‘ఓటరు జాబితా సవరణ - కుట్రలో భాగమే’

కేంద్రంపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..;

Update: 2025-07-09 10:28 GMT
Click the Play button to listen to article

కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంపై ధ్వజమెత్తారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ "రిగ్గింగ్"కు పాల్పడిందని, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని బీహార్‌(Bihar)లో మళ్లీ పునరావృతం చేయాలని చూస్తోందని లోక్‌సభా ప్రతిపక్ష నేత ఆరోపించారు. బీహార్‌(Bihar)లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (S.I.R) చేయాలన్న ఎలక్షన్ కమిషన్ నిర్ణయానికి వ్యతిరేకంగా బుధవారం (జూలై 9) విపక్ష పార్టీలు ప్రధానంగా కాంగ్రెస్, ఆర్జేడీ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ ఏడాది చివర్లో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

I.N.D.I.A బ్లాక్ యునైటెడ్ షో..

రాహుల్ గాంధీ బుధవారం ఉదయం పాట్నా చేరుకుని నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయన వెంట ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, ఇతర ప్రతిపక్ష పార్టీల సీనియర్ నాయకులు ఉన్నారు. ఇన్‌కమ్ టాక్స్ గోలంబార్ వద్ద నుంచి నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. మహాఘట్‌బంధన్ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైళ్లు, వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పాట్నాలోని మహాత్మా గాంధీ సేతు మార్గంలో టైర్లను తగలబెట్టారు.

‘బీజేపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు..’

నిరసన ప్రదర్శనలో భాగంగా పాట్నాలోని ఈసీ కార్యాలయం ఇండియా బ్లాక్ కార్యకర్తలనుద్దేశించి రాహుల్ మాట్లాడుతూ.."మహారాష్ట్రలో బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడింది. బీహార్‌లోనూ అలాగే చేయాలని కుట్ర చేస్తున్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు మధ్య కోటి మంది ఓటర్లను చేర్చారు. దాన్ని మేం బయటపెట్టాం. ఇప్పుడు బీహార్‌లో ఓటర్లను తొలగించి బీజేపీ గెలుపునకు ఈసీ పరోక్షంగా సహకరిస్తుంది," అని ఆరోపించారు. తాము చేయాల్సిన పనికి బదులుగా ఎన్నికల కమిషనర్లు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News