కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలతో ..
2023.. ఇక గతం.. 2024 నవ్య నూతనం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్‌కు ఈ ఏడాది ఎన్నో తీపి, మరికొన్ని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.
2023.. ఇక గతం.. 2024 నవ్య నూతనం. 2023 ఏడాదికి వీడ్కోలు పలుకుతున్నాం. భారత్‌కు ఈ ఏడాది ఎన్నో తీపి, మరికొన్ని చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. రాజకీయాల్లో కీలక మలుపులు, ఘర్షణ వాతావరణంతో ఉద్రిక్తతలు, ప్రమాద దుర్ఘటనలతో విషాదాలు, వీటితోపాటు సంతోషాన్నిచ్చే సంఘటనలు, దేశప్రతిష్టను పెంచిన సందర్భాలూ ఉన్నాయి. ఎన్నో ఆసక్తికరమైన అంశాలకు ..2023 ఏడాది సాక్ష్యంగా నిలుస్తోంది.
రోడ్డెక్కిన రెజ్లర్లు...
2023 జనవరి నెలలో కుస్తీ యోధులు రోడ్డెక్కాల్సివచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా పలువురు రెజ్లర్లు ఈనెలలో దేశరాజధాని ఢిల్లీలో చేసిన ఆందోళనలు ఒక్కసారిగా అందరి దృష్టిని అటువైపు మళ్లేలా చేశాయి. ఈ నిరసనలతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ WFIపై నిరవధికంగా సస్పెన్షన్ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం WFI ప్యానెల్‌ను రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించింది. ఈ ఒక దశలో తమ పతకాలను గంగా నదిలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. మరికొందరు ఆట నుంచి వీడ్కోలు పలుకుతున్నామని ప్రకటించగా.. ఇంకొందరు అవార్డులు వెనక్కి ఇచ్చారు.
రాహుల్ భారత్ జోడో యాత్ర...
కన్యాకుమారి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర జనవరి 30న కశ్మీర్ లో ముగిసింది. శ్రీనగర్ లో కాంగ్రెస్ పార్టీ సభను నిర్వహించింది. శ్రీనగర్ లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి యాత్రను ముగించారు రాహుల్ గాంధీ. 145 రోజులు, 4వేల 80 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర సాగింది. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టారు. సామాన్యులు, నిరుద్యోగులు, రైతులు, వ్యాపారులు, మేధావులు ఇలా అన్ని వర్గాల ప్రజల్ని కలుస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ రాహుల్ భారత్ జోడోయాత్ర చేపట్టారు.
లోకేశ్ యువగళం యాత్ర...
జనవరి 27వ తేదీన కుప్పం శ్రీవరదరాజస్వామి పాదాల చెంత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 226 రోజులపాటు 3 వేల 132 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర సాగింది. నందమూరి తారకరత్న మరణం, చంద్రబాబు అరెస్ట్ మినహా మిగతా రోజుల్లో విరామం లేకుండా లోకేశ్ పాదయాత్ర చేపట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్నో మెరుపులు...
2023 ఫిబ్రవరి.. ఈ నెలలో కూడా కొన్ని కీలకమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ వార్తల్లోకెక్కి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఫిబ్రవరి 26న మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఆ తర్వాత అక్టోబర్ 4న ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ను కస్టడీలోకి తీసుకుంది. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రెండుసార్లు సమన్లు జారీచేసింది ఈడీ. 2021లో ఢిల్లీ ప్రభుత్వం.. ఆ రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించిన ఒక పాలసీని ప్రవేశపెట్టింది. అందులో అవకతవకలు ఉన్నాయని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధం ఉన్న వారిని విచారణ జరపడం, అరెస్ట్ చేయడం వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జైత్రయాత్ర...
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అధికారం తెచ్చిపెట్టిన వాటిలో ఈ ఏడాది మొదట్లో చేసిన పాదయాత్ర కీలకమైంది. టీపీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో పేరుతో పాదయాత్ర ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. ములుగు జిల్లా మేడారం సమ్మక్క- సారలమ్మ వద్ద పూజలు చేసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు రేవంత్‌రెడ్డి. ఇది తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడానికి బాగా ఉపయోగపడింది.
ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్...
ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేశారు. ఫిబ్రవరి 12న ఆయన గవర్నర్ బాధ్యతల్ని అందుకున్నారు. అంతకు ముందు ఏపీ గవర్నర్‌గా విశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు. ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌కు బదిలీ చేయడంతో.. నజీర్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు.
కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత..
తెలుగుజాతి గర్వించదగిన సినిమాలు తీసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. 93 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఆయన ఫిబ్రవరి 3న కన్నుమూశారు. 1966లో ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విశ్వనాథ్.. సిరిసిరిమువ్వ, సాగర సంగమం, శంకరాభరణం, స్వాతికిరణం, సప్తపది, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో ఆణిముత్యాలను అందించారు.
రాహుల్‌పై అనర్హత వేటు
మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటు పడటం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించింది. మార్చి 24న లోక్‌సభ సచివాలయం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. న్యాయపోరాటం అనంతరం దిగువస్థాయి కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుమారు ఐదు నెలల తర్వాత రాహుల్ పార్లమెంట్‌లో తిరిగి అడుగుపెట్టారు.
త్రిపురలో బీజేపీ సక్సెస్...
మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో త్రిపురలో వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పాటుచేయడంతోపాటు నాగాలాండ్, మేఘాలయలోనూ సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామ్యం అయ్యింది బీజేపీ. ప్రస్తుతం సొంతంగా 12 రాష్ట్రాల్లో.. కూటమి భాగస్వామిగా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారం చెలాయిస్తోంది కమలం పార్టీ.
భట్టి విక్రమార్క పాదయాత్ర...
తెలంగాణలో సీఎల్పీ నేతగా ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర ప్రారంభించారు . మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలో రాహుల్ ఈ యాత్రను ప్రారంభించారు. 108 రోజులు 1350 కిలోమీటర్ల పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ముగిసింది.
ఘాటెక్కించిన నాటు నాటు...
భారతీయ సినీ చరిత్రలో మార్చి 13 ఒక మరపురాని ఘట్టం.. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సాకారం చేసింది. ట్రిపుల్ ఆర్ మూవీలో నాటు నాటు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా అవార్డును సొంతం చేసుకుంది. లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఇందుకు వేదికైంది. దీంతో భారత సినీ పరిశ్రమ సగర్వంగా ప్రపంచం ముందు నిలబడింది.