గుజరాతీయుల పాగాపై హర్యానా ప్రజల్లో కోపం పెరిగిపోతోందా?

గుజరాత్‌లోని సూరత్ నుంచి కంపెనీలు హర్యానాలోని హిసార్ వంటి ప్రాంతాలకు వచ్చి నగరంలోని వ్యర్థాలను రీసైకిల్ చేసి లాభాలు పొందుతున్నాయి.

By :  Abid Shah
Update: 2024-09-01 13:10 GMT

హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 90 సీట్లున్న ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేగం పుంజుకుంది. గుజరాత్‌కు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్ల ఉనికి హర్యానాలో బాగా పెరిగిపోయింది. ఫలితంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

లాభపడుతున్న గుజరాతీయులు..

గుజరాత్‌లోని సూరత్ నుంచి కంపెనీలు హర్యానాలోని హిసార్ వంటి ప్రాంతాలకు వచ్చి నగరంలోని వ్యర్థాలను రీసైకిల్ చేసి లాభాలు పొందుతున్నాయి. ఏ చెత్తకు ఏ రకం కుండీ వాడాలి? చెత్త తీసుకెళ్లే సమయం? చెత్త తీసుకెళ్తున్నందుకు ఎంత చెల్లించాలి? అన్న వివరాలతో గుజరాతీ కంపెనీలు స్థానిక హిందీ వార్తాపత్రికలలో ప్రకటలు ఇస్తున్నాయి. చెత్త సేకరించే సమయంలో నివాసితులు దుకాణదారులు క్యూ పాటించాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేసే వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు.

ఆ పని స్థానికుల వల్ల కాదా?

అయితే ఈ పనిని స్థానికులు చేయలేరా? అని ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం హిసార్ చుట్టుపక్కల ప్రాంతాలలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ కార్యకర్త ప్రబల్‌ ప్రతాప్‌ షాహి. "ఈ పని చేయడంలో హర్యానా మునిసిపాలిటీకి నైపుణ్యం లేదా?" అని ప్రశ్నిస్తున్నారు. చెత్త సేకరణ పనిని కూడా ప్రధాని సొంత రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్తలకు అప్పగించడాన్ని షాహి తప్పుబడుతున్నారు. ఇటీవల భారీ వర్షాలకు అహ్మదాబాద్‌ సహా గుజరాత్‌లోని పలు నగరాలు నీట మునిగాయి. వాటి గురించి ప్రస్తావిస్తూ..గుజరాత్ పౌర నిర్వహణ వ్యవస్థ హర్యానా కంటే మెరుగ్గా ఉందా? అని ప్రశ్నించారు.

గుజరాతీ వ్యాపారవేత్తలు రాష్ట్రంలోకి ప్రవేశించడాన్నికూడా హర్యానా రైతులు వ్యతిరేకించారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హర్యానాలోని పానిపట్ సమీపంలోని నౌల్తా వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో అదానీ అగ్రి లాజిస్టిక్స్ నిర్మించిన భారీ ధాన్యం నిల్వకు వ్యతిరేకంగా రైతులు నిరసన తెలిపారు. అందులోని సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వాగ్దానం చేయడంతో రైతులు ఉద్యమాన్ని విరమించుకున్నారు. అయితే ప్రధాని మాట నిలుపులేదని, రాబోయే ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెబుతామని రైతులు అంటున్నారు.

కొన్నేళ్ల క్రితం హర్యానా డిస్కామ్ (విద్యుత్ పంపిణీ సంస్థలు), అదానీ పవర్ మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి వివాదం చోటుచేసుకుంది. ఇది కూడా స్థానికంగా విద్యుత్ ధరలపై ప్రభావం చూపిందని హర్యానా ప్రజలు భావిస్తున్నారు.ఇవన్నీ త్వరలో జరగబోయే ఎన్నికలో బీజేపీపై ప్రభావం చూపుతాయో..లేదో వేచిచూడాలి. 

Tags:    

Similar News