అయోధ్య రామాలయం: పాక్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం
మీ స్వదేశీ పరిస్థితులపై దృష్టి సారించాలని తలంటిన విదేశాంగ శాఖ
By : The Federal
Update: 2025-11-27 07:20 GMT
అయోధ్య రామాలయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగరవేసిన ధర్మ ధ్వజం(కాషాయ జెండా)పై పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇస్లామాబాద్ చేసిన వ్యాఖ్యలను తిరస్కరించినట్లు పేర్కొంది.
రామాలయంపై జెండా ఎగరవేయడం భారతీయ మైనారిటీ వర్గాలపై ఒత్తిడి తీసుకురావడానికి, ముస్లిం మైనారిటీ వర్గాల వారసత్వాన్ని తుడిచిపెట్టడానికి చేసిన ప్రయత్నమని పాకిస్తాన్ ఆరోపించింది.
కూల్చివేసిన బాబ్రీ మసీద్ స్థలంలో రామమందిరం నిర్మించడంతో పాక్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ మత విద్వేశాలకు కేంద్రంగా ఉందని, దానికి ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతికత లేదని అన్నారు.
‘‘మేము పాక్ చేసిన వ్యాఖ్యలను చూశాము. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మతతత్వం, మైనారిటీ అణచివేతలో చెత్త రికార్డు ఉన్న దేశం పాకిస్తాన్, అలాంటి దేశానికి భారత్ కు ఉపన్యాసాలు ఇచ్చే నైతికత హక్కు లేదు’’ అని జైస్వాల్ అన్నారు.
‘‘కపట లెక్చరర్లు ఇచ్చే బదులు, పాకిస్తాన్ తన దృష్టిని లోపలికి మళ్లించుకుని, దాని స్వంత దారుణమైన మానవ హక్కుల రికార్డుపై దృష్టి పెట్టడం మంచిది’’ అని జైస్వాల్ హితవు పలికారు.
సుప్రీంకోర్టు తీర్పు..
బాబ్రీ మసీద్ ను డిసెంబర్ 6, 1992 న మితవాద గ్రూపులు కూల్చివేశాయి. అక్కడే బాల రాముడిని ప్రతిష్టించి పూజలు చేయడం ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి దశాబ్ధాల తరబడి విచారణ జరిగింది.
2019 లో సుప్రీంకోర్టు ఈ స్థలం రామజన్మభూమిదే అని తీర్పు చెప్పింది. తీర్పు వచ్చిన మరసటి ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి పునాది వేశారు. నాలుగు సంవత్సరాల తరువాత ఆలయం సంపూర్ణంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. చివరగా శ్రీరామరాజ్యానికి ప్రతీకగా అయిన ధర్మధ్వజం ఎగరడంతో పూర్ణహుతి పూర్తయింది.
నేపథ్యం..
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం 22 అడుగుల కాషాయ జెండాను ఎగరవేసి సంబంధిత క్రతువును పూర్తి చేశారు. పండితుడు గణేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 108 మంది పూజారులు విశిష్ట పూజలు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
కార్యక్రమం పూర్తయిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘‘500 సంవత్సరాల తరువాత రామాలయ సంకల్పం నెరవేరింది. ఆయోధ్య చరిత్రలో మరో యుగ పురాతన సంఘటన చూస్తోంది.
దేశం, ప్రపంచం మొత్తం రాముడి భక్తిలో మునిగిపోయాయి’’ అని ఆయన అన్నారు. కొత్తగా ఎగరవేసిన కాషాయ జెండా లంబకోణం, త్రిభుజాకారంలో ఉంటుంది.
ఇందులో సూర్యుడి చిహ్నంతో పాటు రామరాజ్యానికి ప్రతీక అయిన కోవిదార వృక్ష చిహ్నం ఉంది. ఈ చిహ్నం శాశ్వత శక్తి, దైవ తేజస్సు, ధర్మం, జ్ఞానోదయం, సాంప్రదాయకంగా శ్రీ రాముడితో ఉన్న ఇతర లక్షణాలను సూచిస్తుంది.