పంపింది రోజినా. అదే విషయాన్ని పోలీసులకు చెప్పింది. అక్కడకు రాగానే పోలీసులు సఫీక్‌ను పట్టుకున్నారు. తాము పేదవారమయినా..ఆత్మగౌరవం ఉందని, ఆడపిల్ల విషయంలో జరిగిన దానికి తాము సిగ్గుపడుతున్నామని చెబుతూనే.. గతంలో సఫీక్ ఏ స్త్రీతోనూ తప్పుగా ప్రవర్తించలేదని రోజినా పోలీసులకు చెప్పింది.
రెండో నిందితుడు రియాజుద్దీన్ షేక్ (31) బాధితురాలు చదువుకున్న మెడికల్ కాలేజీలో మాజీ సెక్యూరిటీ గార్డు. దాదాపు 14 నెలలు పాటు పనిచేశాడు. అనుచిత ప్రవర్తన కారణంగా రియాజుద్దీన్‌ను విధుల నుంచి తొలగించినట్లు సమాచారం. ఇతను కూడా బిర్జా గ్రామానికి చెందినవాడు కాగా తండ్రి షేక్ జమీర్ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త, స్థానిక లేబర్ కాంట్రాక్టర్ అని కూడా తెలిసింది.
మూడో నిందితుడు అపు బారుయ్ (22) దినసరి కూలీ. భార్య, రెండేళ్ల పాప కూడా ఉంది. నాల్గో నిందితుడు ఫిర్దౌస్ షేక్ (23) మరో ఆసుపత్రిలో గ్రూప్ డి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఐదో నిందితుడు బిర్జాకు చెందిన షేక్ నసీరుద్దీన్ (24) స్థానిక పౌర సంస్థలో తాత్కాలిక ఉద్యోగి.
ఈ ఐదుగురు దుర్గాపూర్ మెడికల్ కాలేజీకి సమీపంలోని నిర్జన ప్రదేశంలో తిరుగుతూ అటుగా వెళ్లి జంటలను ఆపి బలవంతపు వసూళ్లకు పాల్పడేవారు. అలా దోచుకున్న డబ్బును వ్యసనాలకు ఉపయోగించేవారు.
వాదనకు ముందుకురాని లాయర్లు..
నిందితులెవరి తరుపున వాదించారని దుర్గాపూర్ బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పూజా కుర్మిని నిందితుల తరపు న్యాయవాదిగా నియమించినట్లు సమాచారం. అయితే ఆమె నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని న్యాయమూర్తిని కోరలేదు.
సర్క్యూలర్ జారీ..
దుర్గాపూర్‌లో తన కూతుర్ని చదివించనని, తమ సొంత రాష్ట్రం ఒడిశాలో చదువు కొనసాగించేందుకు అవకాశం కల్పించాలని బాధితురాలి తండ్రి సీఎం మోహన్ చరణ్ మాఝీని కోరిన విషయం తెలిసిందే. అయితే కాలేజీ యాజమాన్యం తన కళాశాలలోనే కోర్సు పూర్తి చేయాలని చెప్పినట్లు సమాచారం. రాత్రి 10 గంటల తర్వాత విద్యార్థులెవరూ క్యాంపస్ నుండి బయటకు వెళ్లవద్దని కూడా కాలేజీ యాజమాన్యం సర్క్యూలర్ జారీ చేసింది.