ఎన్నికల తరువాత రాహూల్ గాంధీని అరెస్ట్ చేస్తాం: అసోం సీఎం

భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా గువాహటీ లో జరిగిన హింసకు రాహూల్ గాంధీ కారణమని అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ ఆరోపించారు.

Update: 2024-01-24 15:08 GMT

అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ , కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గువాహటీ లో జరిగిన హింసకు రాహూల్ గాంధీ కారణమని, వచ్చే లోక్ సభ ఎన్నికల తరువాత రాహూల్ గాంధీని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.

తన ఫ్యాన్సీ బస్సు నుంచి బయటకు దిగిన రాహూల్ గాంధీ.. తరువాత పార్టీ కార్యకర్తలను హింసకు ప్రేరేపించాడని, అనంతరం ఓ చిన్న కారులో తన తదుపరి యాత్ర మజిలీ అయినా హజోకు పారిపోయాడని, వట్టి పిరికివాడు అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశాడు. రాహూల్ గాంధీ బస్సు యాత్రలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాడని హ..హ . .హ అని అందులో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మంగళవారం నాటి న్యాయ్ యాత్రలో జరిగిన హింసాత్మక చర్యలపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని, రాహుల్ తో హింసాత్మక చర్యలకు కారణమైన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

"మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తు ప్రారంభించింది. లోక్ సభ తరువాత రాహూల్ గాంధీని అరెస్ట్ చేస్తాం" అసోం సీఎం అన్నారు. సిబ్ సాగర్ జిల్లా నజీరాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇదే విషయంపై డీజీపీ సైతం మాట్లాడారు. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(సీఐడీ) ఆధ్వర్యంలో సిట్ వేసి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని ప్రకటించారు.

కాగా మంగళవారం నాడు భారత్ జోడో న్యాయ్ యాత్ర గువాహటీ నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. బారికేడ్లను విరగొట్టి, పోలీసులతో వాగ్వాదానికి దిగారని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అల్లర్లు రేపేందుకు ప్రయత్నించారని అందుకే కేసు నమోదు చేయాలని అసోం సీఎం పోలీసులను ఆదేశించారు. వీరిపై నేరపూరిత కుట్ర, చట్టవిరుద్దమైన సమావేశాలు, అల్లర్లు, దాడి, ఇలా ఐపీసీలోని పలు సెక్షన్ లకింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. 

Tags:    

Similar News