‘నా కొడుకు అస్థికలూ తీసుకెళ్లారు..’

నా గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న రష్యన్ మహిళ..;

Update: 2025-07-16 14:15 GMT
Click the Play button to listen to article

కర్ణాటక (Karnataka) రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ సమీపంలోని ఓ గుహలో రష్యన్ (Russia) మహిళతో పాటు ఇద్దరు కూతుర్లను పోలీసులు రక్షించిన విషయం తెలిసిందే. కుటినా (40), ఆమె ఇద్దరు పిల్లలు ప్రేయ (6), అమా (4) గుహలో దాదాపు రెండు వారాల పాటు ఒంటరిగా ఉన్నారు. గుహలో గడిపిన అనుభవాన్ని ఆమె ఇటీవల పీటీఐతో పంచుకున్నారు. పెయింటింగ్‌తోపాటు పాటలు పాడుతూ, పుస్తకాలు చదువుతూ ఇద్దరు పిల్లలతో చాలా ప్రశాంతంగా గడిపినట్లు వెల్లడించింది. తనకు నలుగురు సంతానం కాగా పదిహేనేళ్లపాటు అనేక దేశాలు పర్యటించినట్లు వివరించింది.

‘ప్రకృతిలో సురక్షితం..’

‘‘గత పదిహేనేళ్లుగా 20 దేశాలు తిరిగా. నా నలుగురు పిల్లల్లో ఒక్కొకరు ఒక్కోచోట జన్మించారు. ఆసుపత్రులు, వైద్యులు.. ఎవరి సాయం లేకుండానే డెలివరీ అయ్యింది. ప్రసవానికి సంబంధించిన విషయాలన్నీ నాకు తెలుసు. నాకెవ్వరూ సాయం చేయలేదు. సూర్యోదయంతోనే నిద్రలేచి, పక్కనున్న నదిలో స్నానాలు చేస్తూ.. ప్రకృతిలో గడిపాం. పక్కనున్న గ్రామాల నుంచి సరుకులు తెచ్చుకొని.. సీజన్‌ను బట్టి పొయ్యి లేదా గ్యాస్‌ సిలిండర్‌పై వంట చేసేదాన్ని. చిత్రలేఖనం, పాటలు పాడటం, పుస్తకాలు చదువుతూ ప్రశాంతంగా జీవించాం.’’ అని పేర్కొంది.

‘టీవీలో చూపించేవన్నీ అబద్ధాలే..’

‘ప్రస్తుతం మమ్మల్ని అసౌకర్య ప్రదేశంలో ఉంచారు. మా వస్తువుల్లో చాలావాటిని తీసుకున్నారు. తొమ్మిది నెలల క్రితం చనిపోయిన నా కుమారుడి అస్థికలు కూడా. నా గురించి జరుగుతున్న ప్రచారమంతా తప్పు. నేను ట్రెయిన్డ్ టీచర్‌ని. నా చిన్నారులకు చదువు చెబుతా. వాళ్లు ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్లను చూస్తున్నవాళ్లు కూడా ఇదే విషయం చెబుతున్నారు,’’ అని కుటినా వెల్లడించారు.

రష్యాకు ఎందుకు వెళ్లడం లేదన్న ప్రశ్నకు..‘‘ అందుకు చాలా కారణాలు ఉన్నాయి. నా కుమారుడు సహా కొందరు సన్నిహితులను కోల్పోయా. వీటితోపాటు అనేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. నాలుగు దేశాలు తిరిగి భారత్‌కు వచ్చా. ఈ ప్రదేశం, ఇక్కడి ప్రజలు, వాతావరణం అంటే చాలా ఇష్టం’’ అని కుటినా చెప్పింది. ప్రస్తుతం తాను రష్యన్‌ రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉన్నానని చెప్పారు. వాస్తవానికి కుటినా వీసా 2017తో ముగిసింది. ప్రస్తుతం ఆమెను బెంగళూరులోని ఒక నిర్బంధ కేంద్రంలో ఉంచారు.

విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) అధికారి ఒకరు వార్తా సంస్థకు మాట్లాడుతూ.. పిల్లల తండ్రి ఇజ్రాయెల్ జాతీయుడని, ప్రస్తుతం ఆయన బిజినెస్ వీసాపై ఇండియాలోనే ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. కాగా పిల్లల తండ్రి ఎవరన్న విషయాన్ని బయట పెట్టడానికి మొదట్లో వెనకాడిన కుటినా.. కౌన్సెలర్ల సాయంతో ఆమె భర్త వివరాలు చెప్పినట్లు సమాచారం. 

Tags:    

Similar News