విద్యాసంస్థల తీరుపై సీఎం అసంతృప్తి

ఫీజు రియంబర్స్‌మెంట్‌పై ఇప్పటికే సానుకూల చర్యలు తీసుకున్నామని తెలిపింది.;

Update: 2025-09-15 13:25 GMT

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్, వృత్తి విద్యా సంస్థలు బంద్ ప్రకటించాయి. తమకు ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశాయి. కాగా విద్యా సంస్థల తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫీజు రియంబర్స్‌మెంట్ వ్యవహారంలో ఇప్పటికే సానుకూల చర్యలు తీసుకుంటున్నా బంద్ ప్రకటించడంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు బంద్‌ను విరమించాలని, కళాశాలలను యథావిధిగా నడిపించాలని ప్రభుత్వం కోరింది. ఈ అంశంపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కలిసి కాలేజీల యాజమాన్యాలతో మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో అనేక అంశాలపై చర్చించాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అందులోనే ఫీజు రియంబర్స్‌మెంట్లపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ప్రభుత్వం తీరు సిగ్గుచేటు: కేటీఆర్

ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తాము 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులను చెల్లించామన్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఫీజు రియంబర్స్‌మెంట్‌లు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని విమర్శించారు. డబ్బులన్నీ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలకే ఖర్చు అవుతున్నాయని, ఫీజు రీయింబర్స్ మెంట్‌కు ఒక్క పైసా కూడా లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడం సిగ్గుచేటన్నారు. కాలేజీల బంద్‌ను ఆపి వెంటనే బకాయిలు చెల్లించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు గత కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన మూడు వేల కోట్ల రూపాయలను కూడా చెల్లించామన్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం డబ్బులు లేవన్న సాకుతో పెండింగ్ బకాయిలను ఇవ్వడం లేదని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజుల కోసంలేని డబ్బులు.. కమీషన్లు, కాంట్రాక్టులకు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News