ఒకే రోజు 15 బిల్లులకు గెజిట్ నోటిఫికేషన్లు
కొత్త రికార్డు సృష్టించిన కర్ణాటక ప్రభుత్వం;
By : The Federal
Update: 2025-09-15 13:23 GMT
కర్ణాటక ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించింది. ఆగష్టు లో జరిగిన రాష్ట్ర శాసన సభ వర్షాకాల సమావేశాల్లో 39 బిల్లులు ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వం తరువాత కర్ణాటక ప్రభుత్వం గతవారం నోటిఫికేషన్లు జారీ చేసి, వాటిలో 15 బిల్లులను ఒకే రోజు(సెప్టెంబర్ 12) రాష్ట్ర గెజిట్ లో ప్రచురించి రికార్డు సృష్టించింది.
శాసనపరమైన ఈ ఉత్సాహం వెనక ఉన్న లక్ష్యం పరిపాలనా సంస్కరణలు, అభివృద్ది కార్యకలాపాలను వేగవంతం చేయడమే. 39 బిల్లులలో రెండింటిని తదుపరి సమీక్ష కోసం ఉమ్మడి కమిటీలకు పంపారు.
కొడగు బిల్లులు..
అవి కొడగు జిల్లాకు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రీ చట్టం, కర్ణాటక జనసమూహ నియంత్రణ(కార్యక్రమాలు, సమావేశ స్థలాలలో జనసమూహాన్ని నిర్వహించడం) బిల్లు. జూన్ లో బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో మరణాల నేపథ్యంలో దీనిని ప్రతిపాదించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఆటగాళ్లు తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చారు.
కొడగులో భూమికి సంబంధించిన బిల్లును గత నెలలో రాష్ట్ర చట్టం, పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి హెచ్ కే పాటిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొడగు నివాసితులకు సమస్యలను సృష్టించే కర్ణాటక భూ రెవెన్యూ చట్టం 1964 లోని నిబంధనలను సవరించడానికి ఈ చట్టం ప్రయత్నించింది. బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేయడానికి అసెంబ్లీ అంగీకరించింది.
అదే విధంగా రాజకీయ ర్యాలీలు పెద్ద ప్రజా కార్యక్రమాలలో ప్రజలను నిర్వహించడానికి జన సమూహాన్ని నియంత్రించే బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అసెంబ్లీ స్పీకర్ ముసాయిదా బిల్లును పరిశీలన కోసం హౌజ్ కమిటీకి సూచించాలని నిర్ణయించారు.
కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ.. మతపరమైన కుటుంబ, విద్యా, ప్రభుత్వ కార్యక్రమాలను బిల్లు పరిధికి వెలుపల ఉంచామని అన్నారు. అయితే రాజకీయ ర్యాలీలు, నిరసనలు, పెద్ద సమావేశాలు కూడా ఇందులో ఉన్నాయి.
ఇటువంటి కార్యక్రమాలలో ప్రాణ నష్టం జరిగితే జీవిత ఖైదు, ద్రవ్య జరిమానాతో సహ కఠినమైన శిక్ష చర్యలను బిల్లులో పేర్కొన్నారు.
32 బిల్లులకు గవర్నర్ ఆమోదం..
ప్రభుత్వం పంపిన 37 బిల్లులలో రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ 32 బిల్లులకు ఆమోదం తెలిపారు. ఆ తరువాత నోటిఫికేషన్లు జారీ చేయబడ్డాయి. బిల్లులు రాష్ట్ర గెజిట్ లో ప్రచురించబడ్డాయి.
సెప్టెంబర్ 2న ప్రభుత్వం కర్ణాటక వస్తువులు, సేవల పన్ను బిల్లును కర్ణాటక కేటాయింపు బిల్లును నోటిఫై చేసింది. సెప్టెంబర్ 9న అదనపు సవరణ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు.
ఒక బిల్లు ఇంకా గవర్నర్ ఆమోదం కోసం వేచి ఉండగా, మరొకటి సమర్పణకు చివరి దశలో ఉంది. ఇప్పటికే నోటిఫై చేయబడిన బిల్లులో కర్ణాటక ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెన్సెస్(సవరణ) బిల్లు, కగినేలే డెవలప్ మెంట్ అథారిటీ(సవరణ) బిల్లు ఉన్నాయి.
దీంతో నోటిఫికేషన్లు సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. సెప్టెంబర్ 10న కర్ణాటక అగ్నిమాపక దళం(సవరణ) బిల్లుతో సహ మరో ఐదు బిల్లులు ప్రచురించబడ్డాయి.
నోటిఫికేషన్ల రికార్డు..
సెప్టెంబర్ 12న కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర గెజిట్ ద్వారా 15 వేర్వేరు బిల్లులను నోటిఫై చేసింది. వాటిలో కొన్ని కర్ణాటక సహకార సంఘాల బిల్లు, కర్ణాటక రాష్ట్ర విశ్వ విద్యాలయాలు(సవరణ) బిల్లు, కర్ణాటక ప్లాట్ ఫాం ఆధారిత గిగ్ వర్కర్స్(సామాజిక భద్రత, సంక్షేమం) బిల్లు, గ్రేటర్ బెంగళూర్ గవర్నెన్స్ బిల్లు, ఇతరాలు ఉన్నాయి.