కేజ్రీవాల్ కేసు వెనక్కి తీసుకున్నారెందుకు?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో తాను వేసిన కేసును వెనక్కి తీసుకున్నారెందుకు?

Update: 2024-03-22 08:50 GMT
Graphics

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరికొంత కాలం జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. సుప్రీం కోర్టులో తన కేసును తానే వాదించాలనుకున్న కేజ్రీవాల్ తన అత్యవసర పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. సుప్రీం కోర్టు అత్యవసర విచారణకు అంగీకరించినప్పటికీ ఆయన వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంపై ఉత్కంఠ నెలకొంది. కేసు వీగిపోతుందనా లేక మరేదైనా కారణమా

ఈడీ అరెస్టును సవాల్‌ చేస్తూ నిన్న రాత్రే ఆయన అత్యవసర విచారణ కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టారు. అయితే ఆ టైంలో కోర్టు దానిని స్వీకరించలేదు. శుక్రవారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన కాసేపటికే సీజేఐ ధర్మాసనం విచారణకు అంగీకరించింది. కేజ్రీవాల్‌ పిటిషన్‌ను అత్యవస విచారణ చేపట్టాలని కోరారు ఆయన తరఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ. దీంతో ఛీఫ్‌ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఈ పిటిషన్‌ను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా బెంచ్‌కు పంపించారు. అక్కడా అత్యవసర విచారణ జరపాలని లాయర్‌ సింఘ్వీ కోరారు. రెగ్యులర్ కేసుల విచారణ తర్వాత స్పెషల్ బెంచ్ ఈ కేసును విచారిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. అయితే.. రౌస్ ఎవెన్యూ కోర్టులో రిమాండ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో ఈ అత్యవసర పిటీషన్ ఉపసంహరించుకున్నారాయన.

లాయర్ కాని కేజ్రీవాల్ ఎలా వాదిస్తారు?
ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చదివిన కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించవచ్చా? లా చదవని ఆయన కోర్టులో వాదనలు ఎలా వినిపిస్తారనే అనుమానాలున్నా న్యాయశాస్త్రంలో ఓ ప్రొవిజన్ ఉంది. పార్టీ ఇన్ పర్సన్‌(Party In Person)గా కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అంటే బాధితుడైన సంబంధిత వ్యక్తి (అంటే పార్టీ) తన వాదనను తాను వినిపించే అవకాశం ఉంది. పార్టీ ఇన్ పర్సన్‌గా.. ఒక కేసులో సొంతంగా వాదించుకునేందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. పార్టీ ఇన్ పర్సన్‌గా ఉండాలనుకున్నప్పుడు కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్టాంప్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు.. ఇలా కొన్ని విషయాలపై అవగాహన ఉండాలి. ఒక అప్లికేషన్‌ సమర్పిస్తే.. మీకు ఆ అర్హత ఉందని భావిస్తే దానికి కోర్టు అనుమతిస్తుంది.

అయితే అవగాహన లేకున్నా సాధారణంగా అడ్వకేట్ల మీద నమ్మకం లేకనో, లేకుంటే అడ్వకేట్ల ఫీజు చెల్లించలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి దరఖాస్తులు సమర్పించి కోర్టు అనుమతులతో వాదిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో.. చట్టాల గురించి తెలిసి ఉండి.. తమ కేసును తామే వాదించుకోగలమన్న నమ్మకం ఉన్నప్పుడు పార్టీ ఇన్‌ పర్సన్‌గా దరఖాస్తు చేసుకోవచ్చు. కేజ్రీవాల్‌ ఇప్పుడు అలానే దరఖాస్తు చేసుకుని.. ఆ అనుమతితో వాదించాలనుకున్నారు. కానీ, చివరకు పిటిషణ్‌ ఉపసంహరణతో అది జరగలేదు. మరెప్పుడైనా ఆయన తన వాదనలు వినిపిస్తారేమో చూడాలి. ఇప్పుడు కేసు వెనక్కి తీసుకున్నందున.. ఇలాంటి కేసుల్లో తక్షణమే బెయిల్ వచ్చే అవకాశం లేనందునే వెనక్కితగ్గారని న్యాయవాదులు అంటున్నారు.


Tags:    

Similar News