నిధులు విడుదల చేయండి.. మీరు లెక్కలు చూపండి: కేంద్రం వర్సెస్ బెంగాల్

కేంద్ర ప్రభుత్వం తమకు రావాల్సిన బకాయిలను విడుదల చేయడం లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.

Update: 2024-02-02 11:42 GMT
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

నిధుల విడుదలకు సంబంధించి ఈ రోజు ఆమె కోల్ కతలో రెడ్ రోడ్ ప్రాంతంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. నిధుల దుర్వినియోగానికి సంబంధించి కాగ్ ఇచ్చిన లెక్కలతోనే అవి ఆగినట్లు ఎదురుదాడికి దిగింది. అయితే మమతాబెనర్జీ ధర్నాకు దిగడాని కంటే ముందే జల్ జీవన్ మిషన్ పథకానికి సంబంధించి రూ. 1000 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

కేంద్రం నిధుల విడుదల విషయంలో బెంగాల్ పై వివక్ష చూపిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా నలుపు దుస్తులు ధరించి ధర్నా చేయాలని టీఎంసీ శ్రేణులకు సీఎం మమతా పిలుపునిచ్చారు. వివిధ పథకాలకు కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో పథకాలు అమలు సరిగా చేయలేకపోతున్నామని సీఎం మమతా బెనర్జీ విమర్శిస్తున్నారు.

రాష్ట్రానికి కేంద్ర పథకాలైన ఎంజీఎన్ఆర్జీఎస్, పీఎం గ్రామీణ అవాస్ యోజన కింద రూ 7000 కోట్లు రావాలని ఇలా మొత్తం అన్ని పథకాలకు సంబంధించి రూ. 1.5 లక్షల కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలని మమతా బెనర్జీ ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. పథకాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయో లేదో అనే అంశంపై దాదాపు 156 కేంద్ర బృందాలు రాష్ట్రానికి పరిశీలనకు వచ్చాయని, అయినా నిధులు విడుదల చేయడం లేదని సీఎం ఆరోపించారు.

గత వారం కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులను ఇదే విషయం మీద కలిశారని, అయితే నిధులు మాత్రం విడుదల కాలేదని అన్నారు. మమతా బెనర్జీ గత ఏడాది మార్చిలో కూడా ఇదే అంశంపై ధర్నాకు దిగారు. అలాగే గత ఏడాది డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.

బెంగాల్ ప్రభుత్వానికి నిధులు విడుదల చేయాలని టీఎంసీ నాయకుడు సుదీప్ బందోపాధ్యాయ లోక్ సభలో ప్రశ్నించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ " ముందు మీరు కాగ్ నివేదికను చూడండి" అని సమాధానమిచ్చారు.

రూ. 2 లక్షల కోట్ల నిధులు పక్కదారి పట్టించారు: బీజేపీ

రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం అవినీతికి అంతేలేకుండా పోయిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్ల నిధులను పక్కదారి పట్టించిందని, ముందు వాటికి లెక్కలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ విమర్శించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా ఇదే విషయాన్ని బయటపెట్టిందని, ఆయన నివేదికలోని అంశాలను ఉటంకిస్తూ మాట్లాడారు.

" ఆమె ప్రభుత్వం ప్రతి చోట ప్రజా ధనాన్ని దోచుకోవడానికి ప్రయత్నించింది. కాగ్ నివేదిక ఈ తప్పులన్నీఎత్తి చూపింది. ఇదీ నిజంగా చెంప దెబ్బలాంటిదే, ప్రజా ధనాన్ని టీఎంసీ నాయకులు తమ సొంత ధనంగా భావిస్తున్నారు" అని ఆయన న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అన్నారు.

నిర్ణీత సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేశాక 2.4 లక్షల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు దాఖలు చేయాల్సి ఉందని, అయితే వాటిని ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు. కాగ్ కూడా ఇదే విషయాన్ని ఎత్తి చూపిందని, అయినా దీదీ సర్కార్ లో మాత్రం ఎలాంటి చలనం లేదని విమర్శించారు.

ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు తీవ్రమైన అవినీతి జరిగిన కారణంగా ఆగిపోయాయని, పట్టణ, గ్రామీణ, పాఠశాల విద్యలో కూడా ఇచ్చిన డబ్బులు ఏమై పోయాయో ఎవరికి తెలియదని అన్నారు. విద్యాశాఖ మంత్రి అవినీతి కేసులో జైళ్లో కూర్చున్నారని మజుందార్ అన్నారు.

ఇదే అంశంపై ప్రతిపక్ష నాయకుడుల సువేందు అధికారి మాట్లాడుతూ " ఆడిట్ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనప్పటికీ వేలకోట్ల నిధులు వచ్చాయి, అంపాన్ తుఫాన్ కారణంగా ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 3750 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే అవన్నీ ఏమై పోయాయి. రాష్ట్రాన్ని కట్ మనీ సిండికేట్ లూటీ చేస్తోంది" అని విమర్శించారు.

ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ భేటీ అయ్యాక మాట్లాడారు. పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర నిర్దేశించిన వాటిని పాటించాక అన్నింటిని క్లియర్ చేస్తారని తనతో కేంద్రం చెప్పినట్లు వివరించారు. కేంద్రం నిధులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో ముద్రించాలని కూడా కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.

వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రస్తుత ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టినట్లు రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

Tags:    

Similar News