‘‘ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్’’ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం
జైలులో ఉంచడానికే ‘‘పీఎంఎల్ఏ’’ నిబంధనలు ఉపయోగిస్తున్నారని మండిపాటు;
By : The Federal
Update: 2025-02-13 10:32 GMT
దేశంలో వరకట్న నిరోధక చట్టం, గృహ హింస నిరోధక చట్టంలోని సెక్షన్లను దుర్వినియోగం చేసినట్లుగా మనీలాండరింగ్ చట్టం(పీఎంఎల్ఏ) చట్టాన్ని కూడా మీరు వాడుకుంటున్నారా అని సుప్రీంకోర్టు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ని తీవ్ర స్థాయిలో మందలించింది.
నిందితుడిని జైలులో పెట్టడానికే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అంటూ నిలదీసింది. చత్తీస్ గఢ్ కు చెందిన మాజీ ఎక్సైజ్ అధికారి అరుణ్ పాటి త్రిపాఠికి బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
చత్తీస్ గఢ్ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో ఆయన దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం.. ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.
దుర్వినియోగం చేస్తున్నారా?
పీఎంఎల్ఏ చట్టం భావన ఒక వ్యక్తి జైలులో ఉండాలని కాదు. అభియోగం కోర్టు కొట్టివేసిన తరువాత కూడా ఆ వ్యక్తిని జైలులో ఉంచాలనే ధోరణి ఉంటే ఏమి చెప్పగలం. 498ఏ కేసులలో ఏమి జరిగిందో చూడండి. పీఎంఎల్ఏ కూడా అలాగే దుర్వినియోగం చేస్తున్నారా? అని బెంచ్ ప్రశ్నించింది.
భారత శిక్షాస్మృతిలో సెక్షన్ 498ఏ వివాహిత స్త్రీలు, వారి భర్తలను,వారి బంధువుల నుంచి రక్షించేసుకు ఉపయోగపడేది. కానీ వాస్తవానికి దానిని ఎలా ఉపయోగిస్తున్నారో చూస్తున్నామని వ్యాఖ్యానించింది.
అయితే విచారణ సందర్భంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తరఫున హజరైన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు నిందితుడికి బెయిల్ మంజూరు చేయడాన్ని వ్యతిరేకించారు. సాంకేతిక కారణాలను చూపి మోసగాళ్లను తప్పించుకోవడానికి వీలులేదని వాదించారు. ఈ పిటిషన్ కు అనుమతి లేదని, పిటిషనర్ కు బెయిల్ ఇవ్వడం అసంబద్దమని అన్నారు.
ఇది షాకింగ్: న్యాయస్థానం..
‘‘ ఈ కేసును రద్దు చేసినట్లు ఈడీకి తెలిసినప్పటికీ దీనిని అణచివేయడం దిగ్భ్రాంతికరం. మేము అధికారులను పిలిపించాలి. ఈడీ దీనిపై వివరణ ఇవ్వాలి. మనం వ్యవస్థకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాం. విచారణకు సంబంధించిన ఆర్డర్ ను రద్దు చేసినప్పటికీ ఆ వ్యక్తి కస్టడీలో ఉన్నాడు’’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణానికి సంబంధించి ఛత్తీస్ గఢ్ హైకోర్టు బెయిల్ నిరాకరించిన తీర్పును సవాల్ చేస్తూ ఇండియన్ టెలికాం సర్వీసెస్ అధికారి త్రిపాఠి దాఖలు చేసిన అప్పీల్ ను సుప్రీంకోర్టు విచారించింది.
చత్తీస్ గఢ్ స్టేట్ లేదా మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రత్యేక కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ గా డిప్యూటేషన్ పై పనిచేసిన త్రిపాఠిని ఈడీ దర్యాప్తు తరువాత అరెస్ట్ అయ్యారు. రాయ్ పూర్ లోని ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ముందస్తు నేరం ఆధారంగా భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రైవేట్ వ్యక్తులతో కూడిన క్రిమినల్ సిండికేట్ మద్యం వ్యాపారం నుంచి అక్రమ ఆదాయాన్ని దోచుకోవడానికి రాష్ట్ర ఎక్సైజ్ విధానాలను తారుమారు చేసిందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది.