‘ఇంత చేతకాని ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలా’

ప్రభుత్వం మారితే బకాయిలు కట్టారా? సర్కార్‌ను ప్రశ్నించిన ఈటల రాజేందర్.;

Update: 2025-09-15 15:32 GMT

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఇంత చేతకాని ప్రభుత్వాన్ని తాను ఎక్కడా, ఏనాడూ చూడలేదన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇబ్బంది పడని వర్గం ప్రజలు లేరన్నారు. అన్నం పెట్టే అన్నదాతల దగ్గర నుంచి విద్యార్థుల వరకు అంతా కూడా ఈ ప్రభుత్వం చేతకాని పాలన వల్ల నానాతిప్పలు పడుతున్నారని చురకలంటించారు. ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదని సెటైర్లు వేశారు. ఈ సర్కార్ గారెడి చేసి, మీడియా మేనేజ్ చేసి.. ఓవర్ లాపింగ్ టెక్నిక్ తో నెట్టుకు వస్తున్నారని విమర్శించారు. వాళ్ల డొల్లతనం ఇప్పటికే బయటపడిందని, గ్రామీణ ప్రజలకు కూడా తెలిసిపోయిందని అన్నారాయన.

రూపాయి కూడా ఇవ్వలే

‘‘విద్యార్థి లోకం బలిపీఠం ఎక్కినట్టు ఉంది. విద్యావ్యవస్థ ఖతం అయిపోతున్నట్టు ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం అందించే ఫీజు రియంబర్మెంట్ అందడం లేదు. గత ప్రభుత్వం రెండు సంవత్సరాలు.. కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సంవత్సరానికి దాదాపు 3 వేలకోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ ఖర్చు అవుతాయి. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తుంది అవి అందుతున్నాయి కానీ.. గత నాలుగేళ్లుగా.. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. రూ.9 వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి విద్యార్థుల దగ్గరే ఫీజులు వసూలు చేస్తున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వమే కారణం

‘‘ఫీజు రియంబర్స్మెంట్ తో చదువుకుంటున్నారని తల్లిదండ్రులు అనుకుంటే.. ఫీజులు కట్టాలనే పిడుగు లాంటి వార్త వల్ల వారు కట్టలేకపోతున్నారు. దీని వల్ల పై చదువులకు వెళ్లాలి అనుకున్న విద్యార్థులు, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనితో పాటు సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్ లలో డైట్ చార్జీలు 6 నెలలుగా ఇవ్వడం లేదు. దీనివల్ల ముదిరిపోయిన, పుచ్చు పట్టిన కూరగాయలు.. కల్తీ సరుకులతో సరిగా అన్నం పెట్టక అనేక చోట్ల విద్యార్థులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి కారణం ప్రభుత్వమే’’ అని విమర్శించారు.

మేధాశక్తిని చంపేస్తున్నారు రేవంత్

‘‘రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చారు. చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయలు కార్డు ఇస్తామన్నారు. బీసీలకు ప్రతి విద్యార్థికి మొత్తం ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. కానీ కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుగు పోయినట్టుగా విద్యార్థులు ఎవరికి ఫీజు రీయింబర్స్మెంట్లో అందడం లేదు. మేధాశక్తిని చంపేస్తున్నారు, నిర్వీర్యం చేస్తున్నారు ఇది సరికాదు. అనేకసార్లు చర్చలు జరిపినా ప్రయోజనం లేక.. గతిలేక గత్యంతరం లేక యాజమాన్యాలు కాలేజీలు బందు పెడతామన్నారు. ప్రభుత్వాలు మారినా పాత బకాయిలు కట్టాలి కదా. నేను గట్టిగా మాట్లాడితే ద్వేషిస్తున్నానని విమర్శిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులతో పాటు యాజమాన్యాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి వచ్చింది’’ అని అన్నారు. మీ పాలనలో నలిగిపోతున్న విద్యార్థుల, కాలేజీ సిబ్బంది వేదన పట్టించుకోండని ప్రభుత్వాన్ని కోరారు ఈటల.

గుండెలు మండిపోతున్నాయ్

‘‘బేషజాలకు పోకుండా సమస్యను పరిష్కరించండి అని బిజెపి ఎంపీగా డిమాండ్ చేస్తున్నాను. 25 ఏళ్లుగా నేను ఎన్నో ప్రభుత్వాలు చూసాను కానీ ఇంతట బాధ్యత రాహిత్యం ఇప్పుడే చూస్తున్నాను. ప్రజల్లో ఉన్న ప్రశాంతి ఊరికే పోదు. ప్రజల గుండెలు మండిపోతున్నాయి. పరిష్కారం చూపించకపోతే వారి ఆగ్రహానికి గురికాక తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. విద్యార్థి లోకం బలిపీఠం ఎక్కినట్టు ఉంది. విద్యావ్యవస్థ ఖతం అయిపోతున్నట్టు ఉంది. పిల్లల్ని ప్రోత్సహించాలని కానీ ఈ వ్యవస్థ చాలా బాడ్ గా ఉంది’’ అని అన్నారు.

Tags:    

Similar News