అక్కా, ఎట్లున్నవే! కేజ్రీవాల్ భార్యను కలిసిన జార్ఖండ్ మాజీ సీఎం భార్య
లోక్‌సభ ఎన్నికలకు ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్‌ల భేటీ తర్వాత రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి
By : The Federal
Update: 2024-03-30 11:27 GMT
పాపం.. వీరిద్దరి కష్టాలూ ఒకటే. వీరిద్దరి భర్తలూ జైళ్లలో ఉన్నారు. భార్యలు మాత్రం ఇళ్ల దగ్గరున్నారు. భర్తలకు మద్దతుగా జనాన్ని, జనాభిప్రాయాన్ని కూడ గడుతున్నారు. కుడి ఎడంగా 45 రోజుల వ్యవధిలో వాళ్లిద్దర్నీ కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసింది. వాళ్లిద్దరే ఒకరు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మరొకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వీళ్లదరి సతీమణుల్లో ఒకరు సునీతా కేజ్రీవాల్ మరొకరు కల్పనా సోరెన్. వాళ్లిద్దరూ ఒకర్ని ఒకరు కలుసుకుని ఓదార్చుకోవడం శనివారం (మార్చి 30) అరుదైన దృశ్యంగా నమోదు అయింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను శనివారం కలిశారు. ఈ సందర్భంగా సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్ ఒకరికొకరు సాదరంగా స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ తీరును దుమ్మెత్తిపోశారు. అన్యాయంగా తమ భర్తల్ని అరెస్ట్ చేసి జైలు పాల్జేశారని మండిపడ్డారు. ఇదంతా ఊహించిందే అయినా అసలు వీరిద్దరూ ఎందుకు కలిశారన్నది దేశ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
వీళ్లద్దరూ ఎందుకు కలిసినట్టు?
లోక్‌సభ ఎన్నికలకు ముందు వీరిద్దరి భేటీ కీలకంగా మారింది. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్‌ల భేటీ తర్వాత రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా, ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.
పంజాబ్ సీఎం భార్య కూడా...
సీఎం కేజ్రీవాల్ సతీమణి సునీతను కలిసేందుకు కల్పన ఆయన ఇంటికి చేరుకున్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. అదే క్రమంలో పంజాబ్ ప్రభుత్వ మంత్రి కుల్దీప్ ధాలివాల్ కూడా సునీతా కేజ్రీవాల్‌ను కలిసేందుకు వచ్చారు.
ఇద్దర్నీ అరెస్ట్ చేసింది ఈడీనే...
సీఎం కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటీవల ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు జనవరి 31న, భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను 8 గంటల పాటు కఠినమైన విచారణ తర్వాత ఈడీ అరెస్టు చేసింది.
అన్ని రికార్డులు రేపు బద్దలు అవుతాయి...
ఇదిలా ఉంటే మరోపక్క ఇండియా కూటమి రేపు ఢిల్లీలో మెగా ర్యాలీ తలపెట్టింది. రాంలీలా మైదానంలో సభ జరుగుతుంది. ఈసభకు ఇండియా కూటమి రథసారధులు అందరూ హాజరవుతున్నారు. ఈ సభను ఉద్దేశించి ఢిల్లీ మంత్రి బల్బీర్ సింగ్ ’అన్ని రికార్డులు రేపు బద్దలు అవుతాయి’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.