‘ఐఓఏ చీఫ్ చేసిందేమీ లేదు’
భారత ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉషపై రెస్లర్ వినేష్ ఫోగట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన విషయంలో ఆమె చేసిందేమీ లేదని పేర్కొన్నారు.
వినేష్ ఫోగట్ గురించి పరిచయం అక్కర్లేదు. రెస్లర్‌గా ఆమె సుపరిచితురాలు. ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించడానికి కొన్ని గంటల ముందు అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. దాంతో భారత్ ఆమెపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. తన అనర్హతను సవాల్ చేస్తూ వేసిన పిటీషన్‌ను కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) కొట్టివేసింది. ఇక ఆమె చూపు రాజకీయాల వైపు మళ్లింది. కాంగ్రెస్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించి హర్యానాలోని జులనా నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిపింది. ఇంతవరకు బాగానే ఉన్నా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చీఫ్ పీటీ ఉషపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వీడియో బాగా వైరలయ్యింది.
మహిళల రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో వినేష్‌పై అనర్హత వేటు పడటంతో ఆసుపత్రి పాలైంది. ఈ విషయం తెలిసి ఉష ఆగస్ట్ 7న పారిస్‌కు వెళ్లి ఫోగట్‌ను కలిశారు. పీటీ ఉష కేవలం తనతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేందుకే వచ్చారని, ఆ ఫోటో కూడా తన అనుమతి లేకుండా తీశారని పేర్కొన్నారు. ఇదో పెద్ద రాజకీయం అని పేర్కొంటూ..తనకు మద్దతు తెలపడంలో IOA జాప్యం చేయడం వల్లే కాస్‌లో తీర్పు అనుకూలంగా రాలేదని వ్యాఖ్యానించారు. "రాజకీయాల్లో మూసిన తలుపుల వెనక జరిగే విషయాలకు, బయట జరిగే విషయాలు భిన్నంగా ఉంటాయి. నా విషయంలో కూడా అలాగే జరిగింది. అందుకే నేను గుండెలు బాదుకున్నాను. చాలా మంది ‘కుస్తీ వదలొద్దు’ అంటున్నారు. నేను ఇంక దేని కోసం కొనసాగించాలి? ప్రతిచోటా రాజకీయాలు ఉన్నాయి.” అని అన్నారు.