మకర సంక్రాంతి: అనేక పేర్లతో దేశవ్యాప్తంగా..

సంప్రదాయాలు, పండగలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో కొన్ని పండగలను దేశ వాసులంతా ఒకే సమయంలో జరుపుకుంటారు. అలాంటి పండగలలో సంక్రాంతి ఒకటి.

Update: 2024-01-15 08:32 GMT

ఉత్తరం వైపు నుంచి వీచే చల్లటి గాలులు, ఉదయాన్నే కనిపించే పొగమంచు, ఆకాశంలో పక్షులతో పోటీపడుతున్న పతంగులు.. మన ఊరిలోనే కాదు, దేశమంతా ఇప్పుడు ఇదే కనిపిస్తుంది. పంట చేతికొచ్చి, మళ్లీ పంట సీజన్ ప్రారంభం అయ్యే కాలం ఇదే కావడంతో పల్లెలన్నీ కోలాహాలంగా ఉంటాయి. ఈ సంతోషం రెట్టింపు చేయడానికి పట్టణాలన్నీ పల్లె వైపు పరుగుపెడతాయి.

సంక్రాంతి లేదా మకర సంక్రాంతిగా లేదా మాఘీ పర్వదినంగా పిలుచుకుంటున్న పండగను ప్రతిఏటా జనవరి 14 లేదా 15న జరుపుకుంటారు. ఈ రోజుతో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే ప్రజలు నదీ స్నానాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. నేటితో చలికాలం పూర్తవుతున్నట్లు లెక్క. ఈ పండగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. సూర్యుడి ఆరాధనతో ఈ పండగలు అన్నీ ముడిపడి ఉండటం మనం గమనించాల్సిన విషయం.అవేమిటో చూద్దాం

మకర సంక్రమణ- కర్నాటక

‘పంటల పండగ లేదా సుగ్గి హబ్బా’ పండగగా కన్నడ నాడు మూడు రోజుల పాటు ప్రజలు జరుపుకుంటారు. ఈ సీజన్ లో ఇక్కడ చెరుకు విరివిగా పండుతుంది. కాబట్టి సహజంగానే దానితో తయారైన ఆహరపదార్దాలు ప్రజలు తయారు చేస్తారు. చెరుకుతో పాటు చిలకడదుంప( కందగడ్డ) వరి, మినుములను ‘ఎల్లు బీరోడ్, ఫల ఎరేయువుడు, కిచ్చు హాయిసువుడు’ వంటి ఆచారాలలో ఉపయోగిస్తారు.

కొత్త బియ్యాన్ని మూంగ్ పప్పుతో కలిపి ‘హుగ్గి అన్నం’అని పిలవబడే తీపి పదార్ధంగా తయారు చేస్తారు. ఇదీ ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటుంది. తమిళనాడులో చేసే పొంగల్ కు, హుగ్గి అన్నం కు దగ్గరి పోలికలు కనిపిస్తాయి. సూర్యభగవానుడికి చెరుకుతో చేసిన ‘సక్కరే అచ్చు’ అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కాలానుగుణంగా పండే కూరగాయలను కూడా సూర్యుడికి నివేదిస్తారు. పండగకు కొన్ని రోజుల ముందే మహిళలు చెరుకు నుంచి రసాన్ని తీపి పదార్థంగా తయారు చేసే పనిని ప్రారంభిస్తారు.

సంక్రాంతి సందర్భంగా చాలామంది ప్రజలు ‘ సంక్రాంతి ఫల ఎరేయువుడు’ ఆచరిస్తారు. (తెలంగాణలో రేగుపండ్లతో పిల్లలకు చేసే ‘ఒడిగొడకలు’లాంటిది.) 12 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కూర్చొబెట్టి నాణేలు, చెరకు ముక్కలు, బెరడు పండ్లు, ‘ఎల్లు-బెల్లా’(నువ్వులు, శెనగలు, జీలకర్ర ఇతర పదార్థాలు కలిపిన మిశ్రమం పేరు) చక్కెర తో తయారు చేసిన స్వీట్ పిల్లల తలపై నుంచి పోస్తారు.

ఇలా చేస్తే లక్ష్మీ దేవీ అనుగ్రహిస్తుందని విశ్వాసం. అనంతరం పిల్లలకు హరతీ ఇచ్చి, ఎల్లుబెల్ల, చెరకు ముక్కలు, స్వీట్లు, హగ్గి అన్నం తినిపిస్తారు. వారిపై కురిపించిన మిశ్రమం, వస్తువులను పేదలకు పంచిపెడతారు.

మాఘీసాజీ- హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లో మకర సంక్రాంతిని ‘మాఘీసాజీ లేదా మాఘ సాజా’గా జరుపుకుంటారు. ప్రజలు పొద్దున లేచి స్నానాలు ఆచరించి ఫజా ఆకులను కాల్చి, పూజ చేస్తారు.

చాలామంది ప్రజలు మండిలోని ‘తట్టపానీ’ వేడినీటి బుగ్గలో స్నానం ఆచరించడానికి ఉత్సాహం చూపుతారు. ఆలయాలను సందర్శించి అర్చకులకు నిలువెత్తు తృణధాన్యాలను సమర్పిస్తారు. వీటిని ‘తులదాన్’ గా వ్యవహరిస్తారు. ‘కిచ్చడి, చిక్కి’ వంటి ఆహరపదార్థాలను కుటుంబ సభ్యులతో కలిసి తింటారు. పేదలకు దానధర్మాలు చేస్తారు. గాలిపటాలను ఎగరవేయడం, స్నేహితుల ఇళ్లకు వెళ్లడం, జానపద నృత్యాలు చేస్తూ పండగను జరుపుకుంటారు.

ఘుఘుతీయ పండగ- ఉత్తరాఖండ్

దేవభూమి ఉత్తరాఖండ్ లో ముఖ్యంగా కొండల్లోని కుమావోన్ ప్రాంతంలో వలస పక్షులను ఆహ్వనించడం ద్వారాపండగను జరుపుకుంటారు.

తల్లులు వివిధ ఆకారాలలో పిండి, బెల్లం ఉపయోగించి ‘ఘుఘుటే’ అనే తీపి పదార్థాన్ని తయారు చేస్తారు. అందులో కొంతభాగాన్ని తీసి మాలగా పిల్లల మెడలో వేసి బయటకు పంపుతారు. పిల్లలు బయటకు వెళ్లి ‘కాలే కౌవా కాలే, ఘుఘుటీ మాలా ఖలే’(ఓ నల్ల కాకి, ఘుఘుటేతో చేసిన దండను తినండి) అని పిలుస్తారు. ఇది ఎంతో చూడముచ్చటైన దృశ్యం. పిల్లలకు ముందుగా ఆహారం పెట్టే బిడ్డ అదృష్టవంతుడని తల్లులు విశ్వసిస్తారు.

లోహ్రీ- పంజాబ్

పంజాబ్, హర్యానా, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్ లో మకరసంక్రాంతికి ప్రాంతీయ పేరు అయిన మాఘికి ఒకరోజు ముందు ‘లోహ్రీ’ని జరుపుకుంటారు. పంజాబ్ లో ఈ రోజు అధికారిక సెలవుదినం. ఈ రోజు పిల్లలు ఇంటికి వెళ్లి పాటలు పాడుతూ స్వీట్లు, రుచికరమైన వంటకాలను అతిథులకు అందిస్తారు. సాయంత్రం పంచదార, బెల్లం, వేరుసెనగ, పాప్ కార్న్, నువ్వుల వంటి చెడిపోయిన వస్తువుల పట్టుకుని ఇంటికి వస్తారు.

సాయంత్రం భోగి మంటలు వెలిగించి వాటిని అందులో వేసి నృత్యం చేసి పండగను జరుపుకుంటారు. కొత్తబట్టలు ధరించి భాంగ్రా, గిద్దా దరువులకు పంజాబీ సాంప్రదాయ నృత్యం చేస్తారు. ఇక్కడ ఆహరాన్ని కాల్చడం పాత సంవత్సరాన్ని కాల్చడం, కొత్త బట్టలు ధరించడం కొత్తగా సంవత్సరం ప్రారంభం కావడాన్ని సూచికగా చూస్తారు. అలాగే ఈ రోజు రైతుల ఇళ్లలో ‘మక్కే డి రోటీ’( మొక్కజోన్న పిండితో చేసిన రోటీ), ‘సర్సన్ డా సాగ్’(మస్టర్ గ్రీన్) అనే విందును ఇస్తారు. ఇవి రెండు కూడా శీతకాలపు పంటలు.

ఒడిశాలో..

ఒడియాలు స్థానిక దేవతలకు ‘మకర చౌలా’ (అన్నం, అరటి పండు, పాలు, పెరుగు, బెల్లం, కాటేజ్ చీజ్ లాంటి వాటితో పాయసం) ను సమర్పిస్తారు. చెరువులు, నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. పూరీ లోని జగన్నాథ ఆలయంలో ప్రత్యేక ఆచారాలతో పండగ నిర్వహిస్తారు. కటక్ లోని ధబలేశ్వర్, అత్రి(ఖోర్డా), హతకేశ్వర్, బాలాసోర్ లోని మకర ముని ఆలయాల్లో మకర మేళా( జాతరలు) నిర్వహిస్తుంటారు. ఈసందర్భంగా వివిధ రకాల ‘పిఠాలు’( తీపి బియ్యం కేకులు), ‘మువాన్’( రుబ్బిన వరిలో చేసిన తీపి పదార్థం), ఇతర సాంప్రదాయ స్వీట్లు చేసుకుంటారు.

రాజస్తాన్ లో..

సంక్రాంతి రాజస్తాన్ లో పెద్ద పండగ. ఈ సందర్భంగా ప్రజలు ‘సంక్రాంతి భోజ్’ను నిర్వహించి బంధువులను విందుకు ఆహ్వనిస్తారు. రాజస్తాన్ కే ప్రత్యేకమైన వంటకాలైన గజక్, ఘేవర్, ఫీనీ, టిల్-లడ్డు, పువా వంటి స్వీట్ లను ఇంటిలోనే తయారు చేసి అతిథులకు అందిస్తారు. పండగ సందర్భంగా పతంగుల పోటీలు నిర్వహిస్తారు. అలాగే రాజస్థానీ మహిళలు తమ ఇంటి నుంచి 13 మంది వివాహిత మహిళలకు వస్తువులను అందించే సంప్రదాయాన్ని పాటిస్తారు. జైపూర్ లో ప్రతి సంవత్సరం జనవరి 14 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ గాలి పటాల పండుగను నిర్వహిస్తుంది. దీనిలోఅనేకమంది ఔత్సాహికులు పాల్గొంటారు.

పొంగల్- తమిళనాడు

దక్షిణాదిన ఉన్న తమిళనాడు మూడు రోజుల పాటు జరుపుకునే పెద్ద పండగ పొంగల్. ఇదే పేరును ఈ రోజు వండే వంటకానికి పెట్టారు. ఇందులో బియ్యానికి, పాలు, బెల్లం కలుపుతారు. ఇంటికి తోరణాలు కట్టి అందంగా అలకరిస్తారు. దీనికోసం అరటి, మామిడి ఆకులను ఉపయోగిస్తారు.

పండగ మొదటి రోజును భోగి పొంగల్ గా పిలుస్తారు. ఈ రోజు పాతవస్తువులు సేకరించి భోగి మంటల్లో కాల్చివేస్తారు. ఇదీ పాత జీవితాన్ని ముగించి, కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది.

రెండో రోజు ను సూర్య పొంగల్ గా పిలుస్తారు. ఈ రోజు సూర్యభగవానుడికి అంకితం. కొత్త బియ్యంతో పాలు, బెల్లం మట్టికుండలో వండుతారు. గంజి పొంగిపొర్లుతున్నంత వరకు పొయ్యి పైనే ఉంచుతారు. తరువాత శంఖం పూరించి కొత్త సంవత్సరంలో మరింత అదృష్టం సాధించాలని ప్రార్థిస్తారు. పొంగల్ కుండకు పువ్వులు, పసుపు మొక్కలతో అలంకరించి, తరువాత సూర్యుడికి పొంగల్ నివేదిస్తారు.

మూడో రోజు మట్టు పొంగల్ గా పిలుస్తారు. ఈ రోజు పశువులను పుణ్యస్నానాలు చేయించి వాటి కొమ్ములను పూలమాలలతో అలంకరిస్తారు. ఈ రోజు వండిన పొంగల్ ను దేవతలకు నైవేద్యంగా పెట్టి తరువాత కుటుంబ సభ్యులు తింటారు. అనంతరం పశువులకు తినిపిస్తారు.

బిహు- అస్సాం

అస్సామీలు దీనిని మాగ్ బిహూ అని కూడా అంటారు. ఇది పంటకాలం ముగింపును సూచించే పండగగా జరుపుకుంటారు. ఈ రోజు ముందుగా విందులు తరువాత భోగిమంటలు వేసి ఆనందంగా పండగ జరుపుకుంటారు. కొంతమంది ప్రజలు దీనిని ‘ఉరుక’ పండగ కూడా వ్యవహరిస్తారు.

రాత్రిపూట్ భుజ్ లేదా విందు నిర్వహిస్తారు. రుచికరమైన స్వీట్లు తయారుచేస్తారు. ఇంట్లో తయారు చేసిన మత్తుపానీయాలను సేవిస్తారు. సాయంత్రం భోగి మంటలు వేసే చోట వెదురు, ఆకులను ఉపయోగించి భేలఘర్ అనే గుడిసెలను తయారు చేస్తారు.

పండగ రోజు ఉదయాన్నే లేచి పొలాల్లో భోగి మంటలు వేసి, మేజీ అనే పంట కోత జరిపే కార్యక్రమాల్లో పాల్గొనడానికి స్నానం చేస్తారు. తరువాత భోగి మంట చుట్టూ తిరుగుతూ పితృదేవతలను ప్రార్థిస్తారు. ఈసమయంలో దేవతలకు చికెన్, రైస్ కేక్స్, రైస్ బీర్, పితా, చీరా, అఖోయ్, పెరుగు వంటి వాటిని నైవేద్యం పెడతారు. తరువాత ఒక భాగం భేలఘర్ గుడిసెను కాల్చివేస్తారు. తరువాత బియ్యం నల్ల శనగల మిశ్రమం అయిన మాహ్ కరైను సేవిస్తారు. 

Tags:    

Similar News