‘మమత తక్షణం రాజీనామా చేయాలి’
హర్యానాకు చెందిన ఓపీ చౌతాలా తర్వాత ఉపాధ్యాయ నియామకాల్లో జైలుకు వెళ్లే రెండో సీఎం మమతానే - పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ సుకాంత మజుందార్;
పశ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ (Sukanta Majumdar) డిమాండ్ చేశారు. ‘‘స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కాం’’ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు(Calcutta High Court) తీర్పును సమర్థిస్తూ తీర్పు చెప్పిన నేపథ్యంలో ఆయన స్పందించారు. దాదాపు 26 వేల మంది నియామకాల్లో 20 వేల మంది నిజమైన అర్హులని, మిగతా వారు టీఎంసీ నాయకుల అండదండలతో ఉద్యోగాలు పొందిన వారని పేర్కొన్నారు. హర్యానాకు చెందిన ఓపీ చౌతాలా తర్వాత ఉపాధ్యాయ నియామకాల విషయంలో జైలుకు వెళ్లే రెండో ముఖ్యమంత్రి మమత అని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2016లో పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC) ద్వారా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ నియామకాలను చేపట్టింది. నియామకాల్లో అవినీతి చోటుచేసుకుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ‘స్కూల్ జాబ్స్ ఫర్ క్యాష్ స్కాం’ కుంభకోణంపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు 2024 ఏప్రిల్‌లో తీర్పు వెల్లడించింది. నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత ఉద్యోగం పొందిన వారు.. అలానే బ్లాంక్ ఓఎమ్మార్ షీట్స్ సబ్మిట్ చేసి.. ఉద్యోగాలు పొందిన వారి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. మోసపూరితంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు ఇన్నాళ్ల పాటు పొందిన వేతనాన్ని 12 శాతం వడ్డీరేటుతో కలిపి తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. మమతా సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. నియామక ప్రక్రియ, ఉద్యోగాల కేటాయింపులో మోసపూరిత విధానాలు అవలంబించారని అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. 25 వేల మంది నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది.