అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..
జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 9తో ముగుస్తుంది.;
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర గురువారం నుంచి నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల కారణంగా యాత్రా మార్గాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా బుధవారం యాత్రకు వెళ్లే రెండు మార్గాల్లో ఒకటైన బాల్టాల్ రూట్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మహిళా యాత్రికురాలు చనిపోగా.. మరో ముగ్గురు గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఏడాది జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్రను నిలిపివేయబడటం ఇదే ప్రథమం.
ఆన్‌లైన్‌లో 4 లక్షల మంది దరఖాస్తు..
3,880 మీటర్ల ఎత్తులో ఉన్న మంచులింగాన్ని ఇప్పటివరకు 2.35 లక్షలకు పైగా యాత్రికులు దర్శించుకున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొదటి బ్యాచ్ యాత్రకు జూలై 2న జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రకు ఇప్పటివరకు 4 లక్షలకు పైగా భక్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. గత సంవత్సరం 5.10 లక్షలకు యాత్రికులు స్వామిని దర్శించుకున్నారు. 38 రోజుల పాటు యాత్రికులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. జూలై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 9తో ముగుస్తుంది.