నా తల్లిని ఎలా కించపరుస్తారు: ప్రధాని మోదీ ఆగ్రహం
రాజకీయాల్లో లేని వారిపై విమర్శలు చేయడం ఏంటనీ ప్రశ్నలు;
By : The Federal
Update: 2025-09-02 11:48 GMT
తన దివంగత తల్లి పై కాంగ్రెస్, ఆర్జేడీ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తన తల్లిని దుర్భాషలాడాయని ఆరోపించారు. రాజకీయాలతో సంబంధం లేని తన తల్లిని ఆర్జేడీ, కాంగ్రెస్ రాజకీయ వేదికపై అవమానించాయని ప్రధాని అన్నారు.
‘‘మీలాంటి కొట్లాది మంది తల్లులకు సేవ చేయడానికి నా తల్లి నన్ను ఆమె నుంచి వేరు చేసింది. ఇప్పుడు నా తల్లి జీవించి లేదని మీ అందరికి తెలుసు. కొంతకాలం క్రితం వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరువాత ఆమె మనందరిని విడిచిపెట్టింది’’ అని బీహార్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.
మహిళా వ్యవస్థాపకులకు నిధులు సులభంగా అందుబాటులో ఉండేలా ‘బీహార్ రాజ్య జీవితా నిది సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్’ ను ప్రారంభించిన తరువాత మాట్లాడారు.
‘‘రాజకీయాలతో సంబంధం లేని నా తల్లి లేదు. నా తల్లిని ఆర్జేడీ, కాంగ్రెస్ నాయకులు రాజకీయాల్లోకి లాగారు. సొదరీమణులారా, తల్లులారా నేను మీ ముఖాలను చూడగలను. మీరు అనుభవించిన బాధను నేను ఊహించగలను. కొంతమంది తల్లుల కళ్లలో నేను కన్నీళ్లను చూడగలను. ఇది చాలా విచారకరం, బాధాకరమైనది’’ అని మోదీ అన్నారు.
‘‘నా తల్లి మమ్మల్ని అందరిని అత్యంత పేదరికంలో పెంచింది. ఆమె ఎప్పుడూ తనకోసం కొత్త చీర కొనుక్కోలేదు. మా కుటుంబం కోసం ప్రతి పైసాను పొదుపు చేసింది. నా తల్లిలాగే నా దేశంలోని కొట్లాది మంది తల్లులు ప్రతిరోజు ఈ తపస్సు చేస్తారు’’ అని మోదీ చెప్పారు.
‘‘తల్లిని దుర్వినియోగం చేసే మనస్తత్వం, సోదరిని దుర్వినియోగం చేసే మనస్తత్వం, మహిళలను బలహీనులుగా భావిస్తుంది. ఈ మనస్తత్వం మహిళలను దోపిడి, అణచివేతకు గురి చేసే వస్తువులుగా భావిస్తుంది.
అందువల్ల మహిళా వ్యతిరేక మనస్తత్వం అధికారంలోకి వచ్చినప్పుడల్లా, తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు ఎక్కువగా నష్టపోయారు. ఆర్జేడీ యుగంలో బీహార్ లో నేరాలు, నేరస్థులు ప్రబలంగా ఉన్నారు.
హత్య, అత్యాచారాలు సాధారణంగా జరిగేవి. నేరస్థులకు రక్షణ కల్పించేవి. ఆ ఆర్జేడీ పాలన భారాన్ని ఎవరూ భరించాల్సి వచ్చింది? బీహార్ మహిళలు దానిని భరించాల్సి వచ్చింది’’ అని ఆయన అన్నారు.