భారత్ రైస్ కిలో రూ.29! గోయల్ రావడంతోనే గోతాల్లో ఇస్తారు!!
144 కోట్ల మంది జనాభాలో 81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం. అయినా ధరలు తగ్గడం లేదు. అందుకే ఇప్పుడు భారత్ రైస్ వచ్చింది. జనం ఎగబడుతున్నారట ఢిల్లీలో
దేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయంటే కేంద్ర ప్రభుత్వం మండిపడొచ్చు గాని బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయని సాక్షాత్తు కేంద్ర మంత్రి పియూష్ గోయలే చెప్పారు. బియ్యం ధరల్ని కట్టడి చేయడానికి ‘భారత్ రైస్’ పథకాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఆహార శాఖ ప్రకటించింది. కేంద్ర ఆహార మంత్రి పీయూష్ గోయల్ న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో పథకాన్ని ప్రారంభించారు. భారతీయ ఆహార సంస్థ- ఎఫ్.సి.ఐ ఈ పథకానికి 5 లక్షల టన్నుల బియ్యాన్ని సమకూర్చింది.
కిలో బియ్యం రేటెంతంటే...
సబ్సిడీ రేటు బియ్యాన్ని ‘భారత్’ బ్రాండ్ పేరుతో కేంద్రం అమ్మకాలు చేపట్టింది. కిలో భారత్ బ్రాండ్ రైస్‌ను రూ.29కే అందుబాటులోకి తెచ్చింది. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో మార్కెట్లోకి విడుదల చేసింది. భారత్ ఆటా , భారత్ దాల్‌ను విక్రయిస్తున్న ఏజెన్సీలతో పాటు ఈ-కామర్స్ వెబ్‌సైట్లలోనూ బియ్యం అమ్మకాలుంటాయని కేంద్ర ఆహార శాఖ తెలిపింది.
దేశంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ‘భారత్ రైస్’ పేరిట బియ్యాన్ని అమ్మడం మంచి నిర్ణయమే. అయితే దేశంలో 81 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నామని, ఆ బియ్యాన్నే ఇప్పుడు కిలో రూ.29కే విక్రయిస్తామనడమే అన్యాయమన్న విమర్శలు లేకపోలేదు.
ఫిబ్రవరి 6వ తేదీ నుంచే ఈ బియ్యాన్ని విక్రయించనున్నట్టు కేంద్ర ఆహార శాఖ ప్రకటించింది. ‘భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF), కేంద్రీయ భండార్ రిటైల్ కేంద్రాల్లో ఈ భారత్ రైస్‌ను విక్రయిస్తున్నాం’ అన్నారు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా.
తొలి దశలో భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యాన్ని విక్రయించనున్నారు. ఈ భారత్ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే భారత్ ఆటా (గోధుమపిండి)ని కిలో రూ27.50లకు, పప్పుధాన్యాలను భారత్ దాల్ పేరిట కిలో రూ.60 చొప్పున కేంద్రం విక్రయిస్తోంది. ప్రజల నుంచి వీటికి ఏ విధంగా అయితే మంచి స్పందన వస్తోందో.. భారత్ రైస్‌కు కూడా అంతే ఆదరణ వస్తుందని సమాచారం.
భిన్న వాదనలు...
ధరలను నియంత్రచలేకనే ఉపశమనం కార్యక్రమాలకు, పథకాలకు కేంద్రం శ్రీకారం చుట్టిందన్న విమర్శలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లకు బియ్యాన్ని సరఫరా చేసే హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లపై ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుందో చెప్పాలంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పండుతున్న పంట ఎంత, మనకు ఎంత కావాలి అనే దానిపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని విపక్షం అంటోంది. మరోపక్క, కేంద్ర ప్రభుత్వం స్టాక్ హోర్డింగ్ లెక్కలు తేల్చేపనిలో పడింది. రిటైలర్లు, హోల్‌సేలర్లు, ప్రాసెసర్లు, పెద్ద రిటైల్ చైన్‌ల ఎంత స్టాక్ ఉందో చెప్పాలని కోరింది.
81 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం...
దేశ జనాభా 144 కోట్లనుకుంటే అందులో 81 కోట్ల మంది పేదలు. వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులపై ఉచితంగా ఎఫ్‌సిఐ బియ్యాన్ని అందజేస్తోంది. మరి అటువంటప్పుడు బియ్యం ధరలు ఎలా పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎఫ్‌సిఐ వద్ద భారీ స్టాక్ ఉంది. ధాన్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (ఓఎంఎస్‌ఎస్) ద్వారా విక్రయిస్తుంది. అందువల్ల, ఎఫ్.సి.ఐ సేకరించని రకాల బియ్యం ధరలు పెరుగాలి. కాని అన్ని రకాల బియ్యం ధరలు పెరుగుతున్నాయంటే దానర్థం లోపం మరెక్కడ ఉంటే చికిత్స మాత్రం మరోచోట చేస్తున్నట్టుగా ఉందంటున్నారు నిపుణులు. ఈ స్కీం అసలు పేదలకు ఉపయోగపడక పోవచ్చుననే సందేహాలు కూడా ఉన్నాయి.