గ్రాండ్ ముఫ్తీ జోక్యం.. కేరళ నర్సు నిమిషాను ఉరి నుంచి తప్పిస్తుందా?

మృతుడి కుటుంబసభ్యులతో ఇవాళ మరోసారి చర్చలు.. ‘బ్లడ్ మనీ’తో సిద్ధంగా ఉన్న నిమిషా కుటుంబం..;

Update: 2025-07-15 07:34 GMT
Click the Play button to listen to article

యెమన్(Yemen) దేశంలో కేరళ(Kerala) నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya)కు రేపు ఉరి శిక్ష అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతదేశ గ్రాండ్ ముఫ్తీ, కేరళకు చెందిన సున్నీ నాయకుడు కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ జోక్యంతో ఆశలు చిగురించాయి. చర్చలు ముగిసే వరకు ఉరిశిక్ష నిలిపివేయాలన్న ముఫ్తీ విజ్ఞప్తిని యెమెన్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది. భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మృతుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబసభ్యులతో మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. ముస్లియార్‌ తన స్నేహితుడు ప్రఖ్యాత యెమెన్ పండితుడు షేక్ హబీబ్ ఉమర్ ద్వారా ఈ కేసులో మధ్యవర్తిత్వం వహిస్తున్నారు.

యెమెన్ షురా కౌన్సిల్ మెంబర్ కూడా అయిన ఉమర్ అభ్యర్థన మేరకు..మృతుడి దగ్గరి బంధువు, హుదైదా రాష్ట్ర కోర్టు ప్రధాన న్యాయమూర్తి చర్చలలో పాల్గొనడానికి యెమెన్‌లోని దామర్‌కు ఇప్పటికే చేరుకున్నారని సమాచారం. మృతుడి కుటుంబసభ్యులు కూడా తమ వైఖరి మార్చుకుని ఉమర్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రేపు జరగాల్సిన ఉరిశిక్షను వాయిదా వేయాలని యెమెన్ అటార్నీ జనరల్‌ను ఉమర్ కోరే అవకాశం ఉంది. అయితే రాబోయే 24 గంటలు చాలా కీలకమని అధికారులు, పరిశీలకులు చెబుతున్నారు.

ఇంతకు నిమిషా చేసిన నేరమేంటి?

కేరళకు చెందిన నిమిషా ప్రియ నర్సింగ్ పూర్తి చేసింది. 2008లో నర్సుగా పని చేయడానికి యెమెన్ దేశానికి వెళ్లింది. కొన్నేళ్ళ పాటు పలు ఆస్పత్రుల్లో పని చేసిన అనుభవంతో సొంతంగా ఓ క్లినిక్ ప్రారంభించాలనుకుంది. యెమెన్ నిబంధనల ప్రకారం విదేశీయులు క్లినిక్ తెరవడానికి వీల్లేదు. స్థానికుల భాగస్వామ్యంతో క్లినిక్ నడపవచ్చని తెలుసుకున్న నిమిషా.. తన బిజినెస్ పార్ట్‌నర్‌గా తలాల్ అబ్దోను ఎంచుకుంది. అప్పటికే నిమిషాకు పెళై కూతురు కూడా ఉంది. కూతురి బాప్టిజం కార్యక్రమానికి నిమిషాతో అబ్దో కేరళకు వచ్చాడు. ఇంట్లో ఉన్న నిమిషా పెళ్లి నాటి ఫొటోలు అబ్దో దొంగిలించినట్లు సమాచారం. ఆ ఫోటోలను యెమన్‌లో మార్ఫింగ్ చేయించి నిమిషాను తన భార్య అని చెప్పకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అబ్దో జైలు పాలయ్యాడు. విడుదలై వచ్చాక నిమిషాను వేధించటం మొదలెట్టాడు. క్లినిక్ ద్వారా వచ్చే డబ్బును బలవంతంగా తీసుకెళ్లేవాడు. తన వేధింపులకు భరించలేక కేరళకు వెళ్లిపోతుందేమోనని ఆమె పాస్ పోర్టును కూడా తన వద్దే ఉంచుకున్నాడు. అబ్దో వేధింపులకు ఫుల్‌స్టాప్ పెట్టాలనుకున్న నిమిషా ఓ ప్లాన్ వేసింది. మత్తు మందు ఇచ్చి తన పాస్ పోర్టు తీసుకుని కేరళ వెళ్లిపోవాలనుకుంది. ప్లాన్‌లో భాగంగా అబ్దోకు మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది. డోస్ ఎక్కువకావడంతో అబ్దో చనిపోయాడు. పోస్టుమార్టం రిపోర్టులో మత్తుమందు ఇవ్వడం వల్లే మృతిచెందాడని నిర్ధారణ కావడంతో నిమిషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇండియాకు తిరిగి వస్తున్న సమయంలో ఆమెను యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2017నుంచి జైలు శిక్ష అనుభవిస్తోంది. 2018లో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. మొదట జీవిత ఖైదు విధించింది. తర్వాత దాన్ని మరణ శిక్షగా మార్చింది. 2023లో యెమెన్ సుప్రీం జుడీషియల్ కౌన్సిల్ కూడా మరణ శిక్షను సమర్థించింది.

‘బ్లడ్ మనీ’కి సిద్ధమైన నిమిషా ఫ్యామిలీ..

నిమిషాను కాపాడుకోడానికి ఆమె కుటుంబం ‘బ్లడ్ మనీ’(Blood money)కి సిద్ధమైంది. నిమిషా కుటుంబానికి పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న సమీల్ జెరోమ్ ఇప్పటికే యెమెన్‌లోని సనాలో ఉన్నారని, ఆయన అబ్దో కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతున్నాడని సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కార్యకర్త బాబు జాన్ తెలిపారు. నిమిషాను ఉరిశిక్ష నుంచి కాపాడుకోడానికి మృతుడి కుటుంబానికి 1 మిలియన్ డాలర్లను బ్లడ్ మనీ ఇచ్చేందుకు నిమిషా కుటుంబం సిద్ధంగా ఉంది. ఆ డబ్బును స్వీకరించి అబ్దో కుటుంబసభ్యులు నిమిషాకు క్షమాభిక్ష పెడితే ఉరిశిక్ష నుంచి బయటపడినట్లే. 

Tags:    

Similar News