ధర్మస్థలపై ఆరోపణలు నిరాధారం: ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే
"ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది. మా వద్ద ఆధారాలు లేకపోవడంతో పేర్లు బయటపెట్టలేకపోతున్నాం. సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి" -హెగ్గడే;
కర్ణాటక(Karnataka) రాష్ట్రంలోని ధర్మస్థల(Dharmastala) మంజునాథ స్వామి ఆలయం పేరు గత కొన్ని రోజులుగా వార్తలోకెక్కిన విషయం తెలిసిందే. ఆలయ మాజీ పారిశుధ్య కార్మికుడొకరు ఆలయ పరిసరాల్లో చాలామంది మహిళలు, బాలికల మృతదేహాలను ఖననం చేశానని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కర్ణాటక ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక బృందాని(SIT)కి అప్పగించింది. పారిశుధ్య కార్మికుడు చెప్పిన 13 ప్రదేశాల్లో తవ్వకాలు జరపగా.. రెండు చోట్ల మాత్రమే అస్థిపంజరాలు బయటపడ్డాయి.
‘దర్యాప్తును స్వాగతిస్తున్నాం..’
ఈ నేపథ్యంలో ఆలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే(Veerendra Heggade) స్పందించారు. వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు చెప్పారు. అదృశ్యమైన సౌజన్య, ఆలయ పరిసరాల్లో సామూహిక ఖననాల ఆరోపణలను ఖండించారు. అవన్నీ అబద్ధమని పేర్కొంటూనే.. వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు.
ధర్మస్థల మంజునాథేశ్వర కళాశాలలో ప్రీ-యూనివర్శిటీ సెకండీయర్ చదువుతున్న సౌజన్య (17)ను అక్టోబర్ 9, 2012న అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలికకు న్యాయం చేయాలని కోరుతూ ఇప్పుడు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
‘మేమంటే గిట్టనివారు చేస్తున్న పని’
"దర్యాప్తు త్వరగా ముగిసి సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. మేం చేస్తోన్న మంచి పనులు నచ్చని కొన్ని శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆలయ పరిసరాల్లో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. అవన్నీ నిరాధార ఆరోపణలు. ధర్మస్థలలో ఎవరైనా మరణిస్తే మోక్షం ప్రాప్తిస్తుందన్న నమ్మకం ఉంది. ఎవరైనా చనిపోతే పంచాయతీ సిబ్బందికి చెబుతాం. వారు మృతదేహాన్ని తగిన జాగ్రత్తలతో ఖననం చేస్తారు, " అని హెగ్గడే చెప్పారు.
‘SITకు పూర్తిగా సహకరిస్తాం’
సౌజన్య హత్య కేసులో న్యాయం కావాలని వస్తున్న డిమాండ్‌పై మాట్లాడుతూ.. "గతంలో మాపై వచ్చిన ఆరోపణలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. మా కుటుంబంపై ఆరోపణలు నిరాధారమైనవి. మా కుటుంబ సభ్యులు చదువుకోడానికి విదేశాలకు వెళ్లారు. అందుకు సంబంధించిన కాగితాలు కూడా సమర్పించాం. గతంలో సీబీఐ కూడా దర్యాప్తు చేసింది. అప్పుడు కూడా దర్యాప్తు బృందానికి సహకరించాం. ఇప్పుడు కూడా SITకు సహకరిస్తాం" అని హెగ్గడే వివరించారు.
ఆస్తుల దుర్వినియోగంపై వస్తు్న్న ఆరోపణలను హెగ్గడే తోసిపుచ్చారు. ‘‘మా ఆస్తి ఏమీ లేదు. మా కుటుంబానికి ఆస్తిసాస్తులు చాలా తక్కువ. అన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉన్నాయి. ఆస్తుల సముపార్జనకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి.
"మేం నలుగురు అన్నదమ్ములం. ఒకతను బెంగళూరులో విద్యాలయాల బాధ్యత చూసుకుంటాడు. మరొకరు దేవాలయ బాధ్యతలు చూస్తుంటాడు. నా సోదరి భర్త ధార్వాడ్‌లోని SDM విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్. అన్ని విద్యా సంస్థలు ట్రస్ట్ పేరుతో ఉన్నాయి" అని చెప్పారు హెగ్గడే.
వివాదం రాజకీయ మలుపు తీసుకుందన్న విమర్శలను హెగ్గడే తోసిపుచ్చారు. "కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చారు. జేడీఎస్ నేతలు కూడా వచ్చారు. అన్ని పార్టీలు ఆలయానికి మద్దతుగా ఉన్నాయి. అయితే కొంతమంది దేవాలయ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు, " అని హెగ్గడే పేర్కొన్నారు.
ధర్మస్థలాన్ని కించపరిచే కుట్ర జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రకటనను స్వాగతిస్తున్నానని చెప్పారు హెగ్గడే. ఏదైనా తప్పు జరిగితే దర్యాప్తు చేసి దోషిని పట్టుకుంటారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసిన ప్రకటనపై కూడా హెగ్గడే స్పందించారు. సీఎం చెప్పింది మంచి విషయమేనన్నారు.
ధర్మస్థలంపై విశ్వాసం సన్నగిల్లుతోందన్న వస్తున్న వార్తలపై మాట్లాడుతూ.. "ఆలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయి. ఆచారాలల్లో ఎటువంటి మార్పు లేదు" అని చెప్పారు.
"ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుంది. అలా చేస్తు్న్నదెవరో కూడా మాకు తెలుసు. అయితే మా వద్ద ఆధారాలు లేవు. కాబట్టి మేం ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. సిట్ దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయి" అని చెప్పి ఇంటర్వ్యూ ముగించారు హెగ్గడే.