‘అధికారంలో ఎవరు ఉన్నారో మౌలానా మర్చిపోయారు’

యూపీ సీఎం ఆదిత్యనాథ్ హెచ్చరిక..

Update: 2025-09-27 13:26 GMT
Click the Play button to listen to article

ఉత్తర్ ప్రదేశ్‌ (Utter Pradesh) రాష్ట్రం బరేలీలో కొన్ని రోజుల క్రితం "ఐ లవ్ ముహమ్మద్" పేరిట నిర్వహించిన ప్రదర్శన హింసాత్మక ఘటనలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ‘‘వికసిత్ యూపీ’’ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) ఒక హెచ్చరిక జారీ చేశారు. శాంతిభద్రతలకు అంతరాయం కలిగిస్తే సహించేది లేదన్నారు. అధికారంలో ఎవరు ఉన్నారో మర్చిపోయారని తీవ్రంగా మందలించారు. "ఐ లవ్ ముహమ్మద్" ప్రదర్శనకు పిలుపునిచ్చిన ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మతాధికారి తౌకీర్ రజా ఖాన్‌నుద్దేశించి యోగి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


'ఐ లవ్ మహమ్మద్' వివాదం ఏమిటి?

ఈనెల 4న 'ఈద్-ఇ-మిలాద్-ఉన్-నబి' ఊరేగింపు సందర్భంగా 'ఐ లవ్ మహమ్మద్' (I Love Muhammad) బోర్డులు ఉంచడంపై కాన్పూరు పోలీసులు కొరడా ఝుళిపించారు. 24 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సంప్రదాయానికి భిన్నంగా రెచ్చగొట్టేందుకు ఈ బోర్డులు ఏర్పాటు చేశారంటూ పలు హిందూ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదం ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాలకు పాకింది. ఉత్తరాఖండ్, కర్ణాటకలోనూ నిరసనలు వ్యక్తం కావడం, పోలీసు యాక్షన్ చోటుచేసుకున్నాయి.


తౌకీర్ రాజా అరెస్ట్..

ఐ ల‌వ్ మ‌హ‌మ్మద్( I Love Muhammad) క్యాంపేన్‌కు పిలుపునిచ్చిన ఇత్తెహ‌ద్ ఇ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రాజాను అరెస్టు చేశారు. శ‌నివారం ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. క్యాంపేన్‌కు మ‌ద్దతు ఇచ్చేవాళ్లు భారీ సంఖ్యలో హాజ‌రుకావాల‌ని తౌకీర్ రాజా పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ప్రార్థనల త‌ర్వాత భారీగా ఆయ‌న ఇంటి ముందు జ‌నం గుమ్మిగూడారు. ప్రదర్శనకు అనుమతి లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన పోలీసులపై కొంతమంది యువకులు రాళ్లు రువ్వారు. దాంతో పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌ది మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు.

ఘటన గురించి జిల్లా మేజిస్ట్రేట్ అవినాష్ సింగ్ మాట్లాడుతూ..‘‘BNSS లోని సెక్షన్ 163 ప్రకారం ఏదైనా ప్రదర్శనకు రాతపూర్వక అనుమతి తప్పనిసరి. అయినా కొంతమంది వ్యక్తులు వీధుల్లోకి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించారు. ఫలితంగా పోలీసులు చర్య తీసుకోవాల్సి వచ్చింది. సుమారు 24 మందిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.’’ అని చెప్పారు.

డీఐజీ అజయ్ కుమార్ సాహ్ని మాట్లాడుతూ.. ‘‘ఘర్షణలకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. వీడియో ఫుటేజీ సేకరించాం. నేరస్థులందరినీ గుర్తించాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. 

Tags:    

Similar News