రాజకీయ కక్ష సాధింపులో భాగమే నేషనల్ హెరాల్డ్ కేసు
సోనియా, రాహుల్‌పై ఈడీ చార్జిషీట్‌ను లై-షీట్ గా అభివర్ణించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే..;
నేషనల్ హెరాల్డ్ (National Herald)కేసులో తమ నాయకులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను "లై-షీట్"గా అభివర్ణించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge). రాజకీయ కక్షతోనే సోనియా, రాహుల్ గాంధీపైకి ఈడీని ఉసిగొల్పారని ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరితో పాటు ఇతరులు రూ. 988 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ ప్రత్యేక కోర్టు ముందు చార్జిషీట్ ఫైల్ చేసింది.
ఈ నేపథ్యంలో తదుపరి వ్యూహాన్ని రచించేందుకు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు ఇన్‌చార్జ్‌లు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘‘రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో మా అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఈడీ చార్జిషీటు దాఖలు చేసింది. ఢిల్లీ, లఖ్‌నవూ, ముంబాయిలలోని నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేసింది. ఇలాంటి చర్యలకు భయపడేది లేదు. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో బీజేపీ నేతలు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది’’ అని పేర్కొన్నారు. బిజెపి "తప్పుడు ప్రచారాన్ని’’ తిప్పికొట్టేందుకు ఏప్రిల్ 21 నుంచి 24 వరకు దేశవ్యాప్తంగా విలేఖరుల సమావేశాలు నిర్వహిస్తామని పార్టీ తెలిపింది.
25 నుంచి ఆందోళనలు
ఈ నెల 25 నుంచి 30 వరకు రాష్ట్ర స్థాయిలో, మే 3 నుంచి 10 వరకు జిల్లా స్థాయిలో ‘సంవిధాన్ బచావో’ (రాజ్యాంగాన్ని రక్షించండి) పేరుతో ర్యాలీలు నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. మే 20 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి పార్టీ సందేశాన్ని చేరవేస్తారు. డీసీసీల స్థాయిలోనూ రాజకీయ వ్యవహారాల కమిటీలను ఏర్పాటుచేస్తారు.
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన AICC సమావేశంలో తీసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీల (DCC) సాధికారత నిర్ణయం మేరకు మే 31 నాటికి గుజరాత్‌లో జిల్లా యూనిట్ చీఫ్‌లను నియమిస్తామని, ఈ విధానాన్ని అన్ని ఇతర రాష్ట్రాలలో అమలు చేస్తామని పార్టీ తెలిపింది. ప్రతి జిల్లాలో రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు పార్టీ తెలిపింది. స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపికలో, పార్లమెంటు స్థాయిలో నిధుల సేకరణలో డీసీసీలకు మరిన్ని అధికారాలు ఇచ్చి, వికేంద్రీకరణ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ప్రజల దృష్టి మరల్చేందుకే..
ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యల నుంచి దృష్టిని మళ్లించడమే ఈడీ ఈ చర్య తీసుకుందని కాంగ్రెస్ అగ్రనేత జైరాం రమేష్ ఆరోపించారు. అన్ని ప్రతిపక్ష పార్టీలపై ముఖ్యంగా కాంగ్రెస్‌పైకి ఈడీని కేంద్రం ఉసిగొలుపుతుందని ధ్వజమెత్తారు.
‘‘ఏదో ఒక రోజు వాస్తవం బయటకు వస్తుంది. నేరపూరిత మనస్తత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు పన్నిన రాజకీయ కుట్ర అని ప్రజలు తెలుసుకుంటారు అని రమేష్ వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులు ఇప్పటికీ అసోసియేటెడ్ జర్నల్స్ అధీనంలోనే ఉన్నాయని రమేష్ అన్నారు.
పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి రమేష్ మాట్లాడుతూ .. ఇది చట్టపర పోరాటం కాదు. ఇది రాజకీయ యుద్ధం. ఇది 'సత్యం'అసత్యానికి' మధ్య జరుగుతున్న యుద్ధం. అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వ సంస్థ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను "కబ్జా" చేయడానికి "నేరపూరిత కుట్ర" చేశారని, ఇందులో 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ అనే కంపెనీకి కేవలం రూ. 50 లక్షలకు బదిలీ చేశారని ఆరోపించింది. ఈ కంపెనీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశం ముగిసిన వెంటనే ఈడీ చర్య తీసుకోవడం కేవలం యాదృచ్చికం కాదని కాంగ్రెస్ చీఫ్ అన్నారు.
‘చివరకు గెలుపు మాదే..’
వక్ఫ్ (సవరణ) చట్టంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలకు సుప్రీంకోర్టు ప్రాముఖ్యత ఇచ్చిందని ఖర్గే చెప్పారు. ‘‘సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ కేసును విచారిస్తోంది. "ఈ యుద్ధంలో కూడా మేము గెలుస్తామని నమ్మకం ఉంది" అని ఖర్గే అన్నారు, వక్ఫ్ (సవరణ) బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మొత్తం ప్రతిపక్షాన్ని ఒకచోట చేర్చిందని చెప్పారు.
వక్ఫ్ అంశంపై పుకార్లు వ్యాప్తికి, ప్రజలను గందరగోళంలో పడేయడానికి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు ఏ రాయిని వదిలిపెట్టలేదని ఖర్గే ఆరోపించారు. "మనం ప్రజల మధ్యకు వెళ్లాలి. వాస్తవాలను వారికి వివరించాలి. బీజేపీ కుట్రను బయటపెట్టాలి" అని అన్నారు.