‘ఢిల్లీ చలో’: దేశ రాజధాని చుట్టూ భద్రత కట్టుదిట్టం
పంటలకు కనీస మద్ధతు ధర సహ ఇతర డిమాండ్ల సాధనకు కిసార్ మజ్దూర్ మోర్చా తో పాటు 200 ల కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ‘ఢిల్లీ చలో’ కి పిలుపునిచ్చాయి.
ఫిబ్రవరి 13 న దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టాలని ‘ఢిల్లీ చలో’ మార్చ్ కు పిలుపునిచ్చిన రైతు సంఘాలతో చర్చించేందుకు కేంద్రం ఆహ్వానం పంపినట్లు సమాచారం బయట వినిపిస్తోంది.
కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానందరాయ్ లతో కూడిన బృందం సంయుక్త కిసాన్ మోర్చాతో కూడిన ప్రతినిధులతో సమావేశం జరిపేందుకు అంగీకరించింది. కేంద్రమంత్రులు ఫిబ్రవరి 12న చండీగఢ్ వస్తారని రైతు నాయకుడు సర్వన్ సింగ్ నిన్న మీడియాకు వెల్లడించారు. రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చిన ఢిల్లీ మార్చ్ కు ఒక రోజు ముందు ఢిల్లీలోని సెక్టార్ 26 లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ సమావేశం జరుగుతుందని తాజాగా సమాచారం అందుతోంది.
ఫిబ్రవరి 8 వ తేదీనే ముగ్గురు కేంద్రమంత్రులతో కూడిన బృందం రైతులతో సమావేశం నిర్వహించారు. ఇందులో పంటలకు కనీస మద్ధతు ధర కు హమీ ఇచ్చే చట్టంతో పాటు తమ ఇతర డిమాండ్ల కోసం ఒత్తిడి చేయడానికే ‘ఢిల్లీ చలో’ మార్చ్ కు నిర్వహిస్తున్నట్లు రైతు సంఘాల నాయకులు చెబుతున్న మాట. ఈ సమావేశ ఏర్పాట్ల కోసం రైతు నాయకులతో సమన్వయం చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. త్వరలో రెండో విడత సమావేశం కూడా నిర్వహిస్తామని కేంద్ర మంత్రులు హమీ ఇచ్చారని రైతు నాయకులు తెలిపారు.
భద్రతను కట్టుదిట్టం చేసిన హర్యానా
ఈ మార్చ్ లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఊహించిన హర్యానా ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించేందుకు భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించింది. ఏడు జిల్లాల్లో ఇంటర్ నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేయాలని శనివారమే ఆదేశించింది. పంజాబ్ రైతులు హర్యానాలోకి ప్రవేశించకుండా రోడ్ల వెంట బారికేడ్లు, ముళ్ల తీగలు వేశారు. వీటికి సంబంధించిన వీడియోలను పలువురు రైతులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
హర్యానాలోని పలు జిల్లాల్లో సెక్షన్ 144 విధించారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వ్వూల్లో అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఫిబ్రవరి 13 వరకు ఇంటర్ నెట్ సేవలు నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. "అడిషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కు, సీఐడీ హర్యానా ఫిబ్రవరి 10 నాటి పరిస్థితులు, రైతుల పిలుపు దృష్టిలో పెట్టుకుని ప్రజాశాంతి, ప్రశాంతతకు భంగం కలుగకుండా ఈ ముందస్తు చర్యలు తీసుకోవాలి అని " హర్యానా అదనపు ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తప్పుడు సమాచార వ్యాప్తి, పుకార్లు జరగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు ప్రజా ఆస్తులు, సౌకర్యాలకు నష్టం జరగుతుందనే ముందస్తు సమాచారం ఉందనే నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొబైల్ కాల్స్ మినహ అన్నిసేవలు ప్రభుత్వం విధించిన గడువువరకు పని చేయవని పేర్కొంది.
దీనిపై కిసాన్ మజ్డూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి వంధేర్ మాట్లాడుతూ.. ఏడు జిల్లాల్లో మొబైల్ సేవలు, ఇంటర్నేట్, ఎస్ఎంఎస్ లు నిలిపివేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 13న దేశ రాజధానికి యాత్ర చేయడానికి దేశ రైతులు యాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.