మూడో దశలో ఓటు వేసిన ప్రధాని సహ పలువురు ప్రముఖులు..
దేశంలో మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో ఎన్నికల సంఘం 93 స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ దశలో ప్రధాని మోదీ, అమిత్ షా, శరద్ పవార్, యడియూరప్ప లాంటి..
By : The Federal
Update: 2024-05-07 05:22 GMT
దేశంలో సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ దఫా ఎన్నికల సంఘం దేశంలోని 93 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అహ్మదాబాద్ నగరంలోని రాణిప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని మోదీ పోలింగ్ బూత్‌కు చేరుకుని ఓటు వేశారు. మోదీ పోలింగ్ బూత్‌కు చేరుకున్నప్పుడు గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న హోంమంత్రి అమిత్ షా అక్కడే ఉన్నారు. తరువాత ఆయన నగరంలోని మరో పోలింగ్ బూత్ లో తన భార్య సోనాల్ షా, కుమారుడు జై షా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మూడవ దశ
మూడో దశ పోటీలో 120 మంది మహిళలు సహా 1,300 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో కేంద్ర మంత్రులు అమిత్ షా (గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా (గుణ), మన్సుఖ్ మాండవియా (పోర్ బందర్), పర్షోత్తమ్ రూపాలా (రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘెల్ (ఆగ్రా) ఉన్నారు.
ఈ దశలో 8.39 కోట్ల మంది మహిళలు సహా 17.24 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 18.5 లక్షల మంది అధికారులు విధుల్లో ఉన్నారు. 1.85 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
రాష్ట్రాలవారీగా చూసుకుంటే మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, కర్ణాటకలో 14, ఛత్తీస్‌గఢ్‌లో 7, బీహార్‌లో 5, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, గోవాలో రెండు స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ (2 సీట్లు), మధ్యప్రదేశ్‌లోని 9 స్థానాలు, మధ్యప్రదేశ్ లో ఎన్నికలు వాయిదా పడిన బేతుల్‌లో కూడా పోలింగ్ జరుగుతోంది.
పలువురు ప్రముఖులు
కర్ణాటకలో ఓటు వేయడానికి ముందుగా వచ్చిన వారిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, భగవంత్ ఖుబా, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఉన్నారు. శివమొగ్గ జిల్లా షికారిపురలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పతో పాటు కుమారులు బీవై రాఘవేంద్ర, శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బీవై విజయేంద్ర, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, కోడలు ఓటు వేశారు. మహారాష్ట్రలో, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌సిపి అభ్యర్థిగా ఉన్న ఆయన భార్య సునేత్రా పవార్, ఎన్‌సిపి (ఎస్‌పి) చీఫ్ శరద్ పవార్ ఓటు వేసిన వారిలో ఉన్నారు.
పూణె జిల్లాలోని బారామతి నియోజకవర్గంలోని మాలెగావ్ ప్రాంతంలోని పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న శరద్ పవార్‌కు సంప్రదాయ హారతులతో స్వాగతం పలికారు. తరువాత ఆయన ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్నారు. బారామతిలోని కటేవాడి ప్రాంతంలోని పోలింగ్ బూత్‌లో అజిత్ పవార్, సునేత్ర పవార్ ఓటు వేశారు.