‘నితీష్ నాయకత్వంలో అధికారంలోకి ఎన్డీఏ’
బీహార్‌లో తొలి ఎన్నికలు ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ..
ముఖ్యమంత్రి నితీష్ కుమార్(Nitish Kumar) నాయకత్వంలో గత ఎన్నికల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి ఎన్డీఏ(NDA) అధికారంలోకి వస్తుందని ప్రధాని మోదీ(PM Modi) ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం (అక్టోబర్ 24) ఆయన బీహార్(Bihar)లో పర్యటించారు. సమస్తీపుర్ జిల్లాలోని కర్పూరీ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. మొదట బీహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరీ ఠాకూర్ (Karpoori Thakur)కు నివాళులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులను కలిశారు. అనంతరం ప్రసంగిస్తూ.. మీ మొబైల్ ఫోన్ టార్చిలైట్లను ఆన్ చేయమని కోరుతూ.. ‘‘మీ వద్ద ఇలాంటి ఆధునిక గాడ్జెట్‌లు అందుబాటులో ఉన్నప్పుడు.. ఇక లాంతరుతో అవసరం ఏమిటి?" అంటూ ప్రజలతో మాట కలిపారు.
‘ఎంతో చేశాం. ఇంకా చేస్తాం.’
"గడిచిన 11 ఏళ్లలో బీహార్‌కు ఎంతో సాయం చేశాం. గత ప్రభుత్వం నుంచి రాష్ట్రం పొందిన దానికంటే మూడు రెట్లు ఎక్కువ ఇచ్చాం. రాష్ట్రంలో పురోభివృద్ధి కనిపిస్తుంది. సొంత అవసరాల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడడం లేదు. బీహార్‌లో ప్రసిద్ధి చెందిన మఖానా ఉత్పత్తికి డిమాండ్ కూడా పెరిగింది, " అని ప్రసంగించారు.
‘పెట్టుబడులకు కేంద్రమైంది’
ఎన్డీఏ ప్రభుత్వ చర్యల వల్లే బీహార్ పెట్టుబడులకు కేంద్రంగా మారిందన్నారు.
బీహార్‌లో 'అడవి రాజ్యం' ఉండి ఉంటే ఇదంతా సాధ్యం అయ్యేది కాదన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందని ఒక మాజీ ప్రధాని (మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ) చెప్పిన విషయం మీకు గుర్తు లేదా? ఆ డబ్బును రక్తంతో తడిసిన చేయి (ఖూనీ పంజా) తినేసింది?" అని మోదీ ఘాటుగా విమర్శించారు.
ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే బీహార్ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడిన ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు బెయిల్‌పై బయట తిరుగుతున్నారని, ఇప్పుడు వారు భారతరత్న కర్పూరి ఠాకూర్ అనే 'జన్నాయక్' బిరుదును దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు.
ఉద్యోగాల కుంభకోణంలో తండ్రి లాలూ ప్రసాద్‌తో పాటు, ఆర్జేడీ(RJD) అధ్యక్షుడు కూడా పేరున్న ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్(Tejashwi Yadav)నుద్దేశించి మోదీ తీవ్రంగా విమర్శించారు. "బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తులపై బీహార్ ప్రజలు నమ్మకం ఉంచలేరు (జమానాత్ పర్ చుతే హు లాగ్)" అని పేర్కొన్నారు.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరుగుతుంది.