నేను అలా అనలేదు..వివరణ ఇచ్చుకున్న సీఎం సిద్ధరామయ్య
పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం విమర్శలు ఎదుర్కొంటున్నారు. చివరకు నేను అనలేదు అని ట్వీట్ చేశారు.;
కర్ణాటక(Karnataka) సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) మరోసారి వార్తల్లో నిలిచారు. పహల్గామ్ ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు కారణం. పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదన్న సిద్ధరామయ్య మాటలను పాకిస్థాన్ మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. యుద్ధం విషయంలో సొంత దేశంలోనే వ్యతిరేకత ఉందని హైలైట్ చేశాయి. దీంతో సిద్ధరామయ్య బీజేపీ నాయకులకు టార్గెట్ అయిపోయారు. కర్ణాటక శాసనసభ ప్రతిపక్ష నేత ఆర్. అశోక సిద్దరామయ్యను "పాకిస్తాన్ రత్న"గా అభివర్ణించారు. శత్రుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పాక్ ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు.
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కామెంట్ ఏమిటి?
సిద్దరామయ్య వ్యాఖ్యలపై తాను స్పందించబోనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. అయితే భారత ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పారు.
వివరణ ఇచ్చుకున్న సిద్ధరామయ్య..
‘‘పాకిస్థాన్‌తో యుద్ధం అవసరం లేదని చెప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇరుపక్షాల నడుమ యుద్ధం జరగాలి. అయితే.. ఇది పరిష్కార మార్గం కాదు. కశ్మీర్‌కు పెద్దఎత్తున పర్యాటకులు వెళ్తుంటారు. కాబట్టి.. వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఈ విషయంలో సర్కారు విఫలమైంది. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. అంతకుముందు పుల్వామాలో 40 మంది సైనికులు అమరులయ్యారు. ఈ ఘటనల్లో నిఘా వైఫల్యం ఉంది. ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేకపోయింది. అనివార్యమైతేనే యుద్ధం జరగాలి. అస్సలు చేయకూడదని కాదు. కానీ.. తక్షణమే అవసరం లేదు’’ అని సీఎం సిద్ధరామయ్య మీడియాతో తెలిపారు. ‘ఎక్స్’ వేదికలోనూ ఈమేరకు ఓ పోస్ట్ చేశారు.