పాఠశాలలో డ్రగ్స్ తయారీ.. ప్రిన్సిపాలే సూత్రధారా..?
నులిపురుగుల మాత్రలతో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా.;
హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని ఓ పాఠశాల పాత భవనంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈగల్ టీమ్ అధికారులకు పక్కా సమాచారం రావడంతో సదరు భవనంపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఈగల్ టీమ్‌కు విస్తుబోయే అంశాలు తెలిశాయి. ఈ మత్తుమందు దందాను ఆ పాఠశాల ప్రిన్సిపాలే మాస్టర్‌మైండ్‌గా ఉండి నడిపిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఏడాదిగా ఈ డ్రగ్స్ తయారీ దందా కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడ తయారైన డ్రగ్స్‌ను ఏయే ప్రాంతాలకు తరలిస్తున్నారు? ఏ మార్గాల్లో తరలిస్తున్నారు? వంటి అంశాలపై కూడా ఫోకస్ పెట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రిన్సిపాల్ గదిలోనే తయారీ..
మేధా స్కూల్ ప్రిన్సిపాల్ గదిలో మత్తుమందు మాత్రలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. గతేడాది స్కూల్ భవనంలోని రెండో అంతస్తులో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. గతేడాదే అక్కడ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందా ముఠా. ఎల్ఎస్‌డీ డ్రగ్స్‌ను అక్కడే తయారు చేసి విక్రయిస్తున్నారు. నులిపురుగుల మాత్రలను ఇతర రసాయనాలతో కలిపి మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు తమ దర్యాప్తులో వెల్లడయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడ తయారు చేసిన మత్త మందును కల్లు కాంపౌడ్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మత్తుమంద్రు తయారీ కేంద్రం నుంచి 7కిలోల ఆల్ఫాజోలం, రూ.20 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
పెరుగుతున్న డ్రగ్స్ దందాలు..
రాష్ట్రంలో డ్రగ్స్ దందాను అనచివేయడానికి అధికారులు, ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఎక్కడిక్కడ సోదాలు చేస్తూ, అనుమానం వస్తే మెరుపు దాడులు చేస్తూ డ్రగ్స్, గంజాయి వినియోగాన్ని నివారించే ప్రయత్నాలు చేస్తోంది. కానీ పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా డ్రగ్స్ దందాలు రోజురోజుకూ అధికం అవుతూనే ఉన్నాయి. ఇటీవల చూసుకుంటే అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీ కేంద్రాలను అధికారులు కొల్లగొట్టారు. కాగా ప్రతి ప్రాంతంలో ఆల్ఫాజోలం తయారీ అధికంగా జరుగుతుండటంతో దానిపై అధికారులు ఫోకస్ పెడుతున్నారు. శనివారం.. ఆబ్కారీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి జూపల్లి కూడా.. డ్రగ్స్ విషయంలో అధికారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.