Encounter | బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్, 31 మంది మావోయిస్టుల హతం

ఛత్తీస్ ఘడ్ లో ఆదివారం ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 31మంది మావోయిస్టులు హతం అయ్యారు.;

Update: 2025-02-09 06:33 GMT

2026వ సంవత్సరం మార్చి నెలలోపు మావోయిస్టులను పూర్తిగా ఏరివేయాలనే లక్ష్యంతో కేంద్ర హోం మంత్రిత్వశాఖ దూకుడు పెంచింది. మావోయిస్టులకు నిలయంగా ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు డీఆర్జీ, ఎస్టీఎఫ్ దళాలకు చెందిన సాయుధ పోలీసులు గాలింపు చేపట్టారు.


రక్తసిక్తమైన బీజాపూర్ అడవులు
కేంద్ర హోంమంత్రిత్వశాఖ భద్రతాబలగాలతో దూకుడుగా కుంబింగ్ చేస్తుండటంతో బీజాపూర్ అడవులు మరోసారి రక్తసిక్తమయ్యాయి. భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు కాల్పులు జరపగా, భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి.ఆదివారం తెల్లవారుజామున జరిగిన భీకర కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించారని పోలీసు వర్గాలు తెలిపాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతం కాగా మరికొంత మంది గాయపడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. అడవుల్లోని చెట్ల మధ్య మావోయిస్టులు బుల్లెట్ గాయాలతో రక్తం ఓడుతూ నేలకొరిగారు.

వరుస ఎన్ కౌంటర్లు
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం పేరు వరుస ఎన్ కౌంటర్లతో తరచూ జాతీయ వార్తల్లోకి ఎక్కుతుంది. ఛత్తీస్ ఘడ్ -ఒడిశా రాస్ట్ర సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లా కుల్హాడీ ఘాట్ అడవుల్లో జరిగిన భారీ ఎన్ కౌంటరులో 20 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇటీవల మావోయిస్టుల ఖిల్లాగా పేరొందిన కుతుల్ ప్రాంతంలో భద్రతా బలగాలు బేష్ క్యాంప్ ఏర్పాటుచేసి మావోయిస్టుల ఏరివేత కోసం గాలింపును ముమ్మరం చేశాయి. ఛత్తీస్ ఘడ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డులు, సీఆర్పీఎఫ్, కోబ్రా, స్పెషల్ ఆపరేషన్ పోలీసులు రంగంలోకి దిగి అడవుల్లో జల్లెడ పడుతుండగా ఆదివారం ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగింది.

ఆపరేషన్ కగార్
ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర హోంమంత్రిత్వశాఖ ప్రతీ అయిదు కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసి అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తోంది. దీంతో ఛత్తీస్ ఘడ్ అడవులు తరచూ తుపాకీ కాల్పుల మోతలతో దద్దరిల్లుతున్నాయి. మావోయిస్టుల స్థావరాలను గుర్తించి బలగాలు కుంబింగ్ సాగిస్తున్నాయి.


Tags:    

Similar News